హామీలన్నింటికీ చంద్రబాబు మంగళం
కొత్త సంవత్సరంలోనూ రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులకు మొండిచెయ్యి
87 లక్షల మందికి ‘తల్లికి వందనం’ ఎగవేత
54 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా రిక్త హస్తం
జాడలేని ఆడబిడ్డ నిధి.. నిరుద్యోగులకు భృతి లేదు
ఉద్యోగులకు డీఏ, పీఆర్సీ ఊసే లేదు
తల్లికి వందనం ఈ ఏడాది ఎగ్గొట్టేశాం! అసలు పథకాన్నే ఎగరగొడదాం..! రైతు భరోసా రెండుసార్లు ఎగనామం.. ఈసారి కేంద్రం ఇచ్చాక చూద్దాం..! ఆడబిడ్డ నిధి అబ్బే..! మనకు ఇప్పుడు అసలా ఆలోచనే లేదు! ఉద్యోగులు, నిరుద్యోగులు ఆ ఊసే మరిచిపోదాం!!
సాక్షి, అమరావతి: కొత్త సంవత్సరంలోనూ కేబినెట్ సాక్షిగా సూపర్ సిక్స్ హామీలకు కూటమి సర్కారు ఎగనామం పెట్టింది. తల్లికి వందనం నుంచి అన్నదాతా సుఖీభవ దాకా.. ఆడబిడ్డ నిధి నుంచి ఉద్యోగులకు పీఆర్‌సీ, ఐఆర్.. నిరుద్యోగులకు భృతి వరకు ఇదే తీరు!! కొత్త ఏడాది కోటి కళ్లతో ఆశగా ఎదురు చూస్తున్న తల్లులు, రైతన్నలు, ఉద్యోగులు, నిరుద్యోగులకు మళ్లీ నిరాశ మిగిలింది. ఎన్నికల ముందు సూపర్ సిక్స్.. సెవన్ అంటూ ఎడాపెడా హామీలిచ్చిన సీఎం చంద్రబాబు పీఠం ఎక్కిన తరువాత వాటిని పూర్తిగా ఎగ్గొట్టేశారు. సూపర్ సిక్స్ సహా ఇతర హామీలను అటకెక్కించి తొలి ఏడాది గడిపేశారు.
కొత్త సంవత్సరంలోనూ నిర్దిష్టంగా ఏమైనా ప్రకటిస్తారనుకున్న వారికి నిరాశే మిగిలింది. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో హామీల అమలుపై కచ్చితమైన నిర్ణయాలు తీసుకోలేదు. కేబినెట్‌లో చర్చించారని మంత్రి ప్రకటించడం ప్రజలను మోసగించడమేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం చంద్రబాబు ఈ విద్యా సంవత్సరం తల్లికి వందనం పథకాన్ని అమలు చేయకపోవడంతో 87.42 లక్షల మంది విద్యార్ధులు ఒక్క ఏడాదే రూ.13,112 కోట్ల మేర నష్టపోయారు. 54 లక్షల మంది రైతన్నలు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందకపోవడంతో రూ.10,000 కోట్ల మేర నష్టపోయారు.
కోటి మందికిపైగా యువత నిరుద్యోగ భృతి కోసం.. ‘ఆడబిడ్డ నిధి’ కోసం 1.80 కోట్ల మంది మహిళలు పడిగాపులు కాస్తుంటే నూతన ఏడాది నిర్వహించిన తొలి మంత్రివర్గ భేటీలో ఒక్క సానుకూల ప్రకటన కూడా చేయలేదు. వాటిని అమలు చేసే ఉద్దేశం లేకపోవడం వల్లే ప్రభుత్వం సాగదీస్తోందని, ఎన్నికల హామీలను నమ్మి తాము మోసపోయామని ప్రజలు గ్రహిస్తున్నారు. ఇవాళ ఏ గ్రామంలో చూసినా మహిళలు, రైతులు, విద్యార్థులు, యువత అదే జగన్ అధికారంలో ఉండి ఉంటే ఈ సమయానికి ఏ పథకాల కింద, ఎంత లబ్ధి చేకూరేదో బేరీజు వేసుకుంటున్నారు. గత ఐదేళ్లూ విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పారదర్శక పాలనతో వ్యవస్థలు, పథకాలను ఇంటి వద్దకే వైఎస్ జగన్ చేరువ చేశారు.
ఏటా ఏప్రిల్‌లో విద్యార్థులకు వసతి దీవెన, పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాలు.. మే నెలలో విద్యా దీవెన, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, రైతు భరోసా, మత్స్యకార భరోసా.. జూన్‌లో అమ్మ ఒడి.. జూలైలో విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం, చిరు వ్యాపారులకు జగనన్న తోడు.. ఆగస్టులో విద్యా దీవెన, నేతన్న నేస్తం.. సెప్టెంబర్‌లో చేయూత.. అక్టోబర్‌లో రైతు భరోసా.. నవంబర్‌లో విద్యా దీవెన, రైతులకు సున్నా వడ్డీ రుణాలు.. డిసెంబర్‌లో ఈబీసీ నేస్తం, లా నేస్తం, మిగిలిపోయిన అర్హులకు సైతం పిలిచి మరీ పథకాలు అందించే కార్యక్రమాలను క్రమం తప్పకుండా చేపట్టారు.
అమ్మ ఒడి ఆగిపోయి.. తల్లికి వందనం లేక!
పేదరికం చదువులకు అడ్డు కాకూడదని, పేదింటి తలరాతలను మార్చే శక్తి విద్యకే ఉందని దృఢంగా నమ్మిన మాజీ సీఎం వైఎస్ జగన్ ‘అమ్మ ఒడి’ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు పిల్లలను పాఠశాలలు, కాలేజీలకు పంపిన తల్లుల ఖాతాల్లో ఏడాదికి రూ.15 వేల చొప్పున క్రమం తప్పకుండా జమ చేశారు. విద్యా రంగ సంస్కరణకు ఐదేళ్లలో దాదాపు రూ.73వేల కోట్లు వ్యయం చేసిన వైఎస్ జగన్ ఒక్క అమ్మ ఒడి ద్వారానే రూ.26 వేల కోట్లకుపైగా తల్లులకు అందించి పిల్లల చదువులకు భరోసా కల్పించారు. కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశారు.
తొలిసారిగా ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్‌లోనూ ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ)తో డిజిటల్ బోధన ప్రారంభించారు. ప్రభుత్వ బడులన్నీ ఇంగ్లీషు మీడియం చేయడంతో పాటు సీబీఎస్సీతో ఆపకుండా.. ఏకంగా ఐబీ వరకు ప్రయాణం దిశగా అడుగులు వేశారు. రోజుకొక మెనూతో రుచికరంగా గోరుముద్ద అందించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన అన్ని విద్యా సంస్కరణలను రద్దు చేయడమే పనిగా పెట్టుకున్న కూటమి సర్కారు ఐబీ, సీబీఎస్‌ఈ, టోఫెల్‌ను రద్దు చేసి.. తల్లికి వందనం పథకంపై చేతులెత్తేసింది.
తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్రంలో స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఓ కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఇస్తామన్న హామీని చంద్రబాబు అటకెక్కించేశారు. తొలి ఏడాది దీన్ని అమలు చేయకుండా పిల్లల చదువులను నీరుగార్చిన కూటమి సర్కారు అసలు పూర్తిగా పథకాన్నే ఎత్తివేసే దిశగా వ్యూహం రచిస్తోంది.
అన్నదాతలకూ ఎగనామమే
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున ఇస్తామన్న పెట్టుబడి సాయాన్ని రెండు వ్యవసాయ సీజన్లు గడుస్తున్నా అందించలేదు. రైతు భరోసా పేరును అన్నదాతా సుఖీభవగా మార్చడం మినహా అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది అమలు చేయలేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద ఇప్పటికే రైతులకు రెండు విడతలు ఆర్థిక సాయం అందించడం గమనార్హం. చంద్రబాబు సర్కారు ఆ రెండు విడతలూ అన్నదాతలకు సాయం అందించకుండా ఎగనామం పెట్టింది.
కేంద్రం తదుపరి ఇచ్చే వాటా ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటాపై ఆలోచన చేస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. అన్నదాతా సుఖీభవ కోసం 54 లక్షల మంది అన్నదాతలకు రూ.10వేల కోట్లకుపైగా అవసరం కాగా, బడ్జెట్‌లో రూ.1,000 కోట్లు మాత్రమే విదిలించడం గమనార్హం. ఇంతవరకు పథకం విధివిధానాలే ఖరారు చేయలేదు. ఇక ఖరీఫ్ 2023 సీజన్‌కు సంబంధించి రైతుల తరపున చెల్లించాల్సిన ప్రీమియం చెల్లించకపోవడం వల్ల రూ.1,358 కోట్ల పంటల బీమా పరిహారం అందకుండా పోయింది. సున్నా వడ్డీ రాయితీ ఊసే లేదు. రబీ సీజన్‌లో కరువు సాయానికి సంబంధించి రూ.328 కోట్లకు ఎగనామం పెట్టారు.
ఐదేళ్లుగా విత్తు నుంచి విక్రయం వరకు గ్రామ స్థాయిలో రైతులను చేయిపట్టి నడిపించిన రైతు సేవా కేంద్రాలను (ఆర్బీకేలు) చంద్రబాబు నిర్వీర్యం చేశారు. విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. ఆర్బీకేల ద్వారా నాన్ సబ్సిడీ విత్తనాల పంపిణీని నిలిపివేశారు. కాగా రైతులకు రైతు భరోసా పథకాన్ని మరుసటి ఏడాది నుంచి అమలు చేస్తామని వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలో చెప్పినప్పటికీ తొలి కేబినెట్‌లోనే నిర్ణయం తీసుకుని తొలి ఏడాది నుంచే వైఎస్ జగన్ అమలు చేశారు.
జాడలేని ఆడబిడ్డ నిధి..
19 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలందరికీ ఏటా రూ.18 వేలు చొప్పున ఆడబిడ్డ నిధి కింద ఆర్థిక సహాయం అందచేస్తామని సూపర్ సిక్స్‌లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ పథకాన్ని నెరవేర్చే ఉద్దేశం కానరాకపోవడం, మంత్రివర్గ సమావేశాల్లో కనీసం చర్చించకపోవడంతో 1.80 కోట్ల మంది మహిళలు మోసపోయినట్లు గ్రహిస్తున్నారు.
ఉచిత గ్యాస్‌లోనూ మాయ
ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి ఇప్పుడు జిమ్మిక్కులతో మహిళలను మోసం చేశారు. ఈ ఏడాది రెండు సిలిండర్లకు కోత పెట్టారు. రాష్ట్రంలో 1.54 కోట్ల కుటుంబాలకు ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలంటే రూ.4 వేల కోట్లు అవసరం. కానీ ఈ ఏడాది బడ్జెట్‌లో కేవలం రూ.895 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. దీంతో కేవలం కోటి మందికి మాత్రమే ఒక్క సిలిండర్ ఇచ్చే పరిస్థితి ఉంది.
మత్స్యకారులనూ ముంచారు..
గత ఏడాది వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇవ్వాల్సిన ఆర్థిక సాయానికి చంద్రబాబు సర్కారు ఎగనామం పెట్టింది. దీంతో 1.30 లక్షల మత్స్యకారులు ఇప్పటికే రూ.260 కోట్లు నష్టపోయారు. ఇప్పుడు ఏప్రిల్‌లో సాయం అందించడంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు చెబుతోంది. అయితే పథకం అమలుపై కచ్చితమైన ప్రతిపాదనలు, నిర్ణయాలు మాత్రం జరగలేదు. విధివిధానాలు ఖరారు చేయలేదు. కేవలం చర్చలు, ఆలోచనలతోనే సరిపుచ్చారు. వైఎస్ జగన్ చెప్పిన మాట మేరకు అధికారం చేపట్టిన తొలి ఏడాది నుంచే మత్స్యకార భరోసాను అమలు చేశారు.
ఉద్యోగుల ప్రయోజనాలపై చర్చలేదు
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడిచినా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యను పట్టించుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.బాలాజీ జీవీ సత్యనారాయణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి నెలా మంత్రివర్గం సమావేశాలను నిర్వహిస్తున్నా ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలపై ఎలాంటి చర్చలు లేవన్నారు.
పీఆర్సీ అమలుకు కమిటీని నియమించాలి
ఏపీటీఎఫ్ అమరావతి 12వ పీఆర్సీ అమలు కోసం కమిటీని నియమించాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీవీ ప్రసాద్, రాధాకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నూతన సంవత్సరంలోనైనా డీఏ ప్రకటిస్తారని ఆశించిన ఉద్యోగులకు నిరాశే మిగిలిందన్నారు.
తల్లులకు మోసం
వైఎస్సార్‌సీపీ విద్యార్థి సంఘం
తల్లికి వందనం పథకం ద్వారా ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ రూ.15వేల చొప్పున ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీపై కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని వైఎస్సార్‌సీపీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర ధ్వజమెత్తారు. తల్లికి వందనం పథకం ఈ ఏడాది ఇవ్వడం లేదని మంత్రివర్గ సమావేశంలో ప్రకటించి తల్లులను దగా చేసిందన్నారు.
అమలు చేయకుంటే ఆందోళన
ఎస్‌ఎఫ్‌ఐ
‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను వంచించడాన్ని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.ప్రసన్నకుమార్, ఎ.అశోక్ గురువారం ఓ ప్రకటనలో ఖండించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం అమలు చేయకపోతే ఆందోళన చేస్తామన్నారు.
ఉద్యోగులకు మొండిచెయ్యి
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలైనా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలుపై దృష్టి సారించలేదు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్‌సీ, కూటమి ప్రభుత్వం రాగానే వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని ఎన్నికల ముందు హామీలిచ్చింది. సీపీఎస్/జీపీఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామని వాగ్దానం చేసింది. ఇంతవరకూ ఒక్క డీఏ కూడా ఇవ్వలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం కొత్త పీఆర్సీ ఏర్పాటుతోపాటు కమిషనర్‌ను నియమించింది.
అయితే చంద్రబాబు సర్కారు కమిషనర్‌తో రాజీనామా చేయించింది. ఇక పీఆర్సీ కమిషన్ గురించి అసలు పట్టించుకోవడమే లేదు. ఉద్యోగుల సమస్యల్లో ఒక్కటి కూడా పరిష్కరించలేదు. ఇందుకు భిన్నంగా వైఎస్ జగన్ తొలి కేబినెట్ సమావేశంలోనే ఉద్యోగులకు 2019 జూలై 1 నుంచి 27 శాతం ఐఆర్ ఇచ్చారు. ఇప్పుడు 7 నెలలైనా ఐఆర్ గురించి చంద్రబాబు అసలు పట్టించుకోవడమే లేదు. గత సర్కారు ఉద్యోగుల సమస్యలపై సీఎస్ నేతృత్వంలో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి పరిష్కరించగా, చంద్రబాబు ప్రభుత్వం ఆ ఊసే మరిచింది.
నిరుద్యోగికి నయవంచన..
యువతకు ఉద్యోగాలు, లేదంటే నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు హామీ నీటిలో కలిసిపోయింది. రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాలు ఉండగా, ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున నెలకు రూ.4,800 కోట్లు అవసరం. అంటే ఏడాదికి రూ.57,600 కోట్లు ఖర్చవుతుంది. బడ్జెట్‌లో ఇందుకు పైసా ఇవ్వలేదు. క్యాబినెట్‌లో కనీసం చర్చించలేదు. దీంతో నిరుద్యోగ భృతి హామీకి నీళ్లు వదిలినట్టయ్యింది.
కొత్తవి లేవు.. అన్నీ రద్దులే
తాము అధికారంలోకి వస్తే వలంటీర్లను కొనసాగించడంతోపాటు గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతానంటూ ఉగాది సందర్భంగా ఇచ్చిన హామీని చంద్రబాబు బుట్టదాఖలు చేశారు. ఏకంగా ఆ వ్యవస్థకే మంగళం పలికి 2.66 లక్షల మందిని రోడ్డున పడేశారు. ఇక 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామన్న హామీ బూటకంగా మారింది.
ఉద్యోగుల ఆశలపై నీళ్లు..
కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అవుతున్నా ఉద్యోగుల గురించి ఆలోచించడం లేదని రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు సంబంధించి ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించలేదని గురువారం మీడియాతో పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఒక్క డీఏ కూడా ఇవ్వలేదన్నారు. ఐఆర్ ఇవ్వలేదని, డీఏ, జీపీఎస్ బకాయిలు, ఈఎల్స్ సరెండర్ బకాయిలు చెల్లించలేదన్నారు.
రాజీనామా చేసిన పీఆర్సీ కమిషనర్ స్థానంలో కొత్త కమిషనర్‌ను ఇంతవరకు నియమించలేదన్నారు. కొత్త ప్రభుత్వం కుదురుకోవడానికి కొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో తాము ఒత్తిడి చేయకుండా వేచి చూశామని, కానీ నెలలు గడుస్తున్నా ఉద్యోగుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం దారుణమన్నారు. 2019లో గత ప్రభుత్వం జూలై 1 నుంచే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చిందని వెంకట రామిరెడ్డి గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు కూడా అలాగే ఇస్తారని ఉద్యోగులు నమ్మారన్నారు. ప్రతి కేబినెట్ సమావేశంలోనూ ఐఆర్ ఇస్తారని ఎదురు చూస్తూ వస్తుంటే ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారన్నారు.
గత ప్రభుత్వం రెండు మూడు నెలలకు ఒకసారి ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించిందన్నారు. సాధ్యం కాకుంటే కనీసం తమకు చెప్పేదన్నారు. పెండింగ్ బకాయిలు దశలవారీగా ఎప్పుడు ఎంత చెల్లిస్తారో పారదర్శకంగా చెప్పేవారన్నారు. ఇప్పుడు అది కూడా లేదన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలైనా ఇంతవరకు ఉద్యోగ సంఘాలతో అధికారికంగా ఒక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ కానీ, ముఖ్యమంత్రి గానీ, మంత్రులు గానీ ఉద్యోగులను పిలిచి మాట్లాడడం గానీ జరగలేదన్నారు.
ఒకవైపు ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా వేధించడం మొదలు పెట్టిందన్నారు. సచివాలయంలో ఎన్నడూ లేని విధంగా సీనియర్ అధికారులు ఆరుగురిని ఎలాంటి కారణాలు లేకుండా బదిలీ చేసి ముగ్గురికి ఇంతవరకు పోస్టింగ్ ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టాలని కోరుతున్నట్లు చెప్పారు. ఒక డీఏ ఇవ్వాలని, వెంటనే పీఆర్సీ కమిషనర్‌ను నియమించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment