పురుగు మందు తాగిన నరాల జలపతిని బైక్‌పై ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం
కర్నూలు, ఆస్పరి: ప్రభుత్వం నుంచి పక్కాగృహం, కుమార్తెకు పింఛన్ మంజూరు కాకపోవడంతో మనస్తాపానికి గురైన ఆస్పరి మండలం హలిగేర గ్రామానికి చెందిన రైతు గొల్ల నరాల జలపతి అధికారుల ముందే పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆరో విడత జన్మభూమి– మా ఊరు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం హలిగేరలో నిర్వహించిన గ్రామసభలో ఈ ఘటన చోటుచేసుకుంది. గొల్ల నరాల జలపతి, సుజాతమ్మకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె శ్రుతి మూగ, చెవిటి కావడంతో పింఛన్ కోసం పలుమార్లు దరఖాస్తు చేశాడు. అలాగే హౌసింగ్ పథకం కింద ఇల్లు మంజూరు చేయాలంటూ నాలుగేళ్లుగా అర్జీలు ఇస్తూనే ఉన్నాడు. అయినా ప్రభుత్వం స్పందించలేదు. జన్మభూమి సభలో మరోమారు అర్జీలు ఇవ్వడానికి కుమార్తె శ్రుతిని వెంటబెట్టుకుని వచ్చాడు. అయితే.. అధికారులు దరఖాస్తులు మధ్యాహ్నం ఇవ్వాలంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ‘నేను చచ్చిన తరువాతైనా ఇస్తారా?’’ అంటూ వెంట తెచ్చుకున్న పురుగు మందు తాగాడు. గ్రామస్తులు పురుగు మందు డబ్బాను లాక్కునేలోపు మందు తాగేయడంతో అక్కడికక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే గ్రామస్తులు మోటారు బైక్‌పై ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన జలపతి అపస్మారకస్థితిలో పడిపోయినా చికిత్స కోసం అధికారులు తమ వాహనంలో ఆస్పత్రికి తరలించకపోవడంతో గ్రామస్తులు మండిపడ్డారు.
ఇల్లు మంజూరు కాలేదు
జలపతి ఆన్‌లైన్‌లో ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదని, మంజూరైన వెంటనే బిల్లు ఇస్తామని మండల హౌసింగ్ ఏఈ సత్య భాస్కర్‌రావు తెలిపారు. జలపతి కుమార్తె శ్రుతికి గత డిసెంబర్ 26న సదరం సర్టిఫికెట్ ఇచ్చారని, అయితే డిసెంబర్ 25న ఆన్‌లైన్ చేసే వెబ్‌సైట్‌ను ప్రభుత్వం బంద్ చేసిందని మండల పరిషత్ జూనియర్ క్లర్క్ దస్తగిరి చెప్పారు.
బాధితుడికి న్యాయం చేయాలి
నరాల జలపతికి ప్రభుత్వం న్యాయం చేయాలి. టీడీపీ ప్రభుత్వంలో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు మంజూరు కావడం లేదు. టీడీపీ నాయకులకు డబ్బులిస్తేనే ఇల్లు, పింఛన్లు మంజూరవుతాయి. అర్హులకు అన్యాయం జరుగుతోంది. ఇది కనికరం లేని ప్రభుత్వం. – గుమ్మనూరు జయరాం, ఆలూరు ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment