మాట్లాడుతున్న మంత్రి ఆర్‌కే రోజా, దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి
చేజర్ల–నెల్లూరు(దర్గామిట్ట): దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అకాల మరణంతో జరుగుతున్న ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఆయన సోదరుడు, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి సాధించే మెజార్టీ చరిత్రలో నిలిచిపోయేలా ప్రజలు తీర్పు వెలువరించాలని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ఆర్‌కే రోజా పిలుపునిచ్చారు. ఆదివారం చేజర్ల మండలంలోని పాతపాడు, ఓబులాయపల్లి, కొండలరాయుడు కండ్రిక, గొల్లపల్లి గ్రామాల్లో ఆమె మేకపాటి విక్రమ్‌రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, ప్రజలు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ మంచి నాయకుడు మేకపాటి గౌతమ్‌రెడ్డిని కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందుతున్నాయన్నారు. రాష్ట్రంలో రూ.1.40 లక్షల కోట్లు పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలకు ఖర్చు చేసిన ఘనత మన సీఎందేనన్నారు. ప్రతిపక్షనేతలు చేసే కువిమర్శలను తాము పట్టించుకోబోమని, అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకుసాగుతోందని తెలిపారు. గతంలో అ«ధికారంలో ఉండి ప్రజలకు ఏమీ చెయ్యని వాళ్లు, నామమాత్రంగా పార్టీ నడుపుతున్న వాళ్లు కూడా ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు.
చదవండి: (అయ్యో జనార్దనా: ముందు చూస్తే నుయ్యి.. వెనుక చూస్తే గొయ్యి)
గత టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూస్తే, ఎవరు ప్రజల కష్టాలను దూరం చేశారో అర్థం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశంలో ప్రతి రాష్ట్రం ఆదర్శంగా తీసుకుందని తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గంలో దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి ఎన్నో సమస్యలను పరిష్కరించారన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల్లో అందరూ ప్యాన్ గుర్తుకు ఓటేసి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బలపరిచిన మేకపాటి విక్రమ్‌రెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment