
మీ ప్రభుత్వంలో చెయ్యి తడపందే ఫైలు కదలడం లేదు
నవనిర్మాణ దీక్ష వారోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఆదివారం జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రైతులు షాకిచ్చారు.
నవ నిర్మాణ సదస్సులో చంద్రబాబుకు ఆక్వా రైతు షాక్
సాక్షి, అమరావతి: నవనిర్మాణ దీక్ష వారోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఆదివారం జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రైతులు షాకిచ్చారు. మీ ప్రభుత్వంలో చెయ్యి తడపందే ఫైళ్లు కదలడం లేదని ఒక రైతు చెప్పారు. లంచం ఇవ్వకపోతే ఫైలు వీఆర్‌వో దగ్గరే ఉండిపోతోందని చెప్పడంతో చంద్రబాబు ఆ రైతుపై మండిపడ్డారు. పాలీహౌస్‌లకు తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ సబ్సిడీ ఇస్తోందని చెప్పిన మరో రైతుపై అసహనం వ్యక్తం చేశారు.
ఆదివారం నగరంలోని ఏ1 కన్వెన్షన్ హాలులో వ్యవసాయం,దాని అనుబంధ సంఘాలపై చర్చ సందర్భంగా కొంతమంది రైతులతో మాట్లాడించారు. ఈ సందర్భంగా ఆక్వా రైతు సత్యనారాయణ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. దీంతో చంద్రబాబు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోరైతు మోహన్ మాట్లాడుతూ.. పాలీ హౌస్‌లకు పక్క రాష్ట్రాలు 75 శాతం సబ్సిడీ ఇస్తుంటే రాష్ట్రంలో 50 శాతమే ఇస్తున్నారని తెలిపారు. దీంతో పక్కరాష్ట్రం అంటే ఏది? అని ముఖ్యమంత్రి రెట్టించి అడిగారు. తెలంగాణ రాష్ట్రం అని రైతు మోహన్ చెప్పగానే మరోసారి సీఎం అసహనం వ్యక్తం చేశారు.