జన్మభూమిలో పోలీసుల ‘ఓవర్’యాక్షన్
ఆధార్ ఉంటేనే లోపలికి... పోలీసు పహారా మధ్య కార్యక్రమం
వైఎస్సార్ సీపీ కార్యకర్తల అరెస్టు ఎమ్మెల్యే కల్పన జోక్యంతో విడుదల
పామర్రు : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించలతపెట్టిన జన్మభూమి-మావూరు కార్యక్రమం పలు వివాదాలకు నెలవవుతోంది. పింఛన్ల బాధితులు, రైతులు, డ్వాక్రా మహిళల నిరసనలు, దీర్ఘకాల సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారంటూ స్థానికుల ఆందోళనలు వెరసి పోలీసుల లాఠీచార్జీలతో రసాభాసగా కొనసాగుతున్నాయి. శనివారం కొమరవోలు లో జన్మభూమి కార్యక్రమం ఉదయం బ్యానర్లు కట్టే విషయంలోనే గొడవతో ప్రారంభమైంది. పోలీసు సిబ్బంది ఉదయమే వచ్చి గ్రామంలో ఉన్నప్పటికీ... వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కట్టిన బ్యానర్లు కన్పించకుండా....వాటికి అడ్డుగా టీడీపీ నాయకులు బ్యానర్లు కట్టడంతో ఘర్షణ ప్రారంభమయ్యింది. ఇరు వర్గాలకు న్యాయం చేయాల్సిన పోలీసులు పక్షపాతంగా వ్యవహరించి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కట్టిన బ్యానర్లు తొలగించారు.
తమకు న్యాయం చేయాలని వేడుకున్న కార్యకర్తలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన జోక్యంతో విడిచి పెట్టారు. తదుపరి గ్రామం ముఖద్వారం వద్ద పోలీసులు పెద్దసంఖ్యలో మోహరించి బయట వ్యక్తులు ప్రవేశించకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఈ విషయంలో గ్రామస్తులను సైతం ఆధార్‌కార్డు చూపనిదే గ్రామంలోకి పంపలేదు. దీంతో రైతులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఎమ్మెల్యే కల్పన తన కార్యకర్తలతో కలిసి కొమరవోలు ముఖద్వారం వద్దకు వచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎమ్మెల్యే కల్పన అనుచరుల కారును అడ్డగించి కారులోని వ్యక్తులను జన్మభూమి పంపకుండా నిలిపివేశారు. దీంతో కార్యకర్తలకు, పోలీసులకు మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది.
సభ ఇలా జరిగింది...
తొలుత జన్మభూమి- మన ఊరు కార్యక్రమానికి సర్పంచి పొట్లూరి కృష్ణకుమారి హాజరు కాగా, టీడీపీ కార్యకర్తలు ఆమెను అడ్డగించడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. జన్మభూమికి ఎమ్మెల్యే కల్పన హాజరు కావడంతో ఆమెతో పాటు సర్పంచి కలసి వచ్చారు. ఎమ్మెల్యే కల్పన మాట్లాడుతూ ప్రొటోకాల్‌లో ఉన్న వ్యక్తులను మాత్రమే వేదికపై ఉంచి మిగిలిన వ్యక్తులను పంపించి వేయాలని ఎంపీడీవో రామనాథంను ఆదేశించారు. దీనికి ఎంపీడీవో బదులిస్తూ సర్పంచి లేకపోవడంతోనే ఉపసర్పంచి అధ్యక్షత వహించారన్నారు. ఇది జరుగుతుండగానే సభా ప్రాంగణం బయట రోడ్డుపై ఉన్న ఇరుపార్టీల కార్యకర్తలు వేదిక వైపు దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఇరుపార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఒకానొక సమయంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైకి దూసుకు రావడంతో పోలీసులు లాఠీఛార్జీ చేసి ఇరుపార్టీల వారిని చెల్లాచెదురు చేశారు. అనంతరం ఘర్షణ సద్దుమణిగాక ఎమ్మెల్యే ప్రసంగాన్ని ముగించి వెళ్లిపోయారు.
భారీ బందోబస్తు....
ఓ డీఎస్పీ, ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్‌ఐలు, మరో 50మంది కానిస్టేబుళ్ల బందోబస్తు మధ్య కార్యక్రమం కొనసాగింది. కాగా డీఏస్పీ అంకినీడు ప్రసాద్ వచ్చి రాగానే సిబ్బందిని మీ లాఠీలు ఏవని ప్రశ్నించారు. తీసుకు రాలేదని చెప్పడంతో లాఠీలులేకుండా విధులకు ఎలా హాజరయ్యారని సున్నితంగా మందలించారు. దీంతో పోలీసులు పామర్రు స్టేషన్‌కు వెళ్లి జీపులో లాఠీలు తెచ్చారు.