
'అది నయవంచన దినం'
ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా నవ నిర్మాణ దీక్ష పేరుతో సీఎం చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్న దినోత్సవాన్ని నయవంచన దినోత్సవం అంటే బాగుంటుందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.
హైదరాబాద్: ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా నవ నిర్మాణ దీక్ష పేరుతో సీఎం చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్న దినోత్సవాన్ని నయవంచన దినోత్సవం అంటే బాగుంటుందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆయన శనివారంనాడిక్కడ విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ఏడాది పాలనంతా వంచనలు, మోసాలతో సాగిందని దుయ్యబట్టారు.
తాను అనుభవజ్ఞుడినని, అధికారంలోకొస్తే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పి.. ఇప్పుడేమో ప్రజల్లో స్ఫూర్తి నింపాలని, కలసికట్టుగా పనిచేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రివర్గ సమావేశంలో చెప్పడమేంటని విస్మయం వెలిబుచ్చారు. రాజధాని నిర్మాణంతోసహా ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తానని, ఆర్థిక పరిస్థితులపై అవగాహనతోనే ఈ మాటలంటున్నానని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలంతా తలో చేయి వేస్తేగానీ ఏమీ చేయలేన నే స్థితికి దిగజారిపోయారని విమర్శించారు.
గద్దెనెక్కిన తొలిరోజున ఆయన చేసిన ఐదు సంతకాల్లో ఒక్కటీ అమలుకు నోచుకోలేదన్నారు. రైతు రుణమాఫీ జరక్కపోగా బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయీలు పెరిగిపోయాయన్నారు. ఒక్క పావలా కూడా డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ కాలేదన్నారు. మద్యం బెల్ట్‌షాపుల్లో ఒక్కటినీ రద్దు చేయకపోగా వాటిని చట్టబద్ధంగా నిర్వహించుకోవడానికి అవసరమైన చర్యలను చంద్రబాబు ఈ ఏడాదిలో తీసుకున్నారన్నారు.
ఏ రోటికాడ ఆ పాట..
ఎన్నికలకు ముందు చంద్రబాబు తానూ నరేంద్రమోదీ కలసి రాజధానిని నిర్మిస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు చేస్తున్నదేమిటని రాంబాబు ప్రశ్నించారు. ‘‘ఏ రోటికాడ ఆపాట అన్నట్టుగా సింగపూర్ వెళితే అలాంటి రాజధాని కడతానని, చైనా వెళితే అక్కడి మాదిరిగా రాజధాని కడతానని చెప్పి.. చివరకు ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లి చూసొచ్చారు. తర్వాత హైదరాబాద్‌ను మించిన రాజధాని నిర్మిస్తామన్నారు. ఏమీ చేయకుండానే అన్నీ చేసేసినట్టుగా తన అనుకూల పత్రికల్లో రాయించుకుంటున్నారు’’ అని దుయ్యబట్టారు.
మోసం.. దగా.. కుట్ర.. బాబు నైజం
విజయవాడ బ్యూరో: చేసిన వాగ్దానాలను నిలుపుకోలేక ప్రజలను మోసగించడం, అధికారం కోసం కుట్రలు చేసి చివరకు నమ్మిన ఓటర్లను దగా చేయడం సీఎం చంద్రబాబునాయుడు నైజమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.
చంద్రబాబు మోసాలకు సంబంధించి ప్రధానంగా ఐదంశాలపై ప్రశ్నిస్తూ మంగళగిరిలో జూన్ 3, 4 తేదీల్లో తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టనున్న సమరదీక్షను పురస్కరించుకుని కృష్ణా జిల్లా పార్టీ శ్రేణులతో విజయవాడలో శనివారం సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఇందులో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఏడాది పాలనలో చంద్రబాబు ప్రజలకు చేసిన మోసాలను ఎండగట్టి ఆయన నిజస్వరూపాన్ని బయటపెట్టడానికే సమరదీక్ష నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందిస్తేనే ప్రజలకు మేలు జరుగుతోందని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.
వైఎస్సార్‌సీపీ స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే
స్థానిక సంస్థల నుంచి శాసనమండలికి జరగనున్న ఎన్నికల్లో పోటీకి కృష్ణా, గుంటూరు జిల్లాల వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేశారు. గుంటూరు జిల్లా స్థానిక సంస్థల నుంచి పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కృష్ణా జిల్లా స్థానిక సంస్థల నుంచి ఘట్టమనేని ఆదిశేషగిరిరావును ఎంపిక చేసినట్టు శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం తెలియజేసింది.