
నారావారి నయవంచక దీక్ష
హైదరాబాద్: నవ నిర్మాణదీక్ష పేరుతో సీఎం చంద్రబాబు నాటకాలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. రాష్ట్రం విడిపోయి ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే సంబరాలు చేసుకుంటారా అని ప్రశ్నించారు. శుక్రవారం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. కొత్త రాష్ట్రం ఏర్పడినందుకు తెలంగాణ ప్రజలు ఒకరోజు సంబరం చేసుకుంటుంటే, ఏపీని అడ్డగోలుగా విభజించినందుకు ఏడు రోజులు సంబరాలు చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. పబ్లిసిటీ కోసమే చంద్రబాబు నవనిర్మాణ దీక్ష చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘నవనిర్మాణ దీక్ష కాదు, నారా వారి నయవంచన దీక్ష’ అని పేర్కొన్నారు.
చంద్రబాబు పరిపాలనతో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని, మూడేళ్ల ఆయన పరిపాలన ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకెళ్లిందని ధ్వజమెత్తారు. మిత్రపక్షమే ఛీకొట్టిన ఈ ప్రభుత్వం నవనిర్మాణ దీక్ష ఎందుకు చేస్తోందని నిలదీశారు. టీడీపీతో జతకట్టడాన్ని ‘భస్మాసుర పొత్తు’ అని బీజేపీ శ్రేణులు వ్యాఖ్యానించాయని గుర్తు చేశారు. ఇసుక నుంచి రాజధాని వరకు అంతా అవినీతేనని ఆరోపించారు. చంద్రబాబు ఎలాంటి అవినీతి చేయలేదని కాణిపాకం వినాయకుడిపై ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. అవినీతిపై పోరాటం చేయాలంటున్న బాబు వ్యాఖ్యలను మిలీనియం జోక్‌గా ఎమ్మెల్యే రోజా వర్ణించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, అవినీతి సొమ్ముతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. దీక్షల పేరుతో ప్రజాధనం వృధా చేస్తున్నారని, ప్రజల సొమ్ముతో ఎన్ని దీక్షలైనా చేయగలరని మండిపడ్డారు. చంద్రబాబును నిలదీసి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.