ఈఫొటో చూశారా.. అనంతపురం జిల్లా యల్లనూరు మండలం కూచివారిపల్లి వద్ద టీడీపీ నేత ఒకరు నీరు–చెట్లు పనుల్లో నిబంధనలకు విరుద్ధంగా బండరాళ్లను వినియోగించి చెక్ డ్యామ్ నిర్మించారు. దీనిపై గ్రామ ప్రజలు ఫిర్యాదు మేరకు తనిఖీలు జరిపిన అధికారులు అక్రమాలు జరిగినట్లు గుర్తించి రూ.9.6 లక్షల బిల్లు చెల్లింపును నిలిపివేశారు. ఇక్కడ ఒక్కచోటే కాదు.. నీరు–చెట్టు పనుల్లో రాష్ట్రవ్యాప్తంగా అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు రావడంతో రూ.1,341.7 కోట్ల బిల్లుల చెల్లింపులను అధికారులు నిలిపివేశారు.
తాజాగా ‘సైకిల్ యాత్ర’కు స్పందన లేకపోవటంతో అధికార పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు సిద్ధమైన రాష్ట్ర సర్కారు నీరు–చెట్టు బకాయిలను తక్షణమే చెల్లించాలని ఆదేశించింది. 2018–19 బడ్జెట్‌లో నీరు–చెట్టుకు కేటాయించిన రూ.500 కోట్లు బకాయిలకు సరిపోనందున అదనంగా రూ.900 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శుక్రవారం ఆగమేఘాలపై నిర్ణయించారు. సీఎఫ్‌ఎంఎస్ (కాంప్రహెన్సివ్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్)లో ప్రత్యేకంగా మినహాయింపులు ఇచ్చి బిల్లులు చెల్లించాలని ఆదేశించటంపై అధికార వర్గాలే విస్తుపోతున్నాయి.
– సాక్షి, అమరావతి
సాక్షి, అమరావతి: నారు పోసినవాడే నీరు పోస్తాడనే మాదిరిగా ‘నీరు–చెట్టు’ పథకంలో నిబంధనలు గట్టున పెట్టి టీడీపీ నేతలు, కార్యకర్తలకు రూ.1341.7 కోట్ల బిల్లులు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సీఎఫ్‌ఎంస్ విధానం నుంచి ప్రత్యేకంగా మినహాయింపులు ఇచ్చి మరీ శనివారం నుంచి బిల్లులు మంజూరు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయటం గమనార్హం. సీఎం చంద్రబాబు పిలుపునిచ్చినా టీడీపీ నేతలు, కార్యకర్తలు నియోజకవర్గాల్లో సైకిల్ యాత్రలలో పాల్గొనకపోవడంతో ఈ ఎత్తుగడ వేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రూ.12,722.46 కోట్ల ఇతర నిధులు ఖర్చు
రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక జలసంరక్షణ పేరుతో నీరు–చెట్టు పథకాన్ని చేపట్టింది. జలవనరుల శాఖ, ఉపాధిహామీ నిధులనూ దీనికి వెచ్చించింది. గత నాలుగేళ్లలో ఉపాధిహామీ నిధులు రూ.8,592.16 కోట్లు, అటవీశాఖ నిధులు రూ.132.42 కోట్లు, జలవనరుల శాఖ నుంచి రూ.3,997.88 కోట్లు వెరసి రూ.12,722.46 కోట్లను నీరు–చెట్టుకు ఖర్చు చేశారు. ఇందులో రూ.11,380.76 కోట్ల బిల్లులు చెల్లించగా మరో రూ.1341.7 కోట్ల మేర బకాయిపడ్డారు. అక్రమాలు జరిగినట్లు అధికారులు చెబుతున్నా పట్టించుకోకుండా ఇప్పుడు వీటిని చెల్లించేందుకు సర్కారు సిద్ధమైంది.
నామినేషన్‌పై పార్టీ కార్యకర్తలకు పనులు
ఏదైనా ఒక పని చేపట్టాలంటే సాంకేతిక, పరిపాలన అనుమతి అవసరం. తర్వాత టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు ఆ పనులను అప్పగిస్తారు. నీరు–చెట్టు పథకంలో మాత్రం నిబంధనలను తుంగలో తొక్కారు. రూ.పది లక్షల విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో టీడీపీ కార్యకర్తలకు కట్టబెట్టేశారు. ముందస్తుగా అనుమతి తీసుకోకుండా టీడీపీ కార్యకర్తలు పనులు ప్రారంభించేశారు. చెరువుల్లో పూడికతీత తీయకపోయినా తీసినట్లు, మరమ్మతులు చేయకున్నా చేసినట్లు చూపి బిల్లులు చేసుకున్నారు. పూడిక తీసిన మట్టిని అమ్ముకుని వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. భారీ నీటిపారుదల విభాగంలోనూ నీరు–చెట్టు కింద పనులు చేపట్టడంపై అధికారవర్గాలే నివ్వెరపోయాయి.
అక్రమాలు జరిగాయని చెబుతున్నా..
నీరు–చెట్టు పనుల్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని జలవనరులు, ఆర్థికశాఖ అధికారులు తేల్చారు. 2017–18లో చేపట్టిన రూ.1,948.65 కోట్ల విలువైన పనులను తూతూ మంత్రంగా చేయటం, కొన్నిచోట్ల అసలు పనులే చేయకుండా బిల్లులు చెల్లించాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఒత్తిడి తెచ్చినా అధికారులు అంగీకరించలేదు. దీనిపై సీఎం చంద్రబాబు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో చేసేదిలేక గతేడాది రూ.922.95 కోట్ల బిల్లులు చెల్లించేశారు. మరో రూ.1025.7 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. 2018–19లో ఇప్పటివరకూ చేసిన పనులకు రూ.316 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంది.
సైకిల్ యాత్రకు బకాయిల టానిక్
రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తూ సైకిల్ యాత్ర చేపట్టాలన్న సీఎం చంద్రబాబు పిలుపుపట్ల టీడీపీ శ్రేణులు సానుకూలంగా స్పందించలేదు. ఈ నేపథ్యంలో నీరు–చెట్టు బకాయి బిల్లులు చెల్లిస్తే కార్యకర్తలు ఉత్సాహంగా సైకిల్ యాత్రలో పాల్గొంటారని టీడీపీ ఎమ్మెల్యేలు సూచించారు. దీంతో ఈ బిల్లులు తక్షణమే చెల్లించాలంటూ అధికారులపై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. మరోవైపు నీరు–చెట్టు కింద బకాయిపడిన బిల్లులను వెంటనే చెల్లించాలని ఇటీవల శాసనసభ సమావేశాల్లో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా డిమాండ్ చేశారు.
నాసిరకం పనులకు బిల్లులు
- కర్నూలు జిల్లాలో సుంకేశుల బ్యారేజీ మరమ్మతు పనులను రూ.8.66 కోట్లతో నీరు–చెట్టు కింద చేపట్టి ఓ టీడీపీ నేతకు అప్పగించారు. ఇదే బ్యారేజీలో రూ.31 లక్షల విలువైన పనిని మరో టీడీపీ నేతకు అప్పగించారు. బ్యారేజీకి తూతూమంత్రంగా మరమ్మతులు చేసిన టీడీపీ కార్యకర్తలకు రూ.8.91 కోట్లు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు.
- నంద్యాల ఉపఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు కుందూ నదిలో రెండో కి.మీ. నుంచి 7.90 కి.మీ. వరకూ పూడికతీత పనులను రూ.8.25 కోట్లతో చేపట్టారు. ఓ టీడీపీ నేతకు వీటిని కట్టబెట్టారు. పూడిక తీత పూర్తి స్థాయిలో తీయకున్నా తీసినట్లు చూపి బిల్లులు చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తున్నారు.
- శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే సుభద్రాపురం, నారాయణపురం, మెలియాపుట్టి ఎత్తిపోతల పథకాల పనులను రూ.21.32 కోట్లతో చేపట్టారు. వీటిని నాసిరకంగా చేసిన టీడీపీ కార్యకర్తలకు బిల్లులు చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తున్నారు.
అత్యధిక పనులకు అనుమతులు లేవు
సీఎఫ్‌ఎంఎస్ విధానం ప్రకారం ప్రస్తుతం బిల్లులు చెల్లించాలి. పరిపాలనా అనుమతి, సాంకేతిక అనుమతి, ఎం–బుక్‌ల్లో స్పష్టంగా రికార్డు చేసిన పనులకు మాత్రమే సీఎఫ్‌ఎంఎస్ ద్వారా బిల్లులు చెల్లించవచ్చు. ఇందులో ఏ ఒక్క అనుమతి లేకున్నా బిల్లులు చెల్లించడానికి సీఎఫ్‌ఎంఎస్ సాఫ్ట్‌వేర్ అనుమతించదు. నీరు–చెట్టు కింద చేపట్టిన అత్యధిక శాతం పనులకు పరిపాలన, సాంకేతిక అనుమతులు లేవు. పనులు చేయకపోవటంతో ఎం–బుక్‌ల్లో కూడా సక్రమంగా రికార్డు చేయలేదు. అంటే.. అక్రమాలు జరిగినట్లు స్పష్టమవుతోంది. ఇదే అంశాన్ని అధికారులు ప్రస్తావించటంతో సీఎంఎఎస్ విధానంలో నిబంధనలు సడలించి బిల్లులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment