
రంగంపేట మండలం నల్లమిల్లిలో అధికారులను నిలదీస్తున్న గ్రామస్తులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఆరో విడత జన్మభూమి కార్యక్రమం తొలి రోజే రచ్చరచ్చయింది. అత్యధిక చోట్ల అధికారులకు, ప్రజాప్రతినిధులకు నిరసనలు ఎదురయ్యాయి. దాదాపు ప్రతిచోటా ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో, సంక్షేమ పథకాలు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అధి కారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని జన్మభూమి గ్రామ సభలను ప్రజలు పెద్ద ఎత్తున అడ్డుకున్నా రు. ఎక్కడికక్కడ తమ సమస్యలపై నిలదీశారు. పరిష్కారం కాని జన్మభూమి సభలెందుకని ఏకంగా జన్మభూమి కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోవడంతో పోలీసు బందోబస్తు మధ్య తొలి రోజు ‘మమ’ అనిపించేశారు. తొలి రోజే ఇలాఉందంటే మున్ముందు ఎలా ఉంటుందోనని అధికార వర్గాలు భయపడుతున్నాయి. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో మరింత బందోబస్తు మధ్య నిర్వహించకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయేమోనని అభిప్రాయపడుతున్నాయి. ఆ మేరకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో ఐదు విడతలుగా జరిగిన జన్మభూమిలో ఇచ్చిన అర్జీలకు అతీగతీ లేదు, వాటిని కనీసం పట్టించుకోలేదని, పరిష్కారం చేయకుండా ఇప్పుడు మళ్లీ అర్జీలు తీసుకోవడం ఎందుకని ప్రజలు ఎక్కడికక్కడ నిలదీశారు. పలుచోట్ల అధికారులు, అధికార పార్టీ నేతలతో ప్రజలు వాగ్వాదానికి దిగారు. రుణమాఫీ చేయలేదు... పింఛను ఇవ్వలేదు...రేషన్‌కార్డు మంజూరు చేయలేదు...కొత్త ఇళ్లు ఊసే లేదు...కొత్తగా పట్టాలు ఇవ్వలేదు...నాలుగున్నరేళ్ల కాలంలో ఏం చేశారని ప్రజలు పెద్ద ఎత్తున ప్రశ్నించారు. చేసిందేమీ లేకపోయినా జన్మభూమి కమిటీల పెత్తనం ఎక్కువైందని, దోపిడీకి దిగుతున్నాయని సభల్లో ఏకరవుతు పెడుతున్నారు. కొన్నిచోట్లయితే నిలదీయడమే కాకుండా సభలు జరక్కుంగా అడ్డుకున్నారు. మరికొన్ని చోట్ల ఫలితం లేని సభలెందుకని ఏకంగా బహిష్కరించారు. ముఖ్యంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోని పి.వెంకటాపురంలో గ్రామస్తులు గ్రామసభలో సమస్యలు పరిష్కరించలేదని ,ప్రధాన రహదారిలో మురికి కాలువల్లేవని, స్థానిక మాజీ సర్పంచుకు వరసకు సోదరైన మహిళ ప్రభుత్వ భూమిని ఆక్రమించిందని ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిని నిలదీశారు. ఇళ్లు, పింఛన్లు అర్హులైన వారికి ఇవ్వకుండా మాజీ ప్రజాప్రతినిధి బంధువులకే కట్టబెట్టారంటూ ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. సరైన సమాధానం చెప్పలేక అక్కడి నుంచి ఎమ్మెల్యే వెనుదిరిగారు. జిల్లాలో ఎక్కడెక్కడ ఎలా జరిగిందే....
♦ రౌతులపూడి మండలం దిగువ శివాడలో జన్మభూమి సభను బహిష్కరించారు. గ్రామంలో సుమారు 30 మంది అర్హులైన వృద్ధులకు పింఛన్లు ఇవ్వడంలేదని, ఎన్నిసార్లు అర్జీలిచ్చినా పట్టించుకోలేదని గ్రామస్తులంతా ఒక్కటై జన్మభూమి సభను బహిష్కరించారు. .
♦ కరప మండలం పెనుగుదురు జన్మభూమి గ్రామసభలో ఇళ్ళ స్థలాలు, పింఛన్లు ఇవ్వాలంటూ అధికారులను నిలదీశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తహసీల్దార్ సర్థిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. కాకినాడరూరల్ మండలం నేమం తాజా మాజీ సర్పంచ్ కాటూరి కొండబాబు గ్రామసభను బహిష్కరించారు. తనను ఆహ్వానించలేదనే కారణంతో తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.
♦ చింతూరు మండలం ముగునూరులో నిర్వహించిన జన్మభూమి సభలో అధికారుల అలసత్వంపై ఐటిడిఏ పీవో అభిషిక్త్‌కిషోర్ అధికారులపై మండిపడ్డారు. గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా వాటిని ఎన్నాళ్ళు సాగదీస్తారని ప్రశ్నించారు.?
♦ కొత్తపల్లి మండలం శ్రీరాంపురంలో ఎమ్మెల్యేపై తెలుగుదేశం ఎంపీపీ పిర్ల సత్యవతి తనకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని నిరసన తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment