సాక్షి, అమరావతి/ సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నడిబొడ్డున బెంజిసర్కిల్ జంక్షన్‌లో నిర్వహించిన నవనిర్మాణ దీక్షకు జనస్పందన లేకపోయినా.. భారీ ఎత్తున చేసిన ఏర్పాట్లతో ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. జాతీయ రహదారిపై భారీ టెంట్లు వేసి ఈ దీక్షా సభ నిర్వహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ రహదారిపై దూరప్రాంతాలకు కార్లు, బస్సుల్లో వెళ్లే వారు నరకయాతన అనుభవించారు. ఈ సభ కోసం శుక్రవారం రాత్రి నుంచే విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తమిళనాడు, కోల్‌కతా, హైదరాబాద్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను నగరానికి 50 కిలోమీటర్లే అవతలే దారిమళ్లించారు.
ఆంక్షల కారణంగా నగరంలోని ప్రజలు చిన్నచిన్న మార్గాల్లో చుట్టుతిరిగి వెళ్లాల్సి వచ్చింది. దీంతో ట్రాఫిక్ మొత్తం జామ్ అయి స్థానికులు నానా ఇబ్బందులు పడ్డారు. ఇటీవలే మహానాడు పేరుతో మూడురోజులు ట్రాఫిక్ ఆంక్షలు విధించినపుడు ఇబ్బందులు పడ్డామని మళ్లీ ఇప్పుడు నవనిర్మాణ దీక్ష పేరుతో ఇబ్బంది పెట్టారని జనం వాపోయారు. కార్యక్రమం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. అయితే దీక్ష కార్యక్రమాన్ని హడావుడిగా 10.30 గంటలకే ముగించేశారు. సమావేశం ముగిసిన వెంటనే ట్రాఫిక్‌ను క్లియర్‌చేయడానికి పోలీసు సిబ్బందే బారికేడ్లు, టెంట్లు తొలగించారు.
జన స్పందన కరువు..
ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ముఖ్యమంత్రి పదేపదే ప్రజలకు పిలుపునిచ్చినా పార్టీ కార్యకర్తలు, అధికార యంత్రాంగం తప్ప ప్రజలెవరూ పట్టించుకోలేదు. సభా ప్రాంగణంలో వేయడానికి తీసుకొచ్చిన కుర్చీలను చాలామటుకు తీసుకొచ్చిన లారీల్లోనే ఉంచేశారు. కృష్ణా జిల్లా నలుమూలల నుంచి డ్వాక్రా మహిళలు, అంగన్‌వాడీలు, ఉపాధి హామీ కూలీలు, విద్యార్థులను తరలించేందుకు 350కి పైగా బస్సులు ఏర్పాటు చేశారు. కానీ ఆ బస్సుల్లో ఎక్కేందుకు గ్రామాల్లో చాలామంది నిరాకరించారు. దీంతో ఉపాధి కూలీలను బలవంతంగా బస్సులు ఎక్కించి తీసుకొచ్చారు.
వచ్చిన వారిలో చాలామంది ముఖ్యమంత్రి ప్రసంగం మొదలుకాగానే లేచివెళ్లిపోవడం కనిపించింది. వారిని ఆపడానికి అధికారులు కిందామీదా పడాల్సివచ్చింది. ఈ సభకు 25 వేల మందికిపైగా జనం వస్తారని అధికారులు, టీడీపీ నాయకులు ప్రచారం చేసినా కనీస స్పందన కూడా రాలేదు. నవ నిర్మాణ దీక్షకు ప్రజల నుంచి స్పందన లేదని టీడీపీ నాయకులే చర్చించుకుంటున్నారు. జిల్లాల్లోనూ ఈ దీక్షా సభలు విఫలమయ్యాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో సమారు 18 వేల చోట్ల ఈ సభలు జరుపుతామని ప్రకటించి వాటికి నోడల్ అధికారులను నియమించినా మొక్కుబడిగా అక్కడక్కడా జరిగాయి.
ఉపాధి కూలీల తరలింపు
కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఉపాధి కూలీలను గ్రామాల్లో ఫీల్డు అసిస్టెంట్లు పని ప్రాంతాలకు తీసుకెళ్లకుండా, సీఎం నవనిర్మాణ దీక్ష కోసం బస్సుల్లో తరలించారు. జిల్లా ఉన్నతాధికారులు మండల, గ్రామ స్థాయిలో జన సమీకరణకు అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. తెల్లవారుజామున నాలుగు గంటలకే బస్సులు గ్రామాలకు చేరాయి. ఉపాధి కూలీలను ఈ బస్సుల్లో ఎక్కించారు. కృష్ణా జిల్లా ముసునూరు, గన్నవరం మండలం నుంచి తరలించిన కూలీలు శిబిరం వద్ద కనిపించారు. వారు ఉపాధి పనులకు హాజరైనట్లు రికార్డుల్లో నమోదు చేయడం గమనార్హం.
దీక్ష.. ప్రయాణికులకు శిక్ష
Published Sun, Jun 3 2018 3:10 AM | Last Updated on Sat, Oct 20 2018 4:47 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment