
సోమవారం సచివాలయంలో మంత్రి వర్గ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. చిత్రంలో మంత్రులు, అధికారులు
- రాష్ట్ర కేబినెట్ తీర్మానం
హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగిన రోజు(జూన్ 2)ను నవ నిర్మాణ దినంగా పాటించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. జిల్లా, మండల కేంద్రాల్లో బహిరంగసభలు నిర్వహించి.. అడ్డగోలు విభజనతో కేంద్రం రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని ప్రజలకు తెలియచెప్పాలని తీర్మానించింది. వచ్చే నెల 3 నుంచి 7 వరకు శాఖలవారీగా అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సంబంధిత శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించి.. ఏడాదిలో సాధించిన ప్రగతిని జూన్ 8న విజయవాడలో నవ నిర్మాణ దినోత్సవం పేరిట నిర్వహించే బహిరంగ సభ ద్వారా ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. సీఎం నేతృత్వంలో సోమవారం ఉదయం పది గంటలకు సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం రాత్రి ఎనిమిది గంటల వరకు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. ఈ నిర్ణయాలను ప్రసార, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి విలేకరులకు వెల్లడించారు.
- డ్వాక్రా రుణాల మాఫీకి మూలధనాన్ని మూడు దశల్లో అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. తొలి విడతగా ఒక్కో మహిళకు రూ.3 వేల వంతున 88 లక్షల మంది మహిళలకు మొత్తం రూ.3 వేల కోట్లను (30 శాతం) జూన్ 3 నుంచి 7 లోగా వారి ఖాతాల్లో జమ చేస్తారు. ఇదే సమయంలో డ్వాక్రా మహిళలకు రూ.1,284 కోట్లను వడ్డీ రూపంలో చెల్లిస్తారు. రెండో దశ కింద 35 శాతం.. మూడో దశ కింద 35 శాతం మూలధనాన్ని రాబోయే రోజుల్లో అందించాలని కేబినెట్ తీర్మానించింది.
- విజయనగరం జిల్లా భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కంపెనీని ఏర్పాటుచేయాలని మంత్రివర్గం తీర్మానించింది. ఏవియేషన్ అకాడమీతో పాటు నిర్వహణ, మరమ్మతుల కేంద్రాన్నీ ఏర్పాటుచేస్తారు. ఇందుకు అవసరమైన భూమిని సమీకరిస్తామని మంత్రి పల్లె ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తిరుపతిలో కొత్తగా నిర్మించిన ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌ను జూలైలో ప్రారంభించనున్నారు. వచ్చే నెల నుంచి రాజమండ్రి విమానాశ్రయంలో నైట్ ల్యాండింగ్ సౌకర్యాన్ని కల్పిస్తారు.
- గుంటూరు జిల్లా వినుకొండ, నెల్లూరు జిల్లా దగదర్తి, కర్నూలు జిల్లా ఓర్వకల్లు, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, విజయనగరం జిల్లా భోగాపురం, చిత్తూరు జిల్లా కుప్పంలో విమానాశ్రయాల ఏర్పాటుకు ఆమోదించారు.
- ఈనెల 10 నుంచి 30లోగా అన్ని శాఖల్లోనూ బదిలీలను పూర్తిచేయనున్నారు.
- బొగ్గు గనుల్లో వచ్చిన ఆదాయంలో రాష్ట్రాలకూ వాటా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించడంపై కేబినెట్ హర్షం వ్యక్తం చేసింది. కృష్ణా, గోదావరి బేసిన్‌లోని చమురు, సహజవాయు నిక్షేపాల ద్వారా వచ్చే ఆదాయంలోనూ రాష్ట్రానికి వాటాకు కేంద్రానికి లేఖ రాయనున్నారు.
- వ్యవసాయ, నీటిపారుదల, వాటర్ షెడ్ ల పర్యవేక్షణకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్, చీఫ్ ఇంజనీర్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ.
- కాయగూర పంటలు సాగుచేసే రైతులకు 50 శాతం రాయితీపై విత్తనాల సరఫరా స లక్ష హెక్టార్లలో బిందు, తుంపర నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటుచేయాలని నిర్ణయం. ఇందుకు రూ.534 కోట్ల కేటాయింపు. స ప్రతి శాఖలోనూ ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు సీఎఫ్‌ఎంఎస్ (కాంప్రెహ న్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) విధానంలో ఒక అధికారి నేతృత్వంలో ఈ-నిధి ఏర్పాటు.
- టీటీడీ బోర్డులో ఎక్స్ అఫిషియో మెంబర్‌గా ఉండే తుడా చైర్మన్‌ను బోర్డు నుంచి తొలగిస్తూ మంత్రివర్గం తీర్మానించింది.
- ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చర్చించడానికి రవాణా, ఆర్థిక, కార్మికశాఖల మంత్రులు శిద్ధా రాఘవరావు, యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటుచేసింది.
- మంత్రులను.. శాఖల ఉన్నతాధికారులను సమన్వయం చేస్తూ ఆ శాఖలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అమాత్యులకు, అధికారులకు వివరించడానికి ప్రతి శాఖకూ ఓ ఎమ్మెల్వో (మీడియా లైజనింగ్ ఆఫీసర్)ను ఏర్పాటుచేయడానికి కేబినెట్ ఆమోదం.
రాష్ట్ర అవతరణ దినోత్సవం మాటేంటి..?
రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారన్న విలేకరుల ప్రశ్నకు మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్పష్టమైన సమాధానాన్ని ఇవ్వలేదు. ఈ అంశంపై మరోసారి చర్చించి నిర్ణయిస్తామని చెప్పారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్వో వ్యవస్థను ఏర్పాటు చేయడం అవసరమా అని అడగ్గా.. సమాధానం దాటవేశారు. ఉన్నతాధికారులను, మంత్రులను సమన్వయం చేసే స్థాయి ఎమ్మెల్వోలకు ఉంటుందా?, ఏ ప్రాతిపదికన ఆ పోస్టులను భర్తీ చేశారన్న ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. ఓ కమిటీ ఇంటర్వ్యూలు చేసి ఎంపిక చేసిందని చెప్పారు.