దేవరాపల్లి మండలం కొత్తపెంట జన్మభూమి మాఊరు సదస్సులో అక్రమ చేపల చెరువులపై నిలదీస్తున్న బాధిత రైతులు
సాక్షి, విశాఖపట్నం: జన్మభూమి–మా ఊరు కార్యక్రమం అధికారుల పాలిట శాపంగా మారింది. వారికి తీవ్ర నిరసనలు ఎదురవుతున్నాయి. జనం ఆగ్రహజ్వాలలధాటికి అధికారులు తాళలేకపోతున్నారు. ప్రజలకు సమాధానం చెప్పలేక అవస్థలకు గురవుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు వరుసగా నాల్గో రోజు కూడా నిరసనలు ఎదురయ్యాయి. నక్కపల్లి మండలం ఉద్దండపురం, వేంపాడు గ్రామసభలు రసాభాసగా జరిగాయి.అధికార పార్టీ నేతల చిల్లర రాజకీయాలు అంగన్‌వాడీ కేంద్రాలపై వారు పాల్పడుతున్న కక్షసాధింపు చర్యలపై వైఎస్సార్‌సీపీ నేతలు నిలదీశారు. గ్రామ సభలను అడ్డుకుని నిరసన వ్యక్తంచేశారు. ఉద్దండపురంలో కొత్తగా నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రాన్ని వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు శ్రీలక్ష్మి ప్రారంభించారన్న కారణంగా అక్కడ టీడీపీ నాయకులు, అధికారులు కుమ్మక్కై నూతన భవనంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని వైఎస్సార్ సీపీ నాయకులు బచ్చలరాజు, పొడగట్ల వెంకటేష్, దోని గోపి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదినుంచి చిన్నారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. నూతన భవనం విషయంలో అధికారులు,రాజకీయ నాయకులు తమను చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఏడాది నుంచి ఇరువర్గాల ఒత్తిళ్లు తట్టుకోలేక పోతున్నామని గ్రామసభలో అంగన్‌వాడీ కార్యకర్త భర్త పొడగట్ల అప్పారావు కన్నీటి పర్యంతమయ్యారు.
ఇళ్ల మంజూరుకు అర్హులే లేరా..?
కె.కోటపాడు మండలం సూర్రెడ్డిపాలెం గ్రామసభలో అధికారులను నిరసన సెగ తగిలింది. నాలుగున్నరేళ్లుగా గ్రామంలో ఒక్కరికి కూడా గృహనిర్మాణ పథకంలో ఇల్లు మంజూరు చేయకపోవడం ఏంటని జన్మభూమిలో పాల్గొన్న అధికారులను మాజీ జెడ్‌పీటీసీ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ నాయకుడు ఈర్లె గంగునాయుడు(నాని) ప్రశ్నించారు. గ్రామంలో తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో తక్కువ ఓట్లు వచ్చాయన్న కారణంగా పథకాల ఎంపికలో గ్రామంపై వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు.
అక్రమ చేపల చెరువులపై నిలదీత
దేవరాపల్లి మండలం కొత్తపెంట గ్రామసభలో నిరసనలు హోరెత్తాయి.అక్రమ చేపలు నిర్వహించడంతో పాటు చికెన్, పశుమాంస వ్యర్థాలను మేతగా వేస్తున్నారని, వీటి వల్ల కలుషితమైన నీటిని తాగిన పశువులు ఇప్పటికే మృత్యువాత పడ్డాయని, రోగాలతో బాధపడుతున్నాయని గ్రామస్తులు అధికారులకు వివరించారు. చుట్టుపక్కల ప్రజలు సైతం అంతు చిక్కని వ్యాధులు బారిన పడుతున్నారని, పలుమార్లు రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధిత రైతులు అధికారులకు ఎదుట గోడు వెల్లబోసుకున్నారు. వెంటనే ఈ సమస్యపై జన్మభూమి సదస్సులో తీర్మానం చేయాలని లేకుంటే ఇక్కడి నుంచి కదిలేది లేదని, సదస్సును సైతం జరగనివ్వబోమని స్పష్టం చేశారు.
అయితే శాఖల వారీగా సభ జరుగుతున్నందున సంబంధిత శాఖ వచ్చినప్పుడు సమస్య చెప్పుకోవాలని అధికారులు చెప్పినా వినకుండా ఆందోళన చేయడంతో అసహనానికి గురైన మండల ప్రత్యేక అధికారి జి. మహలక్ష్మీ బాధిత రైతులు అందించిన వినతి పత్రాన్ని వారిపైకే విసిరేయడంతో వివాదం రేగింది. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అరుపులు కేకలతో సభా ప్రాంగణం మార్మోగిపోయింది.
వికలాంగ పింఛన్ పునరుద్ధరించండి
చీడికాడ (మాడుగుల): వికలాంగుడిగా గుర్తిం చి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రభుత్వం పింఛన్ ఇవ్వగా, చంద్రబాబు గద్దెనెక్కిన వెంటనే తొలగించారని చీడికాడకు చెందిన గాలి శ్రీరామమూర్తి అనేదివ్యాంగుడు చెప్పాడు. నాలుగున్నరేళ్లుగా పింఛన్ పునరుద్ధరించాలని పలుమార్లు దరఖాస్తు చేశానని, పలువురు అధికారులను కోరారని అయినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాలలోకి వెళితే... శ్రీరామమూర్తి 15 సంత్సరాల క్రితం ప్రమాదవాశాత్తు చింత చెట్టుపై నుంచి పడిపోవడంతో వెన్నెముకపై,కుడికాలికి తీవ్రగామైంది. కేజీహెచ్ వైద్యులు వికలాంగ ధ్రువీకరణ పత్రం అందించారు.దీంతో 200 పింఛన్ మంజూరైంది.తరువాత వైఎస్ రాజశేఖరరెడ్డి రెండవసారి సీఎం అయిన తరువాత రూ.500 పింఛన్ అందింది. చంద్రబాబు గద్దెనెక్కిన తరువాత పింఛన్ రూ.1000కి పెంచిన సమయంలో పాత వికలాంగ ధ్రువీకరణ ప త్రాలు పనిచేయవని, సదరంలో తీసుకోవాలని చెప్పి, తన ఫించన్‌ను నిలుపుదల చేశారని శ్రీరామమూర్తి ఆవేదన వ్యక్తం చేశాడు. ఎన్ని సార్లు సదరం క్యాంపునకు వెళ్లినా ధ్రువీకరణపత్రం ఇవ్వలేదని, కలెక్టర్‌కు, నాలుగు విడతల జన్మభూమి సభల్లో అర్జీలిచ్చి వేడుకున్నా ప్రయోజనం లేకపోయిందని చెప్పాడు. సోమవారం చీడికాడలో జరిగే జన్మభూమిలో మరో మారు దరఖాస్తు ఇస్తానని, ఇప్పటికైనా అధికారులు కరుణించాలని కోరాడు.
Comments
Please login to add a commentAdd a comment