చంద్రబాబు కుప్పంకు ఎప్పుడొచ్చినా బస చేసేది ఈ ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లోనే..
వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యే.. 1989 నుంచి 2024 వరకు.. అంటే దాదాపుగా 35ఏళ్ల పాటు ప్రజా ప్రతినిధిగా అవకాశం కల్పించిన ఊరు.. వాస్తవానికి సొంతూరు పొమ్మన్నా.. ఊరి కాని ఊరు ఆదరించింది. అలాంటి ఊరి కోసం ఎవరైనా ప్రాణం పెట్టేస్తారు. ఏమైనా చేసేస్తారు. కానీ ఇక్కడ ఉన్నది ఎవరు.. చంద్రబాబునాయుడు.. అదే టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు.. ఆయన గురించి చెప్పేదేముంది..
ఆ పేరు ప్రస్తావన వస్తేనే పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచారని, వెన్నుపోటుకు పేటెంట్ హక్కని విపక్ష నేతల విమర్శలు ఎదుర్కొనే ఆయన ఇప్పుడు తనను మూడు దశాబ్దాలకుపైగా ఆదరించిన కుప్పం పట్ల కూడా అదే రీతిన వెన్నుపోటు పొడిచారనే చెప్పాలి. కుప్పానికి ఇన్నేళ్లలో నేను ఇది చేశాను.. అని చెప్పుకోవడమే తప్ప ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదంటే బాబు గారికి ఈ ప్రాంతం పట్ల.. ఇక్కడి ప్రజల పట్ల ఏ మేరకు ‘‘కృతజ్ఞత’’ ఉందో అర్థం చేసుకోవచ్చు. అభివృద్ధి పక్కనపెడితే కనీసం ఇన్నేళ్లలో అక్కడ సొంతిల్లు కూడా లేకుండానే నెట్టుకొచ్చిన వైనం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. (చదవండి: ఇజ్రాయెల్ ‘ఎగ’సాయం: బాబు ‘షో’కు.. నష్టాల సాగు)
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ముప్పై ఏళ్ల పాటు ఒకే నియోజకవర్గం నుంచి ప్రజాప్రతినిధిగా గెలవడం.. ప్రజలు గెలిపించడం అంటే.. నిజంగా సామాన్యమైన విషయమేమీ కాదు. సగటు జీవితకాలంలో సగ భాగానికి పైగా ప్రజాప్రతినిధిగా అవకాశం కల్పించిన, ఆదరించిన ఆ ప్రాంతంపై ఎవరికైనా అనుబంధం ఏర్పడుతుంది. అక్కడే ఇల్లు కట్టుకుని ఆ ఊరితో విడదీయరాని బంధం పెనవేసుకుంటారు. కానీ చంద్రబాబు రూటే సపరేటు కదా.. తనను మూడు దశాబ్దాలకుపైగా ఆదరిస్తున్న కుప్పంలో బాబు కనీసం ఇప్పటివరకు సొంతిల్లు కూడా కట్టుకోలేకపోయారు. దేశంలోనే అత్యంత సంపన్న రాజకీయ నేతగా దశాబ్దాల కిందటే పేరు మార్మోగిన బాబుకి కుప్పంలో చిన్నపాటి ఇల్లు కొనుగోలు చేయడం, లేదా నిర్మించుకోవడం అంటే వెంట్రుకవాసి పని.
అసలు ఇంటి వ్యవహారం ఆయన కూడా దగ్గరుండి చూసుకోవాల్సిన పనిలేదు. బాబు ఆదేశిస్తే చాలు.. తెలుగుదేశం నాయకులే కాదు ఓ సామాన్య కార్యకర్త సైతం కుప్పంలో ఇల్లు చూసే పరిస్థితి ఉంది. కానీ బాబుకి ఈ ప్రాంతం మీద ఇక్కడి ప్రజల మీద కనీస ప్రేమాభిమానాలు లేవు. అందుకే ఈ ముప్పైరెండున్నరేళ్ళలో చుట్టపుచూపుగా ఆర్నెల్లకో ఏడాదికో వచ్చి.. ఆర్ అండ్ బి గెస్ట్‌హౌస్‌లో రెండు రోజులు ఉండి వెళ్ళిపోవడం మినహా సొంతిల్లు కూడా ఏర్పాటు చేసుకోలేకపోయారు. కేవలం ఇక్కడి ప్రజలను ఓటర్లుగా మాత్రమే బాబు పరిగణిస్తున్నారనే వాదనకు ఇన్నేళ్ళలో కనీసం ఇల్లు కాదు కదా.. క్యాంపు కార్యాలయం కూడా లేకపోవడమే ప్రబల నిదర్శనం. జిల్లాలోని ఇన్ని నియోజకవర్గాలు ఉండగా.. బాబు ఈ కుప్పం ఈ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నారో కూడా ఒక్కసారి పరిశీలిద్దాం.
కుప్పం ఎందుకంటే..
1978లో చంద్రగిరి నుంచి తొలిసారి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అయిన బాబు 1983లో అదే నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. వెనువెంటనే టీడీపీలో చేరిన బాబు 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు. 1989 ఎన్నికలు వచ్చేసరికి సురక్షిత నియోజకవర్గం వేటలో పడ్డారు. అప్పుడే ఆయన దృష్టి కుప్పంపై పడింది. ఈ ప్రాంతంలో సైకిల్ గుర్తు ప్రభావం టీడీపీ ఆవిర్భావం ముందు నుంచే ఉంది. 1983కి ముందే కుప్పం పంచాయతీ సమితి అధ్యక్షుడు డి.వెంకటేష్ సైకిల్ గుర్తుపై ఇండిపెండెంట్‌గా రెండుమార్లు గెలిచారు. ఇక టీడీపీ ఆవిర్భావం తర్వాత 1983, 1985ల్లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి ఎన్.రంగస్వామి నాయుడు వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థులపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే బాబు కుప్పంపై కన్నేశారు.
(చదవండి: బాబు ఆస్థానం.. అవినీతి ప్రస్థానం: కుప్పంలో అడ్డగోలు దోపిడీ)
రంగస్వామి నాయుడుకి వెన్నుపోటు
టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉండి.. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించాలనే ఊపు మీద ఉన్న రంగస్వామి నాయుడుకి చంద్రబాబునాయుడు రూపంలో ఊహించని షాక్ తగిలింది. అక్కడి ప్రజలకు సైకిల్ గుర్తు మీద ఉన్న సెంటిమెంట్, టీడీపీ మీద ఉన్న అభిమానం చూసి.. బాబు కుప్పంకు షిఫ్ట్ అయిపోయారు. దరిమిలా రంగస్వామి నాయుడుని తొక్కేసి.. చివరికి కన్నుమూసే వరకు రాజకీయ తెరపై లేకుండా చేసేశారు.
ఇన్నేళ్లలో గంగమ్మ జాతర చూడని బాబు
కుప్పం ప్రజల పట్లనే చిన్నచూపు ఉన్న చంద్రబాబుకి ఆ ప్రజల ఆరాధ్య దైవం గంగమ్మ తల్లి పైనా కనీస భక్తిభావం లేదు. నిర్లక్ష్యం.. లెక్కలేనితనం ఉందనేందుకు నిదర్శనం ఇంతవరకు ఆయన ఒక్కసారిగా కూడా గంగమ్మ జాతరకు రాకపోవడమే. కుప్పంలో కొలువైన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవస్థానంకి మన రాష్ట్రం నుంచే కాకుండా పొరుగునే ఉన్న తమిళాడు, కర్ణాటకల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక ప్రతి ఏడాది మే మూడో మంగళవారం అత్యంత వైభవంగా.. ఘనంగా నిర్వహించే తిరుపతి గంగమ్మ జాతరకు లక్షలాదిమంది భక్తులు పోటెత్తుతారు. ఇంతటి విశేషమైన పర్వదినానికి ఇప్పటివరకు ఒక్కసారి కూడా చంద్రబాబు రాలేదంటే.. కుప్పం పట్ల, ఇక్కడి ప్రజల మనోభావాల పట్ల బాబుకు ఎంతటి గౌరవాభిమానం ఉందో అర్థమవుతోంది.
పీఏకి ప్యాలెస్ ఉంది కానీ..
చంద్రబాబు పీఏ, ఓ రకంగా చెప్పాలంటే చాలాకాలంగా కుప్పం ‘అనధికార’ ఎమ్మెల్యే మనోహర్‌కి మాత్రం ఇక్కడ ప్యాలెస్ తరహా ఇల్లు ఉంది. సకలసౌకర్యాలతో అధునాతన ఇంటిని ఆయన నిర్మించుకున్నారు. కానీ బాబు బస మాత్రం ఎప్పుడొచ్చినా ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌసే కావడం గమనార్హం.
లోకేష్ పెళ్లికి వస్తామన్నా పిలుపు లేదు..
ఈ ప్రాంతంపై నారా వారికున్న చిన్నచూపునకు ఇంత కంటే ఉదాహరణ అక్కరలేదు. లోకేష్, బ్రాహ్మణి వివాహానికి కుప్పం ప్రజల మాట అటుంచి కనీసం ఇక్కడి టీడీపీ నేతలకు కూడా ఆహ్వానాలు అందలేదు. దీంతో టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు రెండు బస్సులు వేసుకుని పెళ్లికొస్తామని అడిగినా అటు నుంచి పక్కాగా అనుమతి గానీ ఆహ్వానం గానీ రాకపోవడంతో మిన్నకుండిపోయారు. అయినా సరే నొచ్చుకోని టీడీపీ నేతలు లోకేష్, బ్రాహ్మణిల జంటను కుప్పం తీసుకువచ్చి ఫంక్షన్ చేయాల్సిందిగా అభ్యర్థిచారు. కానీ బాబు ఆ అభ్యర్థనను అస్సలు పట్టించుకోలేదు. పెళ్లయిన కొత్తలో ఆ జంటను మామ గారి ఊరు కృష్ణాజిల్లా నిమ్మకూరుకు తీసుకువెళ్లి బ్యాండ్ బాజా మోగించిన చంద్రబాబు తనను ఇన్నేళ్లుగా గెలిపించిన కుప్పంలో మాత్రం అడుగుపెట్టనీయలేదు. ఈ ఒక్క ఉదాహరణ చాలు.. కుప్పంపై బాబు కపట ప్రేమకు!
ఈ ప్రాంతంపై ఎంత చిన్నచూపంటే...
కుటుంబసభ్యులు కూడా ఎప్పుడూ రాలేదు.. కేవలం తనను గెలిపించే నియోజకవర్గంగానే కుప్పంను బాబు చూస్తూ వచ్చారు.. సెంటిమెంట్ డైలాగులు వల్లె వేసి ఇక్కడి ప్రజలను ఏమార్చడం తప్పించి మరే ఇతర అనుబంధం కూడా ఈ ప్రాంతంతో పెట్టుకోలేదు. సంక్రాంతి పండుగలకు, పబ్బాలకు సొంతూరు నారావారిపల్లెకు వచ్చి సేద తీరే బాబు కుటుంబం ఆయనను ఇన్నేళ్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తున్న కుప్పంకు మాత్రం ఒక్కసారి కూడా రాలేదు. కుప్పంలోనే ఉన్న హెరిటేజ్ ఫ్యాక్టరీకి బాబు సతీమణి భువనేశ్వరి ఒకటి రెండుసార్లు ఎవరికీ తెలియకుండా గోప్యంగా వచ్చి వెళ్లిన దాఖలాలు ఉన్నాయి.. కానీ కుప్పం సందర్శన గానీ.. ఇక్కడి ప్రజలతో మాటామంతీ గానీ పొరపాటున కూడా లేవంటే ఈ ప్రాంతంపై వారికి నిజమైన అనుబంధం ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment