వివిధ సమస్యలపై అధికారులను నిలదీస్తున్న శిరివెళ్ల మండలం గుండంపాడు గ్రామస్తులు
కర్నూలు(అగ్రికల్చర్): ‘ఇది వరకు ఐదు సార్లు జన్మభూమి నిర్వహించారు. అది చేస్తాం, ఇది చేస్తామంటూ హామీలు గుప్పించారు. వివిధ సమస్యలపై వినతులు ఇచ్చాం. ఏ ఒక్కటీ పరిష్కరించలేదు. అలాంటప్పుడు ఈ సభలెందుకు’ అంటూ ప్రజలు మండిపడ్డారు. ఆరో విడత జన్మభూమి – మాఊరు కార్యక్రమం బుధవారం ప్రజల నిరసనల మధ్య ప్రారంభమైంది. మొదటి రోజు 96 గ్రామ పంచాయతీలు, 27 వార్డుల్లో.. మొత్తంగా 123 సభలు నిర్వహించారు. గూడూరు మండలం కె.నాగులాపురం, కోడుమూరు, కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలోని 19 వార్డులో జరిగిన సభల్లో కలెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు. కోడుమూరు, నాగలాపురం గ్రామాల్లో మార్గదర్శకాలను పాటించకపోవడం, విధుల్లో నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు పంచాయతీ సెక్రటరీలను సస్పెండ్ చేయాలని జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్‌రావును కలెక్టర్ ఆదేశించారు.
జన్మభూమిలో ముఖ్యమంత్రి ప్రసంగ పాఠాన్ని చదవడం, గ్రామంలో ఇంతవరకు చేసిన అభివృద్ధి పనుల వివరాలను చదివి వినిపించడానికే పరిమితమయ్యారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, పర్యాటక శాఖ మంత్రిభూమా అఖిలప్రియ మొదటి రోజు కార్యక్రమంలో పాల్గొనలేదు. నంద్యాలలో జరిగిన కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఫరూక్ పాల్గొన్నారు. రెవెన్యూ డివిజన్‌ల వారీగా నోడల్ అధికారులుగా నియమితులైన ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు జిల్లాలో పర్యటించారు. పలుచోట్ల జనాలు లేక సభలు వెలవెలబోయాయి. పింఛన్‌లు పంపిణీ చేస్తామని వృద్ధులు, వికలాంగులు, వితంతువులను రప్పించి సభలను మమ అనిపించారు. కొన్ని గ్రామాల్లో అయితే విద్యార్థులను పిలుచుకొని వచ్చి కార్యక్రమాన్ని కానిచ్చారు.
అన్నవరంలో బహిష్కరణ...
♦ అవుకు మండలం అన్నవరం గ్రామ ప్రజలు జన్మభూమి కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఈ గ్రామంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు ఉన్నారనే కారణంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి పట్టించుకోవడం లేదని వారు మండిపడ్డారు. అలాంటప్పుడు జన్మభూమి దండగ అంటూ బహిష్కరించారు. గ్రామస్తుల మూకుమ్మడి నిరసనతో అధికారులు ఉక్కిరిబిక్కిరయ్యారు.
♦ గడివేముల మండలం బిలకలగూడూరులో గ్రామసభ నిర్వహణకు వెళ్లిన అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. గతంలో ఇచ్చిన వినతులకే దిక్కులేదు.. ఇప్పుడిచ్చే దరఖాస్తుల పరిష్కారానికి ఎంతకాలం పడుతుందోనని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు.
♦ కల్లూరు మండలం తడకనపల్లిలో స్థానిక ఎంపీటీసీ సభ్యుడు మర్రి గోపాల్ వివిధ సమస్యలపై అధికారులను నిలదీశారు. విద్యుత్ పోల్ లేకపోవడం వల్ల కర్రలపై లైన్ వేసుకున్నామని, దీనిపై గతంలో మూడు సార్లు వినతులు ఇచ్చినా అతీగతీ లేదని అన్నారు.
♦ కర్నూలు 19వ వార్డులో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పాల్గొని.. వివిధ సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. 19వ వార్డుకు మీసేవ కేంద్రం కేటాయించాలని, అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని, సీసీ రోడ్లు, డ్రైనేజీ సదుపాయం కల్పించాలని కోరారు.
♦ ఆలూరు మండలం కురవెల్లిలో తెలుగుదేశం పార్టీ నాయకులు తప్ప ప్రజలు కనిపించలేదు. అప్పటికప్పుడు విద్యార్థులను రప్పించి మమ అనిపించారు.
♦ హాలహర్వి మండలం విరుపాపురం, దేవనకొండ మండలం కుంకనూరు, అలారుదిన్నె, ఆస్పరి మండలం నగరూరు గ్రామాల్లో అధికారులను నిలదీశారు. నగరూరులో తీవ్ర నీటి సమస్య ఉన్నా పట్టించుకోవడం లేదని ధ్వజమొత్తారు. కుంకనూరు, అలారుదిన్నె గ్రామాల్లో ఉపాధి కూలీలకు వేతనాలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
♦ నందికొట్కూరు నియోజకవర్గంలోని మిడుతూరు, జూపాడుబంగ్లా, నందికొట్కూరు మండలాల్లో జన్మభూమి కార్యక్రమానికి స్పందన కరువైంది. ఆత్మకూరు, కోవెలకుంట్ల, ఓర్వకల్లు, డోన్ తదితర మండలాల్లోనూ సభలు తూతూ మంత్రంగా జరిగాయి.
సీఎం ప్రసంగాన్ని పట్టించుకోని ప్రజలు
బుధవారం సాయంత్రం రాష్ట్ర విభజన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగాన్ని లైవ్ టెలికాస్ట్ చేశారు. ఈ ప్రసంగాన్ని ప్రజలు వినేలా అధికారులు అన్ని గ్రామాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. ప్రజలు నామమాత్రంగా కూడా రాలేదు. ప్రతి రోజు ఒక అంశాన్ని ఎంపిక చేసి దానిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి పంచాయతీకి ఒక టీమ్ ఏర్పాటు చేశారు. ఈ టీమ్‌లు 10 రోజుల పాటు గ్రామాల్లోనే ఉండాల్సి ఉంది. ప్రతి రోజు ఒక అంశంపై ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. దీన్ని లైవ్ టెలికాస్ట్ ద్వారా ప్రసారం చేస్తారు. అయితే.. మొదటి రోజే ముఖ్యమంత్రి ప్రసంగాన్ని వినిందుకు ప్రజలు రాకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment