చంద్రబాబుకు ఏదీ చేతకాదు! | Farmers leader Mareddy Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు ఏదీ చేతకాదు!

Published Sat, Aug 11 2018 12:31 PM | Last Updated on Mon, Oct 1 2018 2:24 PM

Farmers leader Mareddy Slams Chandrababu Naidu - Sakshi

రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న మారెడ్డి సుబ్బారెడ్డి

ఒంగోలు టౌన్‌: ‘జిల్లాలో సుబాబుల్, జామాయిల్‌ రైతులకు పేపర్‌ మిల్లుల యజమాన్యాలు ధర రాకుండా చేశాయి. అతి తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో అప్పట్లో కలెక్టర్లుగా వ్యవహరించిన ఉదయలక్ష్మి, విజయకుమార్‌ పేపర్‌ మిల్లుల యాజమాన్యాలతో సమావేశాలు పెట్టారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చేయకుంటే రవాణా బంద్‌ చేస్తాం.. కరెంట్‌ కట్‌ చేస్తామని హెచ్చరించడంతో రైతులకు న్యాయం జరిగింది. నాటి కలెక్టర్లు చూపిన చొరవ కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు చూపడం లేదు. ప్రభుత్వం జారీ చేసిన జీఓను కూడా అమలు చేయించలేని చేతకాని చంద్రబాబు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. శనివారం స్థానిక మల్లయ్య లింగం భవన్‌లో నిర్వహించిన అఖిలపక్ష రైతు సంఘాల సమావేశంలో ఆయన ప్రభుత్వ వైఖరిని తూర్పార పట్టారు. సుబాబుల్‌ 4200, జామాయిల్, సరుగుడు 4400 రూపాయలు చొప్పున ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించి జీఓ విడుదల చేసినా జిల్లాలో ఆ ధరకు కొనుగోలు చేయడం లేదన్నారు. సగానికి సగం ధరలు తగ్గించి కొనుగోలు చేస్తుంటే జిల్లా యంత్రాంగం మౌనంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు.

ప్రభుత్వం జారీ చేసిన జీఓను అమలు చేయించాల్సిన బాధ్యత యంత్రాంగానికి లేదా..అని ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి రైతాంగానికి గిట్టుబాటు ధర వచ్చేలా చూశారని, ఈ ముఖ్యమంత్రి మాత్రం రైతులను దళారులకు వదిలేశారని విమర్శించారు. రైతుల పక్షమో, పేపర్‌ మిల్లుల యాజమాన్యాల పక్షమో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. సుబాబుల్, జామాయిల్‌ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కె.వీరారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జామాయిల్‌ సాగులో జిల్లాలో 60 శాతం ఉందని, అయినా ప్రభుత్వం నిర్ణయించిన ధర రైతాంగానికి రావడం లేదన్నారు. జామాయిల్‌ తాట తీసి సరఫరా చేయాలన్న నిబంధన విధించడంతో రైతులు వెయ్యి రూపాయలు నష్టపోతున్నారన్నారు.

వెంటనే ఈ నిబంధన మార్చాలని డిమాండ్‌ చేశారు. జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షుడు చుండూరి రంగారావు మాట్లాడుతూ పత్తి, పొగాకు పంటలకు ప్రత్యమ్నాయంగా తీసుకొచ్చిన సుబాబుల్, జామాయిల్‌ రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కర్ర కొనుగోలు చేసి నేరుగా మార్కెట్‌ కమిటీలు డబ్బులు చెల్లించే విధంగా పాత విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. ఆచార్య రంగా కిసాన్‌ సంస్థ కార్యదర్శి చుంచు శేషయ్య మాట్లాడుతూ దేశంలోని సుబాబుల్, జామాయిల్, సరుగుడు రైతులకు ధర లేకుండా తీవ్రంగా నష్టపోతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం విదేశాల నుంచి పేపర్‌ను, పేపర్‌ తయారీ గుజ్జును దిగుమతి చేసుకోవడం దారుణమన్నారు. మేక్‌ ఇన్‌ ఇండియా అంటూ పదేపదే వల్లెవేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ ఇక్కడి రైతాంగాన్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. సమావేశంలో సీపీఐ జిల్లా నాయకుడు ఉప్పుటూరి ప్రకాశరావు, ఓపీడీఆర్‌ రాష్ట్ర నాయకుడు చావలి సుధాకర్, లోక్‌సత్తా జిల్లా నాయకుడు షఫీ, పౌర సమాజం నాయకుడు నరసింహారావు, రైతు కూలీ సంఘం నాయకుడు హనుమంతురావు, రైతు నాయకుడు సుబ్బారెడ్డి పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement