ఫ్లెక్సీని తొలగిస్తున్న గ్రామస్తులు
వలేటివారిపాలెం: గ్రామంలో చాలాకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించకుండా నవనిర్మాణ దీక్షలు పేరుతో సభలు నిర్వహించొద్దని అధికారులను ప్రజలు అడ్డుకున్నారు. ఈ సంఘటన మండలంలోని కూనిపాలెంలో ఆదివారం జరిగింది. గ్రామంలో నిర్వహిస్తున్న నవనిర్మాణ దీక్షను నిర్వహించకుండా అధికారులు గ్రామం విడిచి వెళ్లే వరకూ స్థానికులు ఒప్పుకోలేదు. సమస్యలు పరిష్కరిస్తాం.. అర్జీలు ఇవ్వాలని అధికారులు కోరారు. ఇప్పటికే పలు సార్లు ఆర్డీఓకు, స్థానిక శాసన సభ్యుడికి అర్జీలు ఇచ్చినా ఫలితం కనిపించలేదని, నవ నిర్మాణ దీక్షకు గ్రామానికి వచ్చిన అధికారులు గ్రామంలో ఉన్న సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారని నిలదీశారు.
గ్రామానికి పైఎత్తున వాగులో చెక్‌డ్యామ్ నిర్మించారని, పోకూరు గ్రామానికి చెందిన రైతులు ఎందుకు పగుల గొట్టారని, చెక్ డ్యామ్ నిర్మించే వరకూ గ్రామానికి అధికారులు రావొద్దని తెగేసి చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే పోతుల రామారావు వద్దకు అంతా వెళ్లి విషయం చెబితే రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు ఉన్నాయని, అందువల్లే చెక్‌డ్యామ్ పగులగొట్టాల్సి వచ్చిందని సమాధానం చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది రూపాయలతో నిర్మించిన చెక్‌డ్యామ్‌ను పగుల గొట్టాల్సిన అవసరం ఏమిటని నిలదీశారు. వర్షాలు లేక పంటలు పండక రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటుంటే నిర్మించిన చెక్‌డ్యామ్ పగులుగొట్టి గ్రామంలోని రైతులు ఇబ్బందులు పెట్టేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారో సామాధానం చెప్పాలని గ్రామస్తులు పట్టుబట్టారు.
వర్షాలు పడినప్పుడు నీరు నిల్వ చేసుకునేందుకు నిర్మించిన చెక్‌డ్యామ్‌ను తిరిగి నిర్మించే వరకు అధికారులు గ్రామంలో నవనిర్మాణ దీక్షలు చేపట్టొద్దని, వెంటనే గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లాలని పట్టుబట్టారు. ఫ్లెక్సీని తీసేయాలని డిమాండ్ చేశారు. అధికారులు తొలగించక పోవడంతో గ్రామస్తులు ఫ్లెక్సీని తొలగించి నవనిర్మాణ దీక్ష బహిష్కరిస్తున్నామంటూ అక్కడి నుంచి ఎవరింటికి వారు వెళ్లిపోయారు. చేసేది లేక అధికారులు కూడా తమ కార్యాలయాల బాట పట్టారు.
Comments
Please login to add a commentAdd a comment