సాక్షి, అమరావతి: వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ సాక్షర భారత్ పథకంలో భాగంగా రాష్ట్రంలోని ‘ఏపీ స్టేట్ లిటరసీ మిషన్ అథారిటీ’ పరిధిలో పని చేస్తున్న 20,503 మంది జిల్లా, మండల, గ్రామ సమన్వయకర్తల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరించింది. వారిని విధుల నుంచి తొలగిం చింది. ఆ స్థానంలో అధికార పార్టీ కార్యకర్తలను నియమించి, వచ్చే ఎన్నికల్లో ప్రయోజనం పొందేలా వ్యూహం రచించింది. సాక్షర భారత్ ఉద్యోగులం దరినీ తొలగించాలని వయోజన విద్యావిభాగం డైరెక్టర్‌ను ఆదేశిస్తూ జూన్ 1న రాష్ట్ర ప్రభుత్వం మెమో (నం.574896/ ప్రోగ్రాం–3/2017) జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని సమన్వయకర్తలను విధుల నుంచి తొలగిస్తున్నట్లు వయోజన విద్యా విభాగం డైరక్టర్ ఎం.అమ్మాజీరావు జూన్ 14న సర్క్యులర్ మెమో (నెంబర్ 600) విడుదల చేశారు.
నిధులు కేంద్ర ప్రభుత్వానివే...
సాక్షర భారత్ సమన్వయకర్తలు 15 ఏళ్లుగా తాత్కాలిక ప్రాతిపదికన పని చేస్తున్నారు. గ్రామ సమన్వయకర్తలకు నెలకు రూ.2,000, మండల, జిల్లా సమన్వయకర్తలకు రూ.6,000 చొప్పున గౌరవ వేతనం అందుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల నుంచే రాష్ట్ర ప్రభుత్వం ఈ వేతనాలు చెల్లిస్తోంది. ఇన్నాళ్లూ అరకొర వేతనంతో జీవనం సాగించిన 20,503 మంది సమన్వయకర్తలపై రాష్ట్ర సర్కారు వేటు వేసింది. తొలగింపునకు గురైన సమన్వయకర్తల్లో 15 నుంచి 20 ఏళ్లకుపైగా సేవలందిస్తున్నవారు ఉన్నారు. తమకొచ్చే వేతనం అత్యంత స్వల్పమే అయినా ఏనాటికైనా పెరుగుతుందని ఆశగా ఎదురు చూస్తున్న వారిని ప్రభుత్వం ఒక్క కలం పోటుతో తొలగించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలు తప్ప మిగిలిన 10 జిల్లాల్లో సాక్షర భారత్ కార్యక్రమం అమలవుతోంది.
నెలకు రూ.4.5 కోట్లు ఇవ్వలేరా?
రాష్ట్రవ్యాప్తంగా 9,979 సాక్షర భారత్ కేంద్రాల్లో పనిచేస్తున్న 19,959 గ్రామ, 504 మంది మండల, 40 మంది జిల్లా సమన్వయకర్తలను తొలగించారు. విచిత్రం ఏమిటంటే ఈ ఉద్యోగులను మార్చి 31 నుంచి తొలగించేలా రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1న ఆదేశాలు ఇవ్వగా, జూన్ 14న వయోజన విద్యా విభాగం డైరక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 31 నుంచి తొలగించినట్లు ఉత్తర్వులు ఇచ్చినా ఈ మూడు నెలల కాలంలో వీరితో ప్రభుత్వం పనులు చేయించుకుంది. వీరికి గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు రూ.25 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. మార్చి 31 నుంచి విధుల నుంచి తొలగిస్తున్నట్లు మూడు రోజుల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏప్రిల్, మే నెలలతోపాటు జూన్‌లో పనిచేసిన రోజులకు వేతనాన్ని కోల్పోనున్నారు.
మొత్తం బకాయిలు కలిపితే రూ.33 కోట్లు అవుతుంది. ఈ బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం అకస్మాత్తుగా రోడ్డున పడేసింది. వేతనాల కోసం అడిగితే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాలేదని, తామేం చేయలేమని వయోజన విద్యా విభాగం అధికారులు చేతులెత్తేస్తున్నారు. కేంద్రం 2017 సెప్టెంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వానికి నిధులిచ్చింది. ఆయా నిధుల ఖర్చుకు సంబంధించిన వినియోగపత్రాలను(యూసీ)లను రాష్ట్రం సమర్పించలేదు. దీంతో కేంద్రం నుంచి నిధులు రావడం ఆగిపోయింది. సాక్షర భారత్ ఉద్యోగులందరికీ ఇచ్చే వేతనం నెలకు రూ.4.5 కోట్లు మాత్రమే. ప్రత్యేక విమానాల్లో విదేశీ యాత్రల కోసం రూ.వందల కోట్లు ఖర్చు పెడుతున్న పాలకులు తమకు అరకొర వేతనాలు సైతం ఇవ్వకుండా, విధుల నుంచి తొలగించడం ఏమిటని సాక్షర భారత్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక టీడీపీ కార్యకర్తలే సమన్వయకర్తలు
సాక్షర భారత్‌ను కేంద్రం నిధులు ఇవ్వకపోవడం వల్లే సమన్వయకర్తలను తొలగించామని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం యూసీలు ఇవ్వనందువల్లే కేంద్రం నుంచి నిధులు రావడం లేదు. సాక్షర భారత్ అమలు కోసం కేంద్రం ఇచ్చిన సొమ్మును రాష్ట్ర సర్కారు దారి మళ్లించింది. ఈ సంగతి బయటపడుతుందనే భయంతోనే యూసీలు ఇవ్వకుండా జాప్యం చేస్తోంది. పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో సాక్షర భారత్ కార్యక్రమం యథాతథంగా కొనసాగుతోంది. కేంద్రం నిధులు విడుదల చేయకున్నా అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలే నిధులు సమకూరుస్తూ సమన్వయకర్తలకు వేతనాలు చెల్లిస్తున్నాయి. కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 8 నెలలుగా జీతాలు ఇవ్వకుండా మొండిచేయి చూపింది. ఏకంగా విధుల నుంచి తొలగించింది. ఈ వ్యవహారంలో టీడీపీ ప్రభుత్వ ఆంతర్యం మరోలా ఉన్నట్లు తెలుస్తోంది. తొలగింపునకు గురైన సాక్షర భారత్ సమన్వయకర్తల స్థానంలో అధికార పార్టీ కార్యకర్తలను నియమించి, వారికి ప్రభుత్వ ఖజానా నుంచి ప్రతినెల వేతనాలు చెల్లించేలా తెరవెనుక పావులు కదుపుతున్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేసేందుకు, రానున్న ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేసేందుకు వీరిని ఉపయోగించుకోనున్నట్లు తెలిసింది.
అర్ధాంతరంగా తొలగిస్తే ఎలా బతకాలి?
‘‘సాక్షర భారత్ సమన్వయకర్తలతో ప్రభుత్వం చాలా ఏళ్లుగా పని చేయించుకుంటోంది. ఇప్పుడు అర్ధాంతరంగా విధుల నుంచి తొలగిస్తే వారి కుటుంబాలు ఎలా జీవించాలి? ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. తొలగింపు ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలి. ఉద్యోగులకు వేతన బకాయిలు చెల్లించాలి. ఎప్పటిలాగే విధుల్లో కొనసాగించాలి’’
– విష్ణువర్దన్‌రెడ్డి, రాష్ట్ర సాక్షర భారత్ సమన్వయకర్తల సంఘం గౌరవాధ్యక్షుడు
మమ్మల్ని ఆదుకోకపోతే పోరాటాలే శరణ్యం
‘‘రాష్ట్ర ప్రభుత్వం సాక్షర భారత్ సమన్వయకర్తల పట్ల దారుణంగా వ్యవహరించింది. ప్రభుత్వం అప్పగించిన విధులన్నీ నిర్వర్తించాం. 15–20 ఏళ్లుగా పని చేస్తున్న వేలాది మందిని తొలగించి రోడ్డున పడేయడం అన్యాయం. తొలగింపు ఉత్తర్వులను ఉపసంహరించుకొని, బకాయిలు చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలి. లేకపోతే ఆందోళనలు, పోరాటాలకు దిగడం తప్ప మరో మార్గం లేదు’’
– సిద్ధారెడ్డి, అధ్యక్షుడు, రాష్ట్ర సాక్షర భారత్ సమన్వయకర్తల సంఘం
అకస్మాత్తుగా తొలగించడం అన్యాయం
‘‘ప్రభుత్వం మాకు చెల్లించే వేతనాలు స్వల్పమే అయినా దీన్నే నమ్ముకొని చిత్తశుద్ధితో పని చేస్తున్నాం. సాక్షరతా కార్యక్రమాలతోపాటు ప్రభుత్వం అప్పగించే ఇతర విధులనూ నిర్వర్తిస్తున్నాం. గత ఏడాది అక్టోబర్ నుంచి వేతనాలు ఇవ్వకపోయినా పని చేస్తున్నాం. ఇప్పుడు అకస్మాత్తుగా తొలగిస్తున్నామని చెప్పడం అన్యాయం. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మమ్మల్ని యథావిధిగా విధుల్లో కొనసాగించాలి. వేతన బకాయిలను వెంటనే చెల్లించాలి’’
– పీఎస్సార్ శాస్త్రి, రాష్ట్ర సాక్షర భారత్ సమన్వయకర్తల సంఘం కోశాధికారి
గ్రామ స్థాయి సమన్వయకర్తలు 19,959
మండల స్థాయి సమన్వయకర్తలు 504
జిల్లా స్థాయి సమన్వయకర్తలు 40
నెలకు జీతాల ఖర్చు 4.5 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment