గజపతినగరం మండలం లోగిశలో వాగ్వాదం
జన్మభూమి కాస్తా రణభూమిగా మారుతోంది. ఎక్కడికక్కడే నిలదీతలు... నిరసనలతో సభలు కాస్తా రసాభాసగా తయారవుతున్నాయి. ప్రభుత్వ సొమ్ముతో సొంత పార్టీ ప్రచారంకోసం తలపెట్టినఈ కార్యక్రమానికి అదుగడుగునా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇన్నాళ్ల పాలనలో ఏ సమస్యా పరిష్కారం కాలేదంటూ అధికారులు, పాలకపక్ష నాయకులను నిలదీస్తున్నారు. కొన్ని చోట్ల ఏకంగా సభలను బహిష్కరిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు మాత్రం ఈ వేదికలను పార్టీ ప్రచారానికి చక్కగా వాడుకుంటున్నారు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి–మా ఊరు సభలు రసాభాసగా మారుతున్నాయి. టీడీపీ నేతలు మాత్రం ఈ వేదికలను తమ సొంత ప్రచారానికి వాడుకుంటున్నారు. ప్రభుత్వ ఖర్చుతో తమ పార్టీకి ప్రయోజనం చేకూరేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పాఠశాలల ప్రాంగణాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థుల చదువులకు ఆటంకం కలిగిస్తున్నారు.బొబ్బిలిలో మంత్రికి చేదు అనుభవంబొబ్బిలి మున్సిపాలిటీలోని 15వ వార్డులో నిర్వహించిన జన్మభూమి సభలో మంత్రి రంగారావుకు చేదు అనుభవం ఎదురైంది. ఇక్కడ రూ.15 లక్షలతో చేపల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించేందుకు మత్స్యశాఖ, పీఆర్ అధికారులు,స్థానిక ప్రజా ప్రతినిధులు ఏర్పాట్లు చేశారు.
ఈ భవనానికి జీఎస్టీ నిబంధనల వల్ల రూ.2.50 లక్షల నష్టం వచ్చిందని కాంట్రాక్టర్ సాయి అక్కడున్న గదులకు అంతకు ముందే తాళం వేసి వెళ్ళిపోయాడు. రిబ్బన్ కట్‌చేసి లోపలకి వెళ్లిన మంత్రి రంగారావు అక్కడున్న గదులకు తాళం చూసి అవాక్కయ్యారు. తాళం తీయమని అధికారులను కోరారు. దీనికి పీఆర్ డీఈఈ కె.శ్రీనివాసరావు సమాధానమిస్తూ కాంట్రాక్టర్ వద్ద తాళాలున్నాయని ఇక్కడే ఎక్కడో ఉంటాయని సమాధానమివ్వడంతో మంత్రి చిన్నబుచ్చుకున్నారు. చివరకు తాళం తీయకపోవడంతో ఆయన వెనుతిరిగి సభా వేదిక వద్దకు వెళ్ళిపోయారు. అలాగే అప్పయ్యపేటలో జరిగిన గ్రామసభలో పీస గౌరి అనే మహిళ తన బుద్ధిమాంద్యంగల కుమారుడు గణేష్‌ను చూపించి ఇతనికి పింఛన్ కోసం సంవత్సరాలుగా తిరుగుతున్నా అధికారులు, కౌన్సిలర్లు పట్టించుకోవడం లేదని అడగ్గా అయ్యో అంటూనే ఎలాంటి హామీ ఇవ్వకుండానే వెళ్ళిపోయారు. గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీరు సమస్యలు రాజ్యమేలుతున్నాయని, ఎవరూ పట్టించుకోవడం లేదని మంత్రిని అడుగుదామన్నా వెంటనే వెళ్ళిపోయారని అప్పయ్యపేట వాసులు నిరుత్సాహంతో వెనుతిరిగారు.
అధికారులపై కలెక్టర్ ఆగ్రహం: చీపురుపల్లి నియోజకవర్గంలో మెరకముడిదాం మండలంలోని యాడిక గ్రామంలో అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని ఆ గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు బొత్స మోహనరావు తదితరులు అధికారులను నిలదీశారు. దీనికి స్పందించిన ఆ గ్రామానికి చెందిన టీడీపీ మాజీ సర్పంచ్ సాంబ కలుగజేసుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. గుర్ల మండలంలో పున్నపురెడ్డిపేటలో వ్యవసాయానికి సంబంధించి జింకు, బోరాన్ ఎరువులు అందుతున్నాయా లేదా అని కలెక్టర్ ప్రశ్నించగా ఓ రైతు అందడం లేదని చెప్పడంతో వ్యవసాయ శాఖ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గరివిడి మండలంలోని బొండపల్లి గ్రామంలో ఇళ్లు బిల్లులు అందడం లేదని, పింఛన్లు మంజూరు కావడం లేదని పలువురు లబ్ధిదారులు అధికారులను నిలదీశారు.
ప్రతిపక్షాల ఆగ్రహం: పార్వతీపురం పట్టణం 19వ వార్డులో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త అలజంగి జోగారావు ఆధ్వర్యంలో నాయకులు పాలకులను నిలదీశారు. వైకేఎం కాలనీలో ప్రజా సమస్యలను గాలికొదిలేశారని మండిపడ్డారు. శ్మశాన వాటిక, రేషన్ డిపో కావాలని నాలుగేళ్లుగా ప్రజలు అడుగుతున్నా నేటి వరకు సమస్యను ఎందుకు పరిష్కరించలేదని అధికారులను ప్రశ్నించారు. కురుపాం మండలంలోని లడ్డంగి గ్రామంలో గిరిజనులు కనీస సౌకర్యాల కోసం, రహదారులు పక్కా ఇళ్లు మంజూరు కోసం, అలాగే 130 జీఓను రద్దు చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో అధికారులను అడ్డుకున్నారు. కొమరాడ మండలంలో దుగ్గి గ్రామంలో నిర్వాసిత సమస్యలు పరిష్కరించలేదని, ఇప్పుడు ఈ సభలెందుకంటూ గ్రామస్తులు అధికారులను అడ్డుకున్నారు.
ఎమ్మెల్యేను నిలదీసిన ప్రజలు
బొండపల్లి మండలం గొట్లాం, గజపతినగరం మండలంలోని తుమ్మికాపల్లి సభల్లో ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు పాల్గొన్నారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, గోశాలలు మంజూరు చేయడం లేదని ఎమ్మెల్యేను నిలదీశారు. దత్తిరాజేరు మండలం రాజుల రామచంద్రాపురం, ఎస్‌బూర్జివలసలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించకుండా ఊకదంపుడు ప్రసంగాలకా వచ్చారంటూ గ్రామస్తులు ఆగ్రహిం చారు. పాచలవలసలో జరిగిన సభలో పొదుపు మహిళలకు రూ.10వేలు డిపాజిట్ చేస్తే దానికి డబుల్‌గా పేపెంట్ చేస్తామని సొమ్ము కట్టించుకుని ఇప్పటికీ మహిళలకు అందించలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుమల గోవిందు అధికారులను నిలదీశారు. సాలూరు, జగన్నాథపురంలో జరిగిన కార్యక్రమంలో మహిళలకు పసుపు,కుంకుమ, ఉపాధి బిల్లులు ఇవ్వలేదని అధికారులను నిలదీస్తుంటే టీడీపీ నాయకులు దురుసుగా ప్రవర్తించారు. నెల్లిమర్ల నగరపంచాయతీ జరజాపు పేటలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక సీపీఎం నేతలు కిల్లంపల్లి రామారావు, కె.రాము తదితరులు పలు సమస్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులను నిలదీశారు. సమస్యలను పరిష్కరించలేని జన్మభూమి సభలెందుకు అని ప్రశ్నించారు.
శ్వేత పత్రం చదవటమే అభివృద్ధా
‘శ్వేతపత్రాలు, కరపత్రాలు చదవటం కాదండి... గ్రామాన్ని సందర్శించి అభివృద్ది చూపండి’ అంటూ వేపాడ మండలం ఆకుల సీతంపేట ఎంపీటీసీ అడపా ఈశ్వర్రావు, మాజీ ఉప సర్పంచ్ కేదారి వీరన్నదొర అధికారులను నిలదీశారు. 2014లో గ్రామంలో నాలుగు ఇళ్లు అగ్నిప్రమాదంలో కాలిపోతే ఇద్దరికే ఇళ్లు మంజూరుచేశారని, నేటికీ రామదాసు సుభద్రమ్మ, దబ్బి అప్పారావులకు ఇళ్లు మంజూరుచేయలేదని, కొన్ని నిర్మాణాలు జరిగిన ఇళ్లకు పేమెంట్లు ఇవ్వలేదంటూ అధికారులను నేరుగా తీసుకెళ్లి చూపించారు. దీంతో మాజీసర్పంచ్ అప్పలసూరికి వీరితో వాగ్వివాదానికి దిగారు. లక్కవరపుకోట మండలం గంగుబూడి గ్రామంలో గత జన్మభూమి కార్యక్రమంలో ఇచ్చిన వినతులకు కనీసం స్పందన లేనప్పుడు ఈ సభలు ఎందుకు అని గ్రామస్తులు అధికారులను కడిగిపారేశారు. సభను 12 గంటల వరకు జరగకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు గ్రామస్తులను సముదాయించడంతో సభ కాస్త ఆలస్యంగా ప్రారంభించి తూతూ మంత్రంగానే ముగించేసారు.
ప్రచార సభలుగా...
విజయనగరం మండలం పినవేమలిలో జన్మభూమి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమంగా సాగింది. పట్టణంలో మున్సిపల్ కమిషనర్ టి.వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించిన షెడ్యూల్‌ను కాదని ఉదయాన్నే నిర్వహించేశారు. మధ్యాహ్నం సభ జరుగుతుందని భావించిన వార్డు ప్రజలంతా అధికార పార్టీ నేతల తీరుతో కంగుతిన్నారు. లంకవీధిలో గల మున్సిపల్ ప్రాధమిక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీకి సంబంధించిన పాటలు వేస్తూ హడావుడి చేశారు. పాఠశాల జరుగుతున్న సమయంలో అదే ప్రాంగణంలో సభను ఏర్పాటు చేయటంతో పాటు ఇలా పాటలు వేయటంతో విద్యార్ధులు తరగతులు వదిలి ఆటపాటలకే పరిమితమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment