తహసీల్దార్‌ను నిలదీస్తున్న తమ్మరాజు పాలెం వాసులు
కర్నూలు(అగ్రికల్చర్)/సాక్షి నెట్‌వర్క్: జన్మభూమి– మా ఊరు కార్యక్రమంలో నిరసనలదే పైచేయి అవుతోంది. పలు గ్రామాల్లో ప్రజల ప్రశ్నలకు అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గురు వారం జరిగిన గ్రామ సభల్లో పలు చోట్ల నిరసనలు చోటుచేసుకున్నాయి. 9వ రోజు జిల్లా వ్యాప్తంగా 112 సభలు జరిగాయి. పలుచోట్ల జనాలు లేక సభలు వెలవెలబోయాయి. కాగా జన్మభూమి కార్యక్రమం శుక్రవారం ముగియనుంది. చివరి రోజు ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు.
♦ ఓర్వకల్‌లో గురువారం జరిగిన సభలో జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ వ్యవహరించిన తీరుపై ముస్లీం మైనార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అబ్దుల్లా అనే వ్యక్తి మాట్లాడుతూ ఓర్వకల్‌లో షాదీఖానా నిర్మాణానికి రెవెన్యూ, విద్యుత్ అధికారులు సహకరించడం లేదని, రెండేళ్లుగా తిరుగుతున్నా విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
♦ కోడుమూరు మండలం పులకుర్తి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో నీటి సమస్యపై ప్రజలు అధికారులపై ధ్వజమెత్తారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పక్కా ఇళ్లు, పింఛన్లు, రేషన్ కార్డుల మంజూరులో అర్హులకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
♦ ఆదోని మండలం ఇస్వి గ్రామంలో ఇప్పటి వరకు సంక్రాంతి కానుకలు పంపిణీ చేయకపోవడంపై ప్రజలు అధికారులను నిలదీశారు. సభకు హాజరైన రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ చల్లా రామకృష్ణా రెడ్డి డీలర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలర్‌ను సస్పెండ్ చేయాలని జేసీతో మాట్లాడారు. ఒక్క రోజులో కార్డుదారులందరికీ కానుకలు పంపిణీ చేయాలని ఆదేశించారు.
♦ పాములపాడు మండలం మిట్టకందాలలో ప్రజలు అధికారులను నిలదీశారు. తాగునీటికి అల్లాడుతున్నాం... టీడీపీ నాయకులు అసైన్‌ల్యాండ్‌లో ఎర్రమట్టి కోసం అడ్డుగోలుగా తవ్వుకొని తరలిస్తున్నా చర్యలు లేవరి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించనందుకు కింద కూర్చొని నిరసన తెలిపారు.
♦ బేతంచెర్ల మండలం సీతారాంపురం గ్రామంలో సమస్యలపై ప్రజలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడం లేదని, పింఛన్లు, పక్కా ఇళ్లు అనర్హులకు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ♦ వెల్దుర్తి మండలం బోగోలులో వివిధ ప్రాంతా లకు చెందిన వారికి పక్కా ఇళ్లు మంజూరు కావడంపై అధికారులను నిలదీశారు. తమ రేషన్ కార్డులతో కర్నూలులో ఉన్న వారికి ఇళ్లు మంజూరు కావడమేంటని ప్రశ్నించారు.
♦ కర్నూలు నగరపాలకసంస్థలోని 44వ వార్డులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో సీపీఎం నేతలు వివిధ సమస్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భగత్‌సింగ్ నగర్ నుంచి వెళ్లే ప్రధాన రోడ్డులో మమతానగర్, ప్రేమ్‌నగర్‌ల మధ్యనున్న అసంపూర్తి రోడ్డుపై సీపీఎం నాయకులు రాముడు, అంజిబాబు, ఉస్మాన్‌బాషా తదితరులు ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment