జూన్ 2న రెండు పూటలా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు
ఉదయం 9.30కు అమరవీరుల స్తూపం వద్ద నివాళులు
తర్వాత పరేడ్ గ్రౌండ్స్‌లో కార్యక్రమం.. తెలంగాణ అధికారిక గీతం ఆవిష్కరణ
ప్రసంగించనున్న సోనియా, రేవంత్
చివరిగా బాణసంచా వెలుగులతో ముగియనున్న వేడుకలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను జూన్ 2న అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఉదయం, సాయంత్రం రెండు పూటలా వేడుకలను నిర్వహించాలని సూచించారు. ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 2న జరిగే కార్యక్రమాల షెడ్యూల్ ఇదీ..
అమరవీరులకు నివాళులతో మొదలు
జూన్ 2న ఉదయం 9.30కు అసెంబ్లీ ఎదుట ఉన్న గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్, మంత్రులు నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమవుతుంది. తొలుత సీఎం జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. పోలీసు బలగాల పరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉంటాయి.
తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం ‘జయ జయహే తెలంగాణ’ను ఆవిష్కరి స్తారు. అనంతరం ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తారు. విశిష్ట సేవలు అందించిన పోలీసు సిబ్బందికి, ఉత్తమ కాంటింజెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు స్వీకర్తలతో ఫొటో సెషన్ అనంతరం ఉదయం కార్యక్రమం ముగుస్తుంది.
సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై వేడుకగా..
2న సాయంత్రం ట్యాంక్‌బండ్ మీద వేడుకలు నిర్వహిస్తారు. తెలంగాణకు సంబంధించిన హస్తక ళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6.30కు సీఎం రేవంత్ ట్యాంక్‌బండ్‌కు చేరుకుని వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. తర్వాత తెలంగాణ కళారూ పాలకు అద్దం పట్టేలా కార్నివాల్ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు. ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాటు చేస్తున్న వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి.
అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్‌బండ్‌ఒక చివర నుంచి మరో చివరి వరకు 5 వేల మంది భారీ ఫ్లాగ్‌వాక్ నిర్వహి స్తారు. ఈ ఫ్లాగ్‌వాక్ జరుగుతున్న సమయంలో ‘జయ జయహే తెలంగాణ’ రాష్ట్ర గేయం ఫుల్‌వెర్షన్ (13.30 నిమిషాల)ను విడుదల చేస్తారు. గీత రచయిత, కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిలను సన్మానిస్తారు. రాత్రి 8.50 గంటలకు పది నిమిషాల పాటు హుస్సేన్ సాగరం మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా సాగే బాణసంచా కార్యక్రమంతో వేడుకలు ముగుస్తాయి.
యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న ఏర్పాట్లు
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాన వేదికతోపాటు, ముఖ్య అతిథులు, ఆహ్వానితులు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా లాంజ్‌లు సిద్ధం చేస్తున్నారు. వేసవి తీవ్రత నేపథ్యంలో భారీ టెంట్లను, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, కార్నివాల్, బాణసంచా, లేజర్ షో, ఫుడ్, గేమింగ్ స్టాళ్ల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దాదాపు 80 స్టాళ్లను సిద్ధం చేస్తున్నారు. వీటిలో హస్తకళలు, మహిళా బృందాలు తయారు చేసిన ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు, హైదరాబాద్‌లోని పలు ప్రముఖ హోటళ్ల స్టాల్స్, చిన్న పిల్లలకు గేమింగ్ షోలు ఉన్నాయి. కార్నివాల్‌లో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పలు సాంస్కృతిక కళాబృందాలు ప్రదర్శన ఇవ్వనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment