రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టిశ్రీరాములు స్వస్థలం బోగోలు మండలం జువ్వలదిన్నె. ఇక్కడ ప్రభుత్వం నవ నిర్మాణదీక్ష కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించింది. సీఎం టూర్ షెడ్యూలు కూడా ఖరారైంది. అధికార యంత్రాంగం అంతా అక్కడే కేంద్రీకృతమైంది. ఏర్పాట్లన్నీ పూర్తి కావచ్చాయి. అయితే బుధవారం ఉదయానికి అకస్మాత్తుగా రూట్ మారిపోయింది. కావలి, నెల్లూరు నియోజకవర్గాల్లో పర్యటనను రద్దు చేసి సూళ్లూరుపేట నియోజకవర్గానికి మార్చేశారు. అధికారులు ఆగమేఘాలపై నాయుడుపేట, తాళ్వాయిపాడులో బహిరంగ సభ, గ్రామదర్శిని కార్యక్రమాలు జరపాలని నిర్ణయించారు. హడావుడిగా కొత్త రూట్‌ను ప్రకటించటం జిల్లాలో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనివెనుక అసలు కారణం ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదికే అని తెలిసింది. మోడల్ విలేజ్‌గా ప్రకటించిన జువ్వలదిన్నెలో సీఎం సభ నిర్వహిస్తే ప్రజలనుంచి నిరసనలు ఎదురుకావచ్చన్న అధికారుల సూచనలతో షెడ్యూల్ మారినట్లు సమాచారం.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సీఎం చంద్రబాబునాయుడు నవనిర్మాణ దీక్ష ముగింపు సభ జిల్లాలో నిర్వహించనున్నట్లు గత నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ఈ నెల 3న సీఎం పర్యటన ఖరారు చేసిన అధికారులు వివరాలు ప్రకటించారు. ఆ మేరకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 8న ఉదయం జువ్వలదిన్నెకు హెలికాప్టర్ ద్వారా చేరుకుని అక్కడ చిప్పలేరుపై నిర్మాణంలో ఉన్న వంతెన, ఇతర అభివృద్ధి పనులను పరిశీలిస్తారని, అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు సొంతూరు అయిన జువ్వలదిన్నెలోని ఆయన స్మారక భవనాన్ని పరిశీలించి, స్థానిక గిరిజన కాలనీలో మాటామంతి కార్యక్రమ నిర్వహణ, అధికారులతో సమీక్ష నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు చేశారు. అక్కడి నుంచి మధ్యాహ్నం నెల్లూరు నగరానికి చేరుకొని వీఆర్సీ గ్రౌండ్‌లో నవనిర్మాణ దీక్ష ముగింపు సభలో పాల్గొని తిరుగు పయనమవుతారని ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణతో పాటు ఇతర అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. మంగళవారం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వీఆర్సీ గ్రౌండ్‌లో నిర్వహించే దీక్ష ఏర్పాట్లను కూడా పరిశీలించి అధికారులకు అనేక సూచనలు చేశారు. ఈ పరిణమాల క్రమంలో బుధవారం ఉదయం కల్లా పర్యటన మొత్తం పూర్తిగా మారిపోయింది. వెను వెంటనే జిల్లా అధికార గణం కొత్తరూట్‌లో పర్యటించి అక్కడ అధికారులతో సమావేశం నిర్వహించి, ఏర్పాటు ముమ్మరంగా చేయాలని స్థానిక అధికారులకు ఆదేశాలు ఇచ్చి కొత్త షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు ప్రకటించారు.
అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యంపై వ్యతిరేకత వస్తుందనే..
జిల్లాలో మోడల్ విలేజ్‌గా జువ్వలదిన్నెను అధికారులు గతంలో ప్రకటించారు. ఆ మేరకు అక్కడ అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో నిర్వహించి మోడల్ విలేజ్‌లో చిన్నపాటి సమస్య కూడా లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగది. ఈ క్రమంలో జువ్వలదిన్నెలో కీలకంగా ఫిషింగ్ హార్బర్ వ్యవహరం పెండింగ్‌లో ఉంది. సీఎం అనేక సందర్భాల్లో ఫిషింగ్ హార్బర్ వస్తుందని ప్రకటించారు. కానీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. రూ. 250 కోట్లతో నిర్మించే ఫిషింగ్ హార్బర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఏర్పాటు కావాల్సి ఉంది. తీర ప్రాంత ప్రజలు కూడా సుదీర్ఘకాలంగా జువ్వలదిన్నె కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర అవతరణకు కారకుడు అయిన పొట్టిశ్రీరాములు సొంత గ్రామంలో కొత్త రాష్ట్ర నవనిర్మాణ దీక్ష ముగింపు కార్యక్రమాల్లో భాగంగా అక్కడ పర్యటిస్తే వ్యతిరేకత వస్తుందని ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించాయి. దీనికి తోడు చిప్పలేరు వాగుపై వంతెన నిర్మాణ పనులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతున్నాయి. ఈ క్రమంలో 3న అక్కడ పర్యటించిన కలెక్టర్ ముత్యాలరాజు పనులు నత్తనడకన సాగటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణమాల క్రమంలో కావలి, నెల్లూరు నగరం నుంచి పర్యటన పూర్తిగా మారిపోయిన సూళ్లూరుపేట నియోజకవర్గంకే పరిమితం అయింది.
తాళ్వాయిపాడులో గ్రామదర్శిని, నాయుడుపేటలో సభ
ఈ క్రమంలో 8న సీఎం పర్యటన సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఖరారైంది. పెళ్లకూరు మండలంలోని తాళ్వాయిపాడులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. అక్కడ గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడ గ్రామస్తులతో ముఖాముఖిలో పాల్గొంటారు. అక్కడి నుంచి నాయుడుపేట చేరుకుని ఎల్‌సీఎం గ్రౌండ్‌లో ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించి నవనిర్మాణ దీక్ష మహా సంకల్ప సభలో పాల్గొని తిరుగుపయమవుతారు.
Comments
Please login to add a commentAdd a comment