
ఏపీ నూతన మంత్రివర్గంలో పదవుల పందేరం విజయనగరం జిల్లాలో అసంతృప్తి జ్వాలలకు కారణం అయింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరుగుతుండగానే జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల టీడీపీ వాట్సప్ గ్రూపుల్లో పార్టీ కార్యకర్తలు నాయకత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మంత్రి పదవులు దక్కని వారంతా సీనియర్ నేత అశోక్ గజపతి రాజు తీరుపై మండిపడుతున్నారు. విజయనగరం రాజు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరు?
ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గ కూర్పుతో విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీలో మంటలు రేగుతున్నాయి. మంత్రి పదవులు తప్పనిసరిగా దక్కుతాయనుకున్నవారికి పార్టీ అధినేత చంద్రబాబు షాక్ ఇచ్చారు. చంద్రబాబు, బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చర్చల వరకు మంత్రి పదవులు లిస్ట్ లో చీపురుపల్లి ఎమ్మెల్యే కళావెంకటరావు, బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన పేర్లు ఉన్నాయని స్థానికంగా ప్రచారం జరిగింది.
అయితే అనూహ్యంగా గవర్నర్ కు ఇచ్చిన జాబితాలో వీరిద్దరి పేర్లు మాయం అయ్యాయి. సీనియర్లకు బదులుగా ఎన్నికలకు రెండు నెలల ముందు పార్టీలోకి వచ్చి టికెట్ కొట్టేసిన ఎన్.ఆర్.ఐ, గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్ కు మంత్రి పదవి దక్కింది. పార్టీ కోసం ఏనాడు పనిచేయని శ్రీనివాస్ కు మంత్రి పదవి ఎలా ఇస్తారని సీనియర్ లు దుమ్మెత్తి పోస్తున్నారు.
విజయనగరం జిల్లా రాజకీయాల్లోకి కళా వెంకట్రావు రాకను అశోక్ గజపతిరాజు తొలినుండి అడ్డుకుంటూనే ఉన్నారు. కళా వెంకటరావు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుండి వీళ్ల మద్య విభేదాలు ఉన్నాయనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల టికెట్ ఆశించిన కళావెంకటర్రావుని విజయనగరం జిల్లా చీపురుపల్లి నుండి పోటీకి దింపారు.
ఇక్కడ బొత్స సత్యన్నారాయణపై గెలిస్తే మంత్రి పదవి దక్కుతుందని చంద్రబాబు చెప్పినట్టు అప్పట్లో జిల్లాలో వార్తలు వినిపించాయి. చంద్రబాబు హామీ మేరకు..ఎన్నికల్లో విజయం సాధించిన కళావెంకటరావు మంత్రి పదవి ఆశించారు. విజయనగరం జిల్లా టిడిపిలో కూడా కళాకే మంత్రి పదవి అంటూ హోరెత్తించారు. మరో పక్క బొబ్బిలి ఎమ్మెల్యే బేబి నాయనకు కూడా చంద్రబాబు మంత్రి పదవి హామీ ఇచ్చారని ఎన్నికల ప్రచారంలోనే ఆయన చెప్పుకున్నారు.
ఇక్కడే జిల్లాలో సీనియర్ నేత, మాజీ కేంద్రం మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. బొబ్బిలి రాజులకు విజయనగరం రాజులకు ఉన్న శతాబ్దాల వైరం కారణంగా.. ఇప్పుడు బొబ్బిలి రాజ వంశస్తుడు అయిన బేబినాయనకి మంత్రి పదవి దక్కకుండా అశోక్‌గజపతరాజు అడ్డు చక్రం వేశారని సమాచారం. ఇదే విషయం బొబ్బిలి టిడిపి వాట్సప్ గ్రూపుల్లో హల్ చల్ చేసింది. దీనికి బేబినాయన కూడా వాయిస్ మెసేజ్ ద్వారా కేడర్ కు సమాధానం చెప్పుకున్నారు.
రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు కళా వెంకటరావుకు, అశోక్ గజపతిరాజు, ప్రస్తుత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడులతో గతంలో ఉన్న విభేదాలే ఆయనకు మంత్రి పదవిని దూరం చేశాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నుండి కళా వెంకటరావును అచ్చెన్నాయుడు తరిమేయగా, విజయనగరం జిల్లాలో బొత్స సత్యన్నారాయణ లాంటి ఉద్దండుడుపై ఓటమి తప్పదనే పోటీకి అవకాశం ఇచ్చారు. అయితే ఎవరూ ఊహించని విధంగా కళా వెంకటరావు గెలిచారు. అయినప్పటికీ ఆయనకు మంత్రి పదవి రాకుండా అశోక్ గజపతి రాజు అడ్డుకున్నారంటూ జిల్లాలో చర్చసాగుతోంది.
రాజాం, ఎస్.కోట నియోజకవర్గాల నుండి గెలిచిన కొండ్రు మురళీ మోహన్, కోళ్ల లలిత కుమారి కూడా మంత్రి పదవి ఆశించిన వారిలో ఉన్నారు. సామాజికవర్గం ప్రాధాన్యతల దృష్ట్యా అవకాశం కోసం లాబీయింగ్ చేసుకున్నా వీళ్లకూ అశోక్ గజపతి రాజు ఆశీస్సులు దక్కలేదు. విజయనగరం జల్లాలో మంత్రిపదవులు ఆశించి భంగపడ్డ సీనియర్ల అసంతృప్తికి అశోక్ గజపతిరాజే కారణం అని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి.