విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జన్మభూమి–మాఊరు కార్యక్రమం పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు మరో మోసానికి తెరలేపారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. 2014 ఎన్నికల్లో అనేక అబద్ధపు హామీలిచ్చి.. అధికారం చేపట్టాక వాటన్నింటిని విస్మరించి ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ప్రజలు ఊరుకోరన్నారు. ఇప్పటికే రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణాలు, నిరుద్యోగభృతి పేరుతో యువతను చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధర్మాన మాట్లాడారు. సమర్ధవంతమైన పాలన అందిస్తున్నానని, దేశంలో ఎక్కడ ఏంజరిగినా అది నేనే చెప్పానని.. నా ఆలోచనే అని డబ్బాలు కొట్టుకుంటున్న బాబు రాష్ట్రానికి ఏమి చేశాడో చెప్పాలని ధర్మాన ప్రశ్నించారు.
అవినీతిలో ఏపీనే నంబర్ వన్!
చంద్రబాబు చేసిన మోసాలకు, అవినీతికి, అన్యాయానికి గత నాలుగేళ్లుగా అడ్డేలేకుండా పోయిందని ప్రసాదరావు అన్నారు. అవినీతిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను నంబర్‌వన్‌గా తీర్చిదిద్దిన ఘనత బాబుకే దక్కిందన్నారు. అవినీతిని అంతమొందించడం అంటేరెవెన్యూ, ఇతర శాఖల అధికారులు రూ. రెండు వేలు, మూడు వేలు తీసుకుంటూ ఏసీబీకి పట్టించమే అవినీతిని నిర్మూలించడం కాదన్నారు. ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్లు దోచుకొని దుబారా చేయడం వంటివి కూడా అవినీతిలోకే వస్తాయన్నారు.
టీడీపీ నేతల దోపిడీ
టీడీపీ నాయకులు, కార్యకర్తల జేబులు నింపడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకం నిధులను 40 శాతం మెటీరియల్ కాంపోనెంట్ పేరుతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి రూ. లక్షల కోట్లు దోచుకున్నారన్నారని ఆరోపించారు. నీరు–చెట్టు పేరుతో చెరువులు, గెడ్డల పనులను నామినేషన్ పద్ధతిలో పైపైన చేపట్టి బిల్లులు చేసుకుని కోట్లాది రూపాయిలు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలంతా కేంద్రం ఇచ్చే నిధులన్నీ బొక్కేసి తీరా ఏమి ఇవ్వలేదని చెబుతున్నారన్నారు. చీఫ్ సెక్రటేరియెట్‌లు, సెక్రటేరియెట్‌లు, చెప్పినా వారిని సైతం వ్యతిరేకించి తమకు అనుకూలంగా జీవోలు తయారు చేసుకుని గ్రామీణస్థాయి నుంచి కేబినెట్ స్థాయి వరకు అన్ని నిర్ణయాలు దోపిడీ, స్వార్ధపూరితంగానే టీడీపీ నేతలు చేస్తున్నారన్నారు.
ఎన్నికల సమయంలో హడావుడి
దేశ వ్యాప్తంగా 10 విడతలుగా ఎన్నికలు జరగనున్నాయని, ఏపీలో రెండో విడతలో ఎన్నికలు నిర్వహించే అవకాశముందని ధర్మాన అన్నారు. మరో 45 రోజుల్లో ఎన్నికల నగరా మోగనుందని.. ఈ సమయంలో హడావుడి చేసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడం వల్ల చేసేదేముండదన్నారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు పూర్తయవుతాయని ఆ తరువాత టీడీపీ ఉంటుందా... ఊడుతుందా అని ప్రశ్నార్ధకంగా ఉన్న సమయంలో ఈ హడావుడి ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ రంగు బయటపడిందన్నారు. ఎన్ని కల ఫలితాల అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి కూడా చంద్రబాబు సమాధానం చెప్పలేక ఉక్కిరి బిక్కిరి అయిపోయారన్నారు.
బీజేపీతో స్నేహం వల్ల ఒరిగేది శూన్యం
చంద్రబాబు బీజేపీతో జతకట్టడం వల్ల రాష్ట్రానికి పైసా ఉపయోగం లేకుండాపోయిందన్నారు. నాలుగున్నరేళ్ల పాటు ప్రధానమంత్రి మోదీని చంద్రబాబు తన భుజాలపై మోసుకుని ప్రపంచంలో ఇటువంటి ప్రధాని లేరని, రాష్ట్రానికి అడిగిన దానికంటే ఎక్కువే ఇచ్చారంటూ కితాబిచ్చారన్నారు. ఇప్పుడు అదే నోట ఏమి ఇవ్వలేదు.. రాష్ట్రానికి మోసం చేశారని ఊసరవల్లి మాటలు ఆడటం సరికాదన్నారు. రాష్ట్ర విభజన హామీలను అమలు చేయడం లేదని కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని వైఎస్సార్‌సీపీ 2014 నుంచే ధర్నాలు చేపడుతున్నా కనీసం పట్టించుకోకుండా కేసులు బనాయించి భగ్నం చేసి ఇప్పుడు ఎన్ని చెప్పినా పట్టించుకున్న నాథుడే లేడన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులన్నీ తినేసి కాంగ్రెస్‌తో చేతులు కలిపి ‘ధర్మ పోరాట దీక్ష’ పేరుతో కొంగ దీక్షలు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. 13 జిల్లాలో కలిపి దాదాపుగా రూ.91 కోట్లు వృథా చేశారని సాక్షాత్తు టీడీపీ నాయకులే చెబుతున్నారన్నారు.
ప్రజల బాధలను తెలుసుకోవడానికి ప్రజాసంకల్పయాత్ర
రాజ్యాంగ సంస్థలు పనిచేయనప్పుడు, దోపిడీని ప్రశ్నించేందుకు అవకాశం లేకుండా రాక్షస పాలన కొనసాగిస్తున్న టీడీపీకి చెక్ చెప్పేందుకు వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర చేపట్టాల్సి వచ్చిందన్నారు. 2003లో రాష్ట్రంలో కరువు, జంతువుల కళేబరాలు, రైతు ఆత్మహత్యలు, ఆకలికేకలు వినిపిస్తున్న సమయంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేపట్టారన్నారు. అందరి సమస్యలు తెలుసుకుని ప్రజల అవసరాలకు తగినట్లుగా సంక్షేమ పథకాలు రూపొందించి.. ఆ హామీలతో గెలుపొందాక అందరి మనసులు దోచుకుని ప్రజల గుండెల్లో దేవుడిలా నిలిచిపోయారన్నారు. తండ్రి బాటలో నడుచుకొని, ఇచ్చిన మాటకు కట్టుబడిన వ్యక్తే జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీలో గొంతెత్తకుండా చేయడం వల్లే నేరుగా ప్రజల్లోకి వచ్చి ఏడాదిగా ప్రజాసంకల్పయాత్ర చేస్తున్నారన్నారు. ఈ నెల 9వ తేదీన ఇచ్ఛాపురంలో ప్రజాసంకల్పయాత్ర ముగియనుందని ధర్మాన వెల్లడించారు. సమావేశంలో పార్టీ రాజకీయవ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, జెడ్పీ మాజీ చైర్మన్ వై.వి సూర్యనారాయణ, సీఈసీ మెంబర్ అంధవరపు సూరిబాబు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎం.వి.పద్మావతి, పార్టీ నాయకులు కె.ఎల్. ప్రసాద్, అంబటి శ్రీనివాసరావు, చల్లా రవికుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment