జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ అధికారులు
కొరాపుట్: కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితిలోని వివాదాస్పద కొఠియా పంచాయతీ గ్రామల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యక్రమం ‘జన్మభూమి’ పేరిట మళ్లీ ఆ రాష్ట్ర అధికారులు కొఠియాలో పర్యటనలు ప్రారంభించారు. వివా దాస్పద ఉపరసంచి, నేరేడివలస, గంజయిపొదర్ గ్రామాలలో ఆంధ్రప్రదేశ్ జన్మభూమి కార్యక్రమాలు శుక్రవారం నిర్వహించారు. ఆయా గ్రామాల ప్రజలను వ్యాన్లతో జన్మభూమి కార్యక్రమానికి సమీకరించారు. వారికి జన్మ భూమి కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, పింఛన్ల బట్వాడా వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఒడిశా ప్రభుత్వ నిర్లక్ష్యంతో వివాదాస్పద గ్రామ ప్రజలను ఆకర్షించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలుగా స్థానికులు చెబుతున్నారు. కొద్ది మాసాల క్రితం ఆంధ్రప్రదేశ్ అధికారులు కొఠియా ప్రజలకు రగ్గులు, సోలార్‌లైట్లు పంపిణీ చేయడంతో పాటు వైద్య శిబిరాలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. గ్రామ ప్రజల అసౌకర్యాలను అడిగి తెలుసుకోవడంతో పాటు పేదలకు ఉచిత సంక్షేమ పథకాలు సమకూర్చేందుకు హామీలు ఇచ్చారు.
మేలుకున్న కొరాపుట జిల్లా యంత్రాంగం
ఇటువంటి కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొఠియా పంచాయతీ గ్రామాల ప్రజలను మచ్చిక చేసుకుంటున్న కథనాలు తెలుసుకుని కొరాపుట్ జిల్లా యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు మేలుకుని, ఆయా గ్రామాల్లో ముమ్మరంగా పర్యటిస్తూ అక్కడ అభివృద్ధి పనులకు నడుం బిగించారు. రహదారుల పనులు వేగవంతం చేస్తున్నారు. సీమగుడ నుంచి నువగాం వరకు, మనరేగ, ఘాటర్‌గుడ,మడ్కర్ గ్రామం వరకు, ఫగుణసినారి–డలియంబ నుంచి కొఠియా వరకు రోడ్ల పనులు వేగవంతం చేశారు. రహదారులలో నిర్మించవలసిన 11 వంతెనల టెండర్ ప్రక్రియ పూర్తిచేశారు. పంచాయతీలోని మతలమ, గుమెల్‌పొదర్, తొలకండి, కొడియంబ, సులియమరి, సలీంపొదర్, కటర్‌గడ వంటి గ్రామాల్లో విద్యుదీకరణ పనులు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొఠియా పంచాయతీ సమగ్రాభివృద్ధికి రూ.150 కోట్ల ప్రత్యేక నిధులను ప్రకటించి ప్రజలకు అన్ని మౌలిక సౌకర్యాలు సమకూర్చేందుకు సన్నద్ధమవుతోంది. కొఠియా వివాదాస్పద గ్రామ ప్రజలు మాత్రం ప్రస్తుతానికి ఉభయ రాష్ట్రాలు అందజేసే సేవలు అందుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment