ఆ కష్టాలు మాకొద్దు ‘రాజా’..!
రాజరిక పాలనను వ్యతిరేకిస్తున్న విజయనగరం వాసులు
ఎన్నికల్లో గెలిచి కోటకే పరిమతమైన వారు మాకొద్దంటున్న జనం
కరోనా కష్టకాలంలో కోటదాటి బయటకు రాని రాజులు
2014–19 మధ్యలో కేంద్ర మంత్రిగా చేసిన ఒక్క మంచిపని చెప్పండంటూ ప్రశ్న
దాహార్తితో అల్లాడినా పట్టించుకోని వైనం
రోడ్ల విస్తరణ పనులను పక్కన పెట్టిన దుస్థితి
శివారు కాలనీల్లో సదుపాయాల కల్పనపై అశోక్ చిన్నచూపు
చారిత్రక విజయనగర వైభవాన్నిమసకబారించేలా పనితీరు..
నాటికి నేటికీ తేడా చూడండంటూ వేలెత్తి చూపుతున్న ప్రజలు
విజయనగరం: విజయనగరం.. చారిత్రక నేపథ్యం కలిగిన నగరం. ఏళ్ల తరబడి రాజుల పాలనలో ఉన్నా అభివృద్ధి శూన్యం. రాజులను నమ్మి జనం అధికారం కట్టబెట్టినా అది అలంకార ప్రాయంగానే చూశారు. ప్రజల కష్టాలు అరణ్యరోదనగానే మిగి లాయి. ఏ నాడూ ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్న ధ్యాస, మంచిచేయాలన్న తపన రాజరిక కుటుంబానికి లేకపోవడమే దీనికి కారణం. ఓ వైపు నగర జనాభా పెరుగుతున్నా... కాలనీలు విస్తరించినా ఆ స్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు కనీ సం కృషి చేయలేదు.
ఆ ఆలోచన కూడా రాలేదు. కేంద్ర మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు కోటదాటి బయటకు వచ్చిన సందర్భాలు అరుదు. జనానికి రాజు మొహం కనిపించిందంటే అదే మహాభాగ్యంగా ఉండేది. ఎన్నికల వేళ జనంలోకి రావడం.. తర్వాత బంగ్లాకు లేదంటే ఢిల్లీకి పరిమితం కావ డమే ఏళ్ల తరబడి సాగుతున్న తంతు. 2014–19 మధ్య టీడీపీ హయాంలో నగర వాసులు దాహార్తితో అల్లాడినా మంత్రిగా ఉండి కనీసం పట్టించుకోలేదు. గుక్కెడు తాగునీటి కోసం బంగ్లా వద్ద ఆందోళనలు చేసినా కనికరించలేదు. రోడ్ల విస్తరణ పరిస్థితీ అంతే. తవ్వేసి వదిలేశారు. పాడైన రోడ్లపై రాకపోకలకు పట్టణ వాసుల అవస్థలు వర్ణనాతీతం.
పదవీ కాలమంతా కోట, పరిసరాలను అందంగా తీర్చిదిద్దేందుకే పరిమితమయ్యారు. అన్ని రంగాల్లో నగర అభివృద్ధిని మసకబారించారన్న అపవాదను అశోక్ మూటగట్టుకున్నారు. కార్పొరేషన్ స్థాయిలో సదుపాయాల కల్పనకు అశోక్ కనీసం ఆలోచన చేయలేదని జనం బహిరంగంగానే విమర్శిస్తున్నారు. నగరంలోని శివారు కాలనీల పరిస్థితి అయితే ఐదేళ్ల కిందట దుర్భరం. తాగునీరు, డ్రైనేజీలు, రోడ్ల సదుపాయాలు కల్పించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అశోక్ కనీసం పట్టించుకోలేదు. ఇప్పుడు కుమార్తె తరఫున ప్రచారానికి వస్తున్న అశోక్‌ను జనం బహిరంగంగానే నిలదీస్తున్నారు. మీరు పదవులు అనుభవించడమే తప్ప జనానికి ఏ రోజైనా మేలు చేశారా..? కనీసం మా సమస్యలు ఆలకించారా..? మాట్లాడేందుకు అవకాశం కల్పించారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు.
జనాభా పెరిగినా..
విజయనగరంలో 2001 సంవత్సరంలో సుమారు లక్ష వరకు ఓటర్లు ఉండగా... 2005 నాటికి 1.05 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 2.44 లక్షల జనాభా ఉండగా.. 2014 సంవత్సరం నాటికి జనాభా సంఖ్య సుమారు 3 లక్షలు ఉండేది. అప్పట్లో గాజులరేగ, జమ్ము, ధర్మపురి, అయ్యన్నపేట, వేణుగోపాలపురం, కెఎల్‌పురం ప్రాంతాలను విజయనగరం మున్సిపాలిటీలో విలీనం చేయడంతో పట్టణ విస్తీర్ణం పెరిగింది. వీటి పరిధిలో గుర్తింపు పొందిన మురికివాడలు 80 వరకు ఉండేవి. వీరిలో అర్హులైన వారికి హౌస్‌ఫర్ ఆల్ పథకంలో ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తులు స్వీకరించగా.. లబ్ధిదారుల నుంచి టీడీపీకి చెందిన దిగవ స్థాయి నాయకులు లంచాలు వసూలు చేసి చివరికి ఇల్లు అప్పగించకుండా మోసం చేసినట్టు కొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. 2014–19 మధ్య రూ.279 కోట్లతో రెండువేల పనులు చేపట్టేందుకు అప్పటి టీడీపీ పాలకవర్గం ఆమోదించగా... అందులో రూ.93 కోట్లతో 700 పనులు మాత్రమే పూర్తిచేయగలింది.
నాటికి నేటికీ తేడా చూడు..
రాజులు కోట, బంగ్లాకే పరిమితమైతే.. నేటి పాలకులు జనం మధ్యనే ఉంటూ.. జనం అవసరాలు తెలుసుకుంటూ అభివృద్ధి పనులు చకచకా పూర్తిచేస్తున్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా నగరాన్ని తీర్చిదిద్దుతున్నారు. కేవలం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ 59 నెలల పాలనలో ఇది మన విజయనగరం అని మురిసిపోయేలా.. గర్వంగా చెప్పుకునేలా అన్ని కూడళ్లను అందంగా తీర్చిదిద్దారు. నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచేలా చెరువు గట్లను పార్కులుగా మలిచారు. మహిళల కోసం రాష్ట్రంలోనే తొలిసారిగా పార్కును నిర్మించారు. తాగునీటి పథకాలు నిర్మించి నగరవాసులకు శాశ్వతంగా తాగునీటి కష్టాలను దూరం చేశారు. శివారు కాలనీలకు రోడ్లు వేశారు. విద్య, వైద్య సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు. సరస్వతీ నిలయాలకు సొబగులద్దారు. నగరంలో రోడ్ల విస్తరణ పనులు పూర్తిచేశారు. నగరానికి ఏ వైపు నుంచి వచ్చిన వారికై నా ఇది మన విజయనగర వైభవం అని చాటిచెప్పేలా
హంగులు కల్పించారు.
పాలకుడంటే జనం కష్టాలు తెలిసిన వాడు.. తెలుసుకునేవాడై ఉండాలి.. ప్రజల అవసరాలు ఎప్పటికప్పుడు తీర్చగలగాలి. ఆపద సమయంలో నేనున్నాంటూ ఆపన్నహస్తం అందించి ఆదుకోవాలి. ఓ విజన్‌తో నగరాభివృద్ధికి కృషిచేస్తూ.. ప్రతీ ఒక్కరికీ మంచి చేయాలన్న తపనతో ముందుకు సాగాలన్నది జనం మాట. అధికారాన్ని అలంకారంగా భావించి.. కష్ట కాలంలో కోటదాటని పాలకులు.. ఎన్నికల వేళ ప్రజల వద్దకు వస్తుంటే ఛీకొడుతున్నారు. దాహార్తితో అల్లాడుతున్నా పట్టించుకోని రాజులు.. రోడ్ల విస్తరణ పనులు పూర్తిచేయనివారు.. విజయనగర వైభవాన్ని మసకబారించేలా వ్యవహరించే రాజరిక పాలన మాకొద్దంటూ మొహంమీదే చెబుతున్నారు. అనునిత్యం అందుబాటులో ఉంటూ.. కార్పొరేట్ స్థాయికి తగ్గట్టుగా విజయనగర అభివృద్ధికి అనునిత్యం పాటుపడే నాయకుడే పాలకుడుగా ఉండాలని సుస్పష్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment