ఎమ్మెల్యే బుడ్డా తీరుకు నిరసనగా ఆత్మకూరులో మంత్రి ఫరూక్ సమక్షంలో ఆందోళన చేస్తున్న మైనార్టీ నాయకులు
ఆత్మకూరురూరల్/ కర్నూలు సీక్యాంప్: జన్మభూమి సాక్షిగా అధికార పార్టీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. ఆ పార్టీ శ్రేణులు వర్గాలుగా విడిపోయి గొడవలకు దిగుతున్నారు. ముఖ్యంగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తీరుపై సొంత పార్టీలోని మైనార్టీ నేతలు రగిలిపోతున్నారు. తమను ఎమ్మెల్యే అవమానిస్తున్నారంటూ గురువారం జన్మభూమి సాక్షిగా సాక్షాత్తు రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ సమక్షంలోనే ఆందోళనకు దిగారు. ఆత్మకూరు పట్టణ శివారులో రూ.2.20 కోట్లతో నిర్మించనున్న షాదీఖానకు శంకుస్థాపన చేయడానికి మంత్రి ఫరూక్, ఉర్దూ అకాడమీ చైర్మన్ నౌమాన్ ముఖ్యఅతిథులుగా వచ్చారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన పలువురు మైనార్టీలు మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. తమకు ఎమ్మెల్యే తీవ్ర అన్యాయం చేస్తున్నారని, మైనార్టీ కాలనీని సర్వే చేయించేందుకు వెళితే సర్వేయర్లను రానివ్వడం లేదని, తమ స్థలాలను వేరే పనులకు వినియోగించేందుకు పూనుకున్నారని వాపోయారు.
అలాగే రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ అహమ్మద్ హుసేన్‌ను ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించకుండా అవమానిస్తున్నారన్నారు. ప్రొటోకాల్ పాటించకుండా అధికారులను సైతం బెదిరిస్తున్నారన్నారు. ఆందోళన నేపథ్యంలో సుమారు గంట సేపు ఉద్రిక్తత నెలకొంది. ఇన్‌చార్జ్ డీఎస్పీ వినోద్ కుమార్, సీఐ కృష్ణయ్య తమ సిబ్బందితో కలిసి ఆందోళనకారులను పక్కకు తొలగించి.. మంత్రి కాన్వాయ్‌కి దారి చూపే యత్నం చేశారు. అయినప్పటికి వారు పట్టు వీడలేదు. చివరకు మంత్రి తన వాహనం దిగి.. వారిని సముదాయించారు. కాగా.. తనకు ఆహ్వానాలు అందకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని అహమ్మద్ హుసేన్ టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో అధిష్టానం నుంచి ఎమ్మెల్యేకు ఫోన్ రావడంతో ఆయన స్వయంగా అహమ్మద్ హుసేన్‌కు ఫోన్ చేసి జన్మభూమి కార్యక్రమానికి ఆహ్వానం పలికినట్లు సమాచారం.
ఉల్చాలలో గొడవ
కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని ఉల్చాల గ్రామంలో జన్మభూమి సభలో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలు విడిపోయి గొడవ పడ్డారు. గురువారం ఉదయం కర్నూలు డిప్యూటీ తహసీల్దార్ చంద్రకళ ఆధ్వర్యంలో జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. వేదికపై ఒకవైపు ఎమ్మెల్యే మణిగాంధీ, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, మరోవైపు కర్నూలు ఎంపీపీ రాజవర్ధన్‌రెడ్డి కూర్చున్నారు. మూడేళ్లుగా తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని, వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టించుకోవడానికి మామూళ్లు తీసుకుంటున్నారని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఈ సమస్యలపై ఎమ్మెల్యే బదులు కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి వివరణ ఇచ్చారు. దీంతో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ విష్ణువర్ధన్‌రెడ్డి వర్గీయులు కొత్తకోట ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే మణిగాంధీనా లేక కొత్తకోట ప్రకాశ్‌రెడ్డా? అంటూ గొడవకు దిగారు. ప్రొటోకాల్ పాటించకుండా ఇష్టమొచ్చినవారిని మాట్లాడించడమేంటని అధికారులను ప్రశ్నిస్తూ కర్నూలు వైస్ ఎంపీపీ వాసు ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. అనంతరం జన్మభూమిని బహిష్కరించి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment