సాక్షి, విజయవాడ : నవ నిర్మాణ దీక్షలు రేషన్ డీలర్లు, కార్డుదారులకు ఇక్కట్లు తెచ్చిపెట్టాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారం రోజులు పాటు నిర్వహించిన నవనిర్మాణదీక్షలకు పౌరసరఫరాల శాఖ అధకారులు, రేషన్ డీలర్లతోపాటు కార్డుదారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారం రోజులుగా ఇబ్బందులు పడ్డ వారు గురువారంతో దీక్షలు ముగియడంతో ఊపిరి పీల్చుకున్నారు.
జిల్లాలో 5వేల మంది తరలింపు
నవనిర్మాణ దీక్షలకు జిల్లా వ్యాప్తంగా సుమారు 5వేల మంది రేషన్ డీలర్లు, తెల్లకార్డుదారులు హాజరైనట్లు డీలర్లు చెబుతున్నారు. ఇందులో సుమారు 1500 మంది డీలర్లు పాల్గొన్నారు. జిల్లాలో 2161 చౌక ధరల దుకాణాలు ఉన్నాయి. ఒకొక్క మండలంలో 35 నుంచి 50 వరకు రేషన్ షాపులు ఉన్నాయి. మండలాల వారిగా డీలర్లు, తెల్లకార్డుదారులు దీక్షల సదస్సులకు హాజరుకావాలని అధికారులు హుకుం జారీ చేశారు. తొలుత డీలర్లు సీరియస్‌గా తీసుకోకపోయినా అధికారుల నుంచి వత్తిడి పెరగడంతో ఏ కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లి హాజరువేయించుకుని సాయంత్రం వరకు ఉండక తప్పలేదని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యూనియన్‌కు నాయకత్వం వహిస్తున్న వారు తెల్లకార్డుదారులను కూడా తప్పకుండా తీసుకురావాలని ఆదేశాలు జారీ చేయడంతో వారితో పాటు ఒకటి రెండు రోజులు కార్డుదారులను కూడా తీసుకువెళ్లారు. ఎక్కువగా రేషన్ డీలర్లే దీక్ష సమావేశాల్లో పాల్గొన్నట్లు సమాచారం. ఇక పౌరసరఫరాల జిల్లా స్థాయి అధికారులు నుంచి సర్కిల్ స్థాయి అధికారులు, ఆర్‌ఐలు అంతా సమావేశ మందిరం వద్దనే ఉదయం నుంచి రాత్రి వరకు పడిగాపులు కాశారు. ఏ నిముషంలో ఏ ఉన్నతాధికారి పిలుస్తారోనని వేచి చూశారు. దీంతో సరుకులు పంపిణీ ఏ విధంగా జరుగుతోందో దృష్టి పెట్టలేకపోయారు.
సరుకులు పంపిణీకి ఇబ్బంది
నెల మొదటి వారంలో నవనిర్మాణ దీక్ష సభలు జరగడంతో రేషన్ డీలర్లు ఇబ్బందులు పడ్డారు. ఒకవైపు తెల్లకార్డుదారులు సరుకుల కోసం రావడం, మరొకవైపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు సమావేశం పాల్గొనాల్సి వచ్చింది. కొంతమంది ప్రత్యామ్నాయంగా మరొక వ్యక్తితో సరుకు పంపిణీ చేయించగా, ఎక్కువ మంది మాత్రం దుకాణాలు మూసి వేశారు. నగరంలో రెండు సర్కిల్స్‌లోనూ ఇటువంటి ఇబ్బందులు వచ్చాయి.
సరుకులు తక్కువ... ప్రచారం ఎక్కువ....
గతంలో రేషన్ దుకాణాలు ద్వారా కందిపప్పు, పామాయిల్, బియ్యం, పంచదార, గోధుమలు ఇచ్చేవారు. ప్రస్తుతం బియ్యం తప్ప ఇంకా ఏ ఇతర సరుకులు ఇవ్వడం లేదు. దీంతో కార్డుదారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం నిర్వహించే నవనిర్మాణదీక్షలకు హాజరుకావాలని హుకుం జారీ చేయడంపై కార్డుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హమ్మయ్య..దీక్షలు ముగిశాయి!!
Published Thu, Jun 8 2017 10:03 PM | Last Updated on Tue, Sep 5 2017 1:07 PM
Advertisement
Advertisement