మంత్రి పితానికి చుక్కెదురు
మంత్రి పితానికి చుక్కెదురు
Published Sat, Jun 3 2017 1:49 AM | Last Updated on Fri, Aug 10 2018 8:26 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : నవ నిర్మాణ దీక్ష సాక్షిగా తెలుగుదేశం పార్టీలో అధిపత్య పోరు బయటపడింది. జిల్లా కేంద్రం ఏలూరులో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి పితాని సత్యనారాయణకు మాట్లాడే అవకాశం దక్కలేదు. ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి సందేశం ఉంటుందన్న సమాచారంతో జెడ్పీ చైర్మన్ ప్రసంగించిన అనంతరం మత్రి పితాని సత్యనారాయణతో మాట్లాడించాలని నిర్ణయిం చారు. మైక్ తీసుకున్న జెడ్పీ చైర్మన్ ఏకబిగిన 40 నిమిషాల పాటు ముఖ్యమంత్రి సందేశం ప్రారంభమయ్యే వరకూ మాట్లాడుతూనే ఉన్నారు. ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుర్పించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి సందేశం మరో గంటకుపైగా సాగటంతో మంత్రి పితాని సత్యనారాయణకు అవకాశం లేకుండాపోయింది. పితానికి ప్రాధాన్యత ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే జెడ్పీ చైర్మన్ సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
డుమ్మాకొట్టిన తమ్ముళ్లు
మరోవైపు జిల్లా వ్యాప్తంగా ముఖ్యమైన కూడళ్లలో నవ నిర్మాణ దీక్ష సభలు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ సభలకు తెలుగు తమ్ముళ్లు ఎక్కడా పెద్దగా హాజరుకాకపోవడంతో ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలను, డ్వాక్రా మహిళలను తరలించారు. ఉంగుటూరు నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన సభకు జనం రాకపోవడంతో ఉపాధి హామీ పనుల నుంచి ఇళ్లకు వెళ్తున్న కూలీలను ఓ అధికారి ఆపి కూర్చోబెట్టారు. మధ్యలో వెళ్లిపోతున్న కూలీలకు కూల్ డ్రింక్‌లు, మజ్జిగ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు అందజేసి సభ అయ్యే వరకు కూర్చోబెట్టారు. దీనికోసం ఐకేసీ సిబ్బంది నానాకష్టాలు పడ్డారు. పాలకొల్లులో మున్సిపల్ కార్యాలయం ఎదురుగా మెయిన్ రోడ్డుపై నవ నిర్మాణ దీక్ష శిబిరం ఏర్పాటు చేయడంతో అటుగా రాకపోకలు సాగించేవారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గజలక్ష్మి సెంటర్, కుక్కల గుడి వద్ద ట్రాఫిక్‌ను నియంత్రించడంతో అవస్థలు పడ్డారు.
స్వర్ణాంధ్ర ప్రదేశ్‌కు సహకరించండి : జవహర్
రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్‌గా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొని సహకరించాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ కోరారు. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో శుక్రవారం నిర్వహించిన నవ నిర్మాణ దీక్షను మంత్రులు పితాని సత్యనారాయణ, జవహర్ జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. జవహర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన గత ప్రభుత్వం ఏపీని ఆర్థికంగా దెబ్బతీసి సమస్యల సుడిగుండంలో పడేసిందన్నారు. ఆ ఘటనలను ఒకసారి గుర్తు తెచ్చుకుని రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను విశ్లేషించుకునేందుకు నవ నిర్మాణ దీక్ష దోహదపడుతుదన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్ని ర్మించుకునేందుకు నవ నిర్మాణ దీక్ష సాక్షిగా ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలన్నారు. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ రాజధాని లేని రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి తనకున్న పరిపాలనా దక్షతతో అభివృద్ధి చేస్తున్నారన్నారు.
కలెక్టర్ కాటంనేని భాస్కర్, జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు, అదనపు ఎస్పీ వి.రత్న, డీఆర్‌ఓ హైమావతి, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, మేయర్ షేక్ నూర్జాహాన్, ఆర్డీఓ జి.చక్రధరరావు, ఎంపీపీ మోరు హైమావతి పాల్గొన్నారు. తొలుత పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ర్యాలీ నిర్వహించి ఫైర్‌స్టేషన్ సెంటర్‌కు చేరుకున్నారు.
Advertisement
Advertisement