ముక్కుసూటిగా వ్యవహరిస్తున్న కలెక్టర్ వైఖరి ఇప్పుడు టీడీపీ నేతలకు నచ్చడంలేదు. అన్నింట్లోనూ తామే సుప్రీం అనిపించుకోవాలని అనుకుంటే ఈయన కనీసం పట్టించుకోవడంలేదని యుద్ధానికి సన్నద్ధమయ్యారు.
ఎందుకు: ఉపాధి నిధులతో చేపట్టే పనులు తమ ప్రమేయం లేకుండా మంజూరు చేసేశారు. పంచాయతీలు తీర్మానం ఇస్తే సరిపోతుందన్న పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాలు తూచా తప్పకుండా అమలు చేశారు.
ఏం చేస్తారు: ఆయనతో తాడోపేడో తేల్చుకోవాలని అనుకుంటున్నారు. తమను కాదని పనులు మంజూరు చేయడంపై జిల్లా పరిషత్ సమావేశం వేదికగా కడిగేయాలని నిర్ణయించుకున్నారు. అంతేనా...: అంతేగాదు... ముఖ్యమంత్రి దృష్టికి విషయం తీసుకెళ్లాలని... అవసరమైతే పదవులకు రాజీనామా అస్త్రాన్ని సంధించాలని యోచించారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లా కలెక్టర్ ఎం.ఎం.నాయక్‌పై టీడీపీ జెడ్పీటీసీ, ఎంపీపీలు యుద్ధానికి సన్నద్ధమవుతున్నారు. జెడ్పీ, మండల పరిషత్ ప్రమేయం లేకుండా పంచాయతీల తీర్మానాలతో ఉపాధి పనులు మంజూరు చేయడంపై వారంతా హర్ట్ అయ్యారు. తమనేమాత్రంపట్టించుకోకపోవడంపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. రెండు మూడు రోజుల్లో జిల్లా పరిషత్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సభా వేదికగా నిలదీయాలన్న నిర్ణయానికొచ్చారు. ఆ తర్వాత సీఎం వద్దకు నేరుగా వెళ్లి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు.
అసలు ఏమైంది?
జిల్లాలోని 921పంచాయతీల్లో అంతర్గత రహదారులు వేసేందుకు ప్రణాళిక రూపొందించారు. కేంద్రం నుంచి పంచాయతీలకు వచ్చే ఆర్థిక సంఘం నిధులతో ఉపాధి హామీ పథకం నిధుల్ని భాగస్వామ్యం చేసి పనులు చేపట్టేందుకు కార్యాచరణ చేపట్టారు. ఫిఫ్టీ... ఫిఫ్టీ... నిష్పత్తిలో నిధులు ఖర్చు పెట్టనున్నారు. ఈ లెక్కన వచ్చే ఐదేళ్లలో రూ. 800కోట్లతో 14వేల అంతర్గత రహదారులు నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 107కోట్లతో పనులు కేటాయించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడీ పనుల మంజూరు విషయంలో వివాదం చోటు చేసుకుంది. మొన్నటి వరకు మండల పరిషత్, జిల్లా పరిషత్ ఆమోదంతో ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపొనెంట్ పనులను మంజూరు చేసేవారు. ఈ సారి పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీల తీర్మానంతోనే కలెక్టర్ పనులు మంజూరు చేశారు. ఇప్పటికే రూ. 60కోట్లకు పైగా పనులను మంజూరు చేశారు. మిగతా పనుల్ని కూడా పంచాయతీ తీర్మానాల ఆధారంగా మంజూరు చేస్తూ వస్తున్నారు. దీనివల్ల మండల పరిషత్, జెడ్పీ ప్రమేయం లేకుండా పోయింది.
పచ్చనేతలకు నచ్చని కలెక్టర్ నిర్ణయం
కలెక్టర్ వ్యవహరించిన తీరు టీడీపీ జెడ్పీటీసీ, ఎంపీపీలకు నచ్చలేదు. తమ తీర్మానాల్లేకుండా పంచాయతీలకు ఉపాధి పనులు ఎలా మంజూరు చేస్తారని, కలెక్టర్ తీరు సరికాదని ఆ పార్టీ ప్రజాప్రతినిధులు అక్కసు వెళ్లగక్కుతున్నారు. తమను కించ పరుస్తున్నారని, ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ఏం చేయలేకపోయామని, ఉపాధి పనులను సైతం తమనుంచి దూరం చేశారని తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ఈ విషయంలో కలెక్టర్‌తో తాడోపేడో తేల్చుకోవాలన్న నిర్ణయానికొచ్చారు. దీనికి జెడ్పీ నేతొకరు నాయకత్వం వహించడానికి ముందుకొచ్చారు. ఆ నేత కనుసన్నల్లో కార్యాచరణ రూపొందించుకున్నారు.
జెడ్పీ గెస్ట్‌హౌస్‌లో రహస్య సమావేశం
తీవ్ర అసంతృప్తితో ఉన్న టీడీపీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు గురువారం సాయంత్రం జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి 25మంది వరకు నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ని లక్ష్యంగా చేసుకుని పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంపీపీ, జెడ్పీటీసీలను కలెక్టర్ కనీసం పట్టించుకోవడం లేదని, ఆయన వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని సుదీర్ఘంగా చర్చించుకున్నారు. రెండు మూడురోజుల్లో జిల్లా పరిషత్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఉపాధి పనులు మంజూరు విషయమై చర్చించాలని, అదే వేదికగా కలెక్టర్‌ను నిలదీయాలన్న నిర్ణయానికొచ్చినట్టు తెలిసింది. అలాగే, మంత్రి మృణాళిని, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి దృష్టికి తీసుకెళ్లడమే గాకుండా సీఎం అపాయింట్‌మెంట్ తీసుకుని మూకుమ్మడిగా వెళ్లి కలెక్టర్‌పై ఫిర్యాదు చేయాలన్న యోచనకొచ్చినట్టు తెలిసింది. అవసరమైతే రాజీనామా చేద్దామనే బెదిరింపులకు కూడా దిగాలన్న చర్చ జరిగినట్టు తెలియవచ్చింది.
కలెక్టర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం
స్పెషల్ ఆఫీసర్ పాలనలో జిల్లా కలెక్టర్‌కు అధికారం ఉంటుందనీ, ఎలెక్టడ్ బాడీ ఉన్నప్పుడు తాను ఆర్డర్ ఇచ్చాను. ఆమోదించండని కలెక్టర్ అనడం సరికాదని డెంకాడ ఎంపీపీ కంది చంద్రశేఖర్ రహస్య సమావేశం అనంతరం మీడియా ముందుకొచ్చి వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకు వెళ్తామనీ జెడ్పీ వైస్ చైర్మన్ బలగం కృష్ణంమూర్తినాయు డు తెలిపారు. దీనిపై పదవులు చేపట్టి ఏడాదిన్నర అవుతున్నా ఎటువంటి పనులు చేసుకోలేకపోతున్నామన్న భావన ఎంపీపీ, జెడ్పీటీసీల్లో ఉందని, దీన్ని కేంద్రమంత్రి ఆశోక్‌గజపతిరాజు, రాష్ట్ర మంత్రి కిమిడి మృణాళిని, జెడ్పీ చైర్ పర్సన్ శోభస్వాతిరాణి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సమావేశమైనట్టు చెప్పారు.
కలెక్టర్‌పై యుద్ధం
Published Fri, Jan 22 2016 1:07 AM | Last Updated on Thu, Mar 21 2019 8:16 PM
Advertisement
Advertisement