నవనిర్మాణ దీక్ష ఓ వంచన | kolagatla attack on chandrababu nava nirmana deeksha | Sakshi
Sakshi News home page

నవనిర్మాణ దీక్ష ఓ వంచన

Published Fri, Jun 3 2016 11:01 AM | Last Updated on Sat, Jul 28 2018 3:33 PM

kolagatla attack on chandrababu nava nirmana deeksha

రాష్ట్ర విభజనకు లేఖలిచ్చి ఇప్పుడు అశాస్త్రీయంగా విభజించారంటారా..?
రెండేళ్ల పాలనలో అన్నింటా వైఫల్యం
రాజధాని నిర్మాణం పేరుతో రూ.కోట్ల కుంభకోణం
చంద్రబాబు సర్కారు పాలనపై ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ జిల్లా  అధ్యక్షుడు కోలగట్ల

 
విజయనగరం మున్సిపాలిటీ :  ఓట్లేసి గెలిపించిన ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం.. వారిని వంచించేందుకు నవ నిర్మాణ దీక్ష చేస్తోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. గురువారం ఆ పార్టీ జిల్లా కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార యంత్రాంగంతో పార్టీ నాయకులనే ప్రజలుగా చూపిస్త్తూ మొక్కుబడి దీక్షలు చేపడుతున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దీక్షలకు హాజరైన వారి సంఖ్య చూస్తే ఇదే విషయం తేటతెల్లం చేస్తోందని ధ్వజమెత్తారు. విభజన తరువాత అన్ని విధాలుగా నష్టపోయామంటూ ప్రతిజ్ఞ చేయిస్తున్న చంద్రబాబు.. ఏ ఆలోచనతో రాష్ట్ర విభజనకు అంగీకారం తెలుపుతూ లేఖలు ఇచ్చారో తెలియజెప్పాలని డిమాండ్ చేశారు.  రెండేళ్ల పాలనలో మంత్రులు, ఎమ్మెల్యే లు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నా యకులు అభివృద్ధి చెందారే తప్పా ప్రజ లు కాదన్నారు. వ్యవసాయ రం గాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసుకు భయపడి కృష్ణా, గోదావరి జలాలపై హక్కులు కోల్పోవటం ద్వారా వ్యవసా యం మరింతగా కుంటుపడుతుందన్నారు.
 
జూట్ పరిశ్రమలు మూతపడితే ఏం చేస్తున్నారు?
జూట్, ఫెర్రో తదితర పరిశ్రమలు మూతపడతుండగా.. వాటిని తెరిపిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గానీ, జిల్లాకు చెందిన మంత్రులు గానీ కనీసం ప్రయత్నించకపోవడం దారుణమని కోలగట్ల అన్నారు. దీంతో ఆయా పరిశ్రమల్లో పని చేసే వేలాది కార్మికులు, వారిని నమ్ముకుని బతుకుతున్న లక్షలాది మంది కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
ఎమ్మెల్యేల కొనుగోలుకు డబ్బులు ఎక్కడివి?
రాజ్యాంగానికి విరుద్ధంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న చంద్రబాబుకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పాలని కోలగట్ల డిమాండ్ చేశారు. ప్రపంచం ఆశ్చర్యపోయేలా రాజధాని నిర్మిస్తామని గొప్పలు చెబుతున్న ముఖ్యమంత్రి.. అంతర్జాతీయ స్థాయిలో రూ.కోట్లాది కుంభకోణం చేస్తున్నారని ఆరోపించారు. పేదవాడికి ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పి అధిక సంఖ్యలో లారీల ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ఘనత ఈ సర్కారుకే దక్కుతుందన్నారు. నిరుద్యోగులను సైతం నమ్మించి మోసం చేశారని ధ్వజమెత్తారు. బలం లేకున్నా రాజసభ్యకు మరో అభ్యర్థిని నిలబెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

రాష్ట్రంలో జరుగుతున్న  పాలనపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ విజయనగరం పట్టణ అధ్యక్షుడు  ఆశపు వేణు, నాయకులు మామిడి అప్పలనాయుడు, బొద్దాన అప్పారావు, కెల్ల త్రినాథ్, సత్తిరాజు, సంగంరెడ్డి బంగారునాయుడు, అల్లు చాణక్య, భోగి రమణ, జీవీ రంగారావు, సత్తరపు శంకరరావు, మజ్జి త్రినాథ్, రెడ్డి గురుమూర్తి, మారోజు శ్రీను, బోడసింగి ఈశ్వరరావు, గాదం మురళి, గండ్రేటి సన్యాసిరావు, పూసర్ల అప్పారావు, ఇసరపు రామకృష్ణ, అనిల్, రెడ్డి వెంకటేష్, కేశవ్ తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement