కలెక్టర్‌ను టార్గెట్ చేసిన ఆ ముగ్గురు ! | TDP MLAs Target to Collector | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ను టార్గెట్ చేసిన ఆ ముగ్గురు !

Published Wed, Dec 10 2014 1:55 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

కలెక్టర్‌ను టార్గెట్ చేసిన ఆ ముగ్గురు ! - Sakshi

కలెక్టర్‌ను టార్గెట్ చేసిన ఆ ముగ్గురు !

 ఆధిపత్యమే పరమావధిగా జిల్లా టీడీపీలో కుమ్ములాటలు కొనసాగుతున్నాయి.  తమను ఎన్నుకున్న ప్రజల సంక్షేమానికి పని చేయవలసిన ప్రజాప్రతినిధులు సొంతలాభం కోసం, తమ మాట నెగ్గడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. పట్టుకోసం అర్రులుచాస్తున్న ముగ్గురు ఎమ్మెల్యేలు మొదట అధికారులను, తరువాత జెడ్పీ చైర్‌పర్సన్‌ను, అనంతరం మంత్రి మృణాళిని, ఇప్పుడు తాజాగా కలెక్టర్‌ను టార్గెట్ చేశారు. నాయక్ బదిలీయే లక్ష్యంగా  టీడీపీ నాయకులు  ఎత్తులు వేస్తున్నారని సమాచారం.
 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం :  అధికార పార్టీకి చెందిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. జిల్లాలో పట్టు సాధించడం కోసం  పథకం ప్రకారం పావులు కదుపుతున్నారు.   అటు అధికారులను, ఇటు కీలక పదవుల్లో ఉన్న నేతల్ని తమ దారికి తెచ్చుకునేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. దారికి రాని వారిపై అసమ్మతి గళం విప్పుతున్నారు. ఏదోఒక నెపంతో తమ అధినేత, సీఎం చంద్రబాబునాయుడికి  ఫిర్యాదులు చేస్తున్నారు.  జిల్లాలో వరుసగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు సాక్ష్యం. తొలుత వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులపై గురి పెట్టారు. ఆ తర్వాత  జెడ్పీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణిని టార్గెట్ చేశారు.  కొన్ని రోజులగా  మంత్రి మృణాళిని లక్ష్యంగా ఆరోపణలు గుప్పించారు. తాజాగా కలెక్టర్ ఎం.ఎం.నాయక్‌ను టార్గెట్ చేశారు. అసమ్మతి గళం విప్పో, భయపెట్టో, ఫిర్యాదుల చేస్తూ తమ దారి తెచ్చుకునేందుకు యత్నిస్తున్నారు. వీళ్లనే పదవుల్లేని నేతలు సైతం అనుసరిస్తున్నారు.
 
 అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ హయాంలో నియమితులైన పలువురు  అధికారులపై  ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు గురి పెట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు  తమను ముప్పతిప్పలు పెట్టారని అక్కసు వెళ్లగక్కారు. అధికారిక సమావేశాల్లో ఒంటి కాలిపై లేచారు. దీంతో సంబంధిత అధికారులు వేగలేకపోయారు.  ఆ నేతల సన్నిహితుల ద్వారా వారి బలహీనతలను తెలుసుకున్నారు. ఆ మేరకు ఆశ్రయించారు. ఈ క్రమంలో దారికొచ్చిన వారికి జిల్లాలో ఉండేందుకు క్లియరెన్స్ ఇచ్చారు. ఆశ్రయించని వారికి  బదిలీ దారి చూపించారు.
 
 అధికారులపై దృష్టి సారించినప్పుడే జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణిని లక్ష్యంగా చేసుకున్నారు. జెడ్పీలో తమ పట్టు నిలుపుకునేందుకు పావులు కదిపారు.  ముఖ్యంగా పంచాయతీరాజ్ డీఈఈ శ్రీనివాస్‌ను ఎలాగైనా ఇక్కడే ఉంచాలని తెగ ప్రయత్నించారు.  అంతటితో ఆగకుండా జెడ్పీ అకౌంట్ ఆఫీసర్ పోస్టులో తమ అనుకూల వ్యక్తిని నియమించుకోవాలని పరితపించారు.
 
 జెడ్పీలో రెండో పవర్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు తెరవెనుక పావులు కదిపారు. జెడ్పీ వైస్ చైర్మన్ బలగం కృష్ణమూర్తికి జెడ్పీలో ప్రత్యేక చాంబర్ ఏర్పాటు చేయించాలని మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ద్వారా ఒత్తిడి తెచ్చారు. ఈ విధంగా అన్నీ వైపులా జెడ్పీ చైర్‌పర్సన్‌ను లక్ష్యంగా చేసుకుని అడుగులేశారు. అనూహ్యంగా మొదట్లో విభేదించుకున్నవారంతా  ఇప్పుడు ఒక్కటయ్యారు.  ఒక కూటమిగా ఏర్పడ్డారు. చెప్పాలంటే ఆ ఎమ్మెల్యేల బాటలో జెడ్పీ చైర్‌పర్సన్ నడుస్తున్నారన్న వాదనలు విన్పిస్తున్నాయి.
 
 ఒకప్పుడు జెడ్పీ చైర్‌పర్సన్‌ను వ్యతిరేకించిన నేతలంతా ఇప్పుడు ఒక్కటై మంత్రి మృణాళినిని టార్గెట్ చేశారు. తమకు గౌరవివ్వడం లేదని,  బదిలీల్లో తమ సిఫారసులను పరిగణలోకి తీసుకోలేదని,  పలు వ్యవహారాలకు అడ్డు తగులుతున్నారన్న ఆక్కసుతో మంత్రిపై అంతర్గత పోరుకు ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, మంత్రి కూడా తామేమి తక్కువ కాదన్నట్టు ప్రతిఘటిస్తున్నారు. వీరి ఎత్తులకు పైఎత్తులేస్తూ తిప్పికొడుతున్నారు. ఈ క్రమంలో ఒక్కొక్కరి అడ్డగోలు వ్యవహారాలను నివేదికల రూపంలో  సీఎంకు అందజేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి అటు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు, ఇటు మంత్రికి నువ్వానేనా అన్నట్టు పోరు నడుస్తోంది.  
 
 ఒకవైపు మంత్రిని లక్ష్యంగా చేస్తూనే మరోవైపు కలెక్టర్‌ను కూడా టార్గెట్ చేశారు. మంత్రి చెప్పినట్టుగా నడుచుకుని తమను విస్మరిస్తున్నారని ఆ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తహశీల్దార్లు, ఈఓ పీఆర్‌డీలు, ఇతర అధికారుల బదిలీల విషయంలో తమ సిఫారసులను కలెక్టర్  పట్టించుకోలేదని, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల నియామకాల విషయంలో సూచించిన విధంగా చేయలేదని, పాలనాపరమైన విషయాల్లో కూడా తమకేమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆవేదనతో ఉన్నారు. ఎంత చెప్పినా దారికి రాలేదని ఇటీవల సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లారు.  ఈ సందర్భంగా చాలా విషయాలు చెప్పే ప్రయత్నం చేసినా అన్నీ వినలేనని, ఏదైనా ఉంటే కాగితంపై రాసి ఇవ్వాలని చెప్పడంతో కాస్త కంగుతిని వెనక్కి వచ్చేశారు. అలాగని వదల్లేదు. ఏదో ఒక విధంగా కలెక్టర్‌ను ఇబ్బంది పెట్టి ఆయన్ని బదిలీ చేయించే లక్ష్యంతో పావులు కదుపుతున్నారని సమాచారం.        

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement