భామిని: బాలేరు సభలో తోపులాటకు దిగుతున్న రెండు వర్గాలు
శ్రీకాకుళం, భామిని: తమ కష్టాలు, నష్టాలపై నిలదీస్తున్న ప్రజలకు అధికారులు సమాధానం ఇవ్వకుండా, టీడీపీ నాయకులు దురుసుగా ప్రవర్తించడంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ కార్యక్రమమా? లేదా టీడీపీ సమావేశమా? అధికారులు సమాధానం చెప్పాలని నిలదీశారు. వీరికి మద్దతుగా నిలిచిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తత వాతావరణానికి దారితీసింది. తహసీల్దారు జేబీ జయలక్ష్మి ఆధ్వర్యంలో మండలంలోని బాలేరులో గురువారం నిర్వహించిన జన్మభూమి–మాఊరు కార్యక్రమంలో తిత్లీ తుఫాన్ పంట నష్టాలపై గ్రామస్తులు నిలదీశారు. తుఫాన్ ధాటికి ఎగిరిపోయిన ఇళ్లు, పశువుల పాకల నష్టాలను గుర్తించి పలుమార్లు జియోట్యాగింగ్ చేసిన అధికారులు పరిహారాలు ఇవ్వడంలో వైఫల్యం చెందారని వైఎస్సార్‌సీపీ నాయకులు మేడిబోయిన చలపతిరావు, కొత్తకోట చంద్రశేఖర్, రొక్కం రామారావు, దామోదర జగదీష్ మండిపడ్డారు.
ఈ క్రమంలో పక్కా గృహాల బిల్లులు కోసం ప్రశ్నించిన లబ్ధిదారులకు టీడీపీ నాయకుడు జయకృష్ణను కలవాలని ప్రత్యేకాహ్వానితులు ఎం జగదీశ్వరరావు అని సూచించడంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈయన సమాధానం ఇవ్వడమేమిటని, అధికారులే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేయడంతో వివాదం రేగింది. వీరికి మద్దతు పలికిన వైఎస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించడంతో తోపులాట సాగింది. రెండు వర్గాల కోట్లాటకు చేరుకునే దశలో ఏఎస్సై అప్పలనాయుడు జోక్యం చేసుకున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను, ప్రజలను బయటకు పంపించారు. ఇంతలో బత్తిలి ఎస్సై ముదిలి ముకుందరావు, కొత్తూరు సీఐ మజ్జి నాగేశ్వరరావు పోలీసు బృందాలతో వేర్వేరుగా సభా వేదిక వద్దకు చేరుకున్నారు. దీంతో ప్రజా సమస్యలపై అధికారులు సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మీనక భారతి, వెలుగు ఏపీఎం వై రమణ, వాటర్‌షెడ్ ఏపీవో బీ శంకరరావు, ఆర్‌ఐ కొల్ల వెంకటరావు పాల్గొన్నారు.
మూగజీవాలపై కనికరం లేదా?
వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలోని నగరంపల్లి గ్రామంలో గురువారం జన్మభూమి– మాఊరు కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతల నడుమ కొనసాగింది. గ్రామస్తుల నిలదీతలతో రెండు గంటలపాటు నిలిచిపోయిన ఈ కార్యక్రమాన్ని పోలీసుల పహరా మధ్య నిర్వహించారు. ‘తిత్లీ తుఫాన్‌కు పశువుల శాలలు నేలమట్టం కావడంతో మూగజీవాలకు తాత్కాలిక రక్షణగా ప్రభుత్వం ఇచ్చిన టార్పాలిన్లు అనర్హుల చేతిలో చేరాయి, దీంతో ప్రస్తుతం అవి చలికి వణుకుతున్నాయి, ఏమాత్రం వీటిపై మీకు కనికరం లేదా’ అంటూ అధికారులను బాధితులు నిలదీశారు. ఈ టార్పాలిన్లు ఎవరికీ ఇచ్చారో లెక్క చెప్పాలని వారితోపాటు పీఏసీఎస్ అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ నాయకుడు దువ్వాడ మధుకేశ్వరావు, మాజీ సర్పంచ్ దువ్వాడ జయరాంచౌదరి పట్టుబట్టడంతో ఒక్కసారిగా ఉధృత వాతావరణం నెలకొంది. ఇదేక్రమంలో మానసిక దివ్యాంగురాలికి పదేళ్లుగా పింఛను ఇవ్వడంలేదని, ఈ పాప ఏ పాపం చేసిందని చిన్నారి తల్లి ఎల్ హేమలతతోపాటు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్థానిక ఎస్సై నర్సింహులు అక్కడకు హుటాహుటిన చేరుకుని పరిస్థితి సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ శాంతించని బాధితులు సభ నిర్వహణకు అడ్డుతగిలారు. పోలీసుల పహరా ఏర్పాటు చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు. చివరికి టార్పాలిన్లు లబ్ధిదారుల జాబితాను పలాస నుంచి వీఆర్వో తీసుకొచ్చి బహిర్గతం చేయడంతో సభ ముగిసింది. అదేవిధంగా పెదబాడంలోనూ తుఫాన్ బాధితులు నిలదీశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జీ వసంతరావు, వజ్రపుకొత్తూరు పీహెచ్‌సీ అభివృద్ధి కమిటీ చైర్మన్ దువ్వాడ వెంకటకుమార్ చౌదరి, డిప్యూటీ తహసీల్దారు అప్పలస్వామి, వివిధ శాఖాధికారులు మెట్ట పాపారావు, గోపి, గౌతమి పాల్గొన్నారు.
జన్మభూమిని బహిష్కరించిన బెంతొరియాలు
కంచిలి: మండలంలోని కొన్నాయిపుట్టుగ పంచాయతీ కేంద్రంలో గురువారం జన్మభూమి– మాఊరు గ్రామసభను గ్రామస్తులు బహిష్కరించారు. ప్రజాసాధికార సర్వేలో బెంతొరియా సామాజిక వర్గాన్ని విస్మరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ సంఘం ప్రతినిధులు వెల్లడించారు. ఈ మేరకు తహసీల్దారు డీ రామ్మోహనరావుకు వినతి పత్రం అందజేశారు.–
మోసాలకు పాల్పడుతున్న మిల్లర్లు
ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు మోసాలకు పాల్పడుతున్నారని జన్మభూమిలో కుత్తుం గ్రామానికి చెందిన రైతులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. తేమ ఎక్కువగా ఉందనే కారణంతో బస్తా వద్ద 3 నుంచి 4 కిలోల వరకు కొలతలో తక్కువగా లెక్కిస్తున్నారని వాపోయారు. ఈ సమావేశంలో ఎంపీపీ ఇప్పిలి లోలాక్షి, ఎంపీడీవో చల్లా శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment