BJP -TDP
-
కూటమిలో పెత్తందార్లకే చోటు
సాక్షి, ప్రతినిధి, విజయవాడ: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయానికి పాతరేసింది. విజయవాడ నగరంలో ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, సమీప పరిసరాల్లో మైలవరం, గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గ టికెట్ల కేటాయింపును పరిశీలిస్తే పొత్తులో భాగంగా టీడీపీ ఐదు నియోజక వర్గాల్లో, బీజేపీ ఒక చోట పోటీ చేస్తున్నాయి. ఈ స్థానాలన్నింటికీ అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో టీడీపీ అభ్యర్థులు ప్రకటించిన ఐదు స్థానాల్లో ఆ పార్టీ అధినేత సామాజిక వర్గానికి చెందినవారు నలుగురు, కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఒకరు ఉన్నారు. బీజేపీ ప్రకటించిన అభ్యర్థి కూడా టీడీపీ అధినేత సామాజిక వర్గానికి చెందిన వారే కావడం విశేషం. దీన్ని బట్టి చూస్తే కూటమి పూర్తిగా సామాజిక న్యాయాన్ని విస్మరించిందని తెలుస్తోది. బీసీ, మైనార్టీ , ఇతర వర్గాలను పక్కన పెట్టేసింది. కేవలం వీరిని పార్టీ జెండా మోసే కూలీలుగా చూస్తోందని చెప్పొచ్చు. ఎన్నికల సమయంలో పావులుగా వాడుకొని, ఓట్లు కొల్లగొట్టేందుకు మాయమాటలు చెప్పడం తప్ప, ఆ వర్గాలకు టికెట్ల కేటాయింపులో న్యాయం చేయలేదని విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు. కూటమిలో పెత్తందార్లకే చోటు కూటమి ప్రకటించిన అభ్యర్థుల్లో విజయవాడ తూర్పులో గద్దె రామ్మోహనరావు, పెనమలూరులో బోడె ప్రసాద్, గన్నవరంలో యార్లగడ్డ వెంకటరావు, మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్, విజయవాడ వెస్ట్‌లో సుజనా చౌదరి .. ఈ ఐదుగురు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. విజయవాడ సెంట్రల్లో బొండా ఉమా కాపు సామాజిక సామాజిక వర్గం. ఇలా ఆరు మంది ఓసీ సామాజిక వర్గం వారే కావడం విశేషం. బీసీ, మైనార్టీ, ఆర్యవైశ్య వర్గాలకు మొండి చెయ్యి చూపారు. అక్కడ టీడీపీ అధినేత సామాజిక వర్గానికి చెందిన వారికి పెద్దపీట వేశారు. ఈ ఆరు నియోజక వర్గాల్లో కమ్మ, కాపు సామాజిక వర్గాలే కాకుండా బీసీలు, మైనార్టీలు ఇతర వర్గాల వారు ఉన్నారు. ఈ టికెట్ల కేటాయింపులోనే టీడీపీ అసలు రంగు బయట పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. విజయవాడ పశ్చిమలో మైనార్టీలు ఎక్కువగా ఉంటారు. చంద్రబాబు మైనార్టీలకు సీటు కేటాయిస్తామని చెప్పి, పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించి , టీడీపీ తానుముక్క , తమ సామాజిక వర్గానికి చెందిన సుజనా చౌదరికే టికెట్ ఇచ్చేలా చక్రం తిప్పారు. ఈ ఆరు నియోజక వర్గాల్లో జనసేనకు ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. విజయవాడ పశ్చిమ సీటు తొలుత పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. ఇక్కడ పదేళ్లుగా బీసీ సామాజిక వర్గానికి చెందిన పోతిన మహేష్ పార్టీ జెండా మోయడంతో పాటు, జనసేన పార్టీ కార్యక్రమాలకు డబ్బులను ఖర్చు చేశారు. అయితే టికెట్ మీకే కేటాయిస్తున్నామని పవన్ మొదట పోతిన మహేష్‌కు చెప్పడంతో, ఆయన నియోజక వర్గంలో ఇంటింటి ప్రచారం చేశారు. తీరా డబ్బు మూటలు అందగానే పొత్తులో భాగంగా టికెట్‌ను బీజేపీకి కేటాయించారనే ఆరోపణలు ఉన్నాయి. పవన్.. పదేళ్లు ఓ బీసీ అభ్యర్థిని వాడుకొని టికెట్ ఇవ్వకుండా మోసం చేశారు. ఇక్కడ జనసేన బీసీ వర్గాలను, టీడీపీ మైనార్టీ వర్గాలను మోసం చేసింది. సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కిన కూటమి అభ్యర్థులకు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడానికి ఓటర్లు సిద్ధమవుతున్నారు. సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపిన వైఎస్సార్ సీపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక న్యాయం అంటే ఏంటో టికెట్ల కేటాయింపులో చూపారు. విజయవాడ తూర్పు నియోజక వర్గం దేవినేని అవినాష్ (కమ్మ), సెంట్రల్ వెలంపల్లి శ్రీనివాస్ (వైశ్య), వెస్ట్ షేక్ ఆసిఫ్ (మైనార్టీ), పెనమలూరు జోగి రమేష్ (గౌడ), మైలవరం సర్నాల తిరుపతి రావు (యాదవ), గన్నవరం వల్లభనేని వంశీ (కమ్మ) ఇలా అన్ని సామాజిక వర్గాల వారికి టికెట్లు కేటాయించారు. టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం స్పష్టంగా కనిపిస్తోంది. విజయవాడ నగరం, దానికి అనుబంధంగా ఉండే ఆరు నియోజక వర్గాలను తీసుకొని పరిశీలిస్తే వైఎస్సార్ సీపీ రెండు కమ్మ, రెండు బీసీ, ఓ మైనార్టీ, ఓ ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వారిని అభ్యర్థులుగా ప్రకటించారు. వైఎస్సార్ సీపీ సమతుల్యం పాటించి అన్ని వర్గాలకు టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యం కల్పించారనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇందులో మైలవరం నియోజక వర్గానికి ఓ సామాన్యుడిని, డబ్బున్న పెత్తందారుపై పోటీకి అభ్యర్థిగా నిలిపారు. విజయవాడ వెస్ట్ నియోజక వర్గంలో సైతం మైనార్టీ వర్గానికి చెందిన సామాన్య అభ్యర్థి వైపే వైఎస్సార్ సీపీ మొగ్గు చూపింది. -
కమలం కుదేలు
సాక్షి, అమరావతిబ్యూరో : ఆనాటి భారతంలో కర్ణుడి పరిస్థితి ఈనాటి జిల్లా రాజకీయంలో బీజేపీ పరిస్థితి ఒకేలా ఉన్నాయి. నాడు శల్యుని సారథ్యం కర్ణుడిని ఎలా దెబ్బతీసిందో... నేడు టీడీపీ సాగిస్తున్న కోవర్డు ఆపరేషన్ కూడా అలాగే బీజేపీని బలహీనపరుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉండీ... రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పటికీ నాలుగేళ్లుగా జిల్లాలో బీజేపీ బలోపేతం కాలేకపోతోంది. ఎవరైనా పార్టీని పటిష్టపరుద్దామంటే చాలు వెంటనే బహిష్కరణకు గురవ్వాల్సిందే. అలాంటి పరిస్థితిని సృష్టించడంలో మంత్రి కామినేని శ్రీనివాస్, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుల వరకూ అందరూ తలో చెయ్యి వేస్తున్నారు. టీడీపీ కోవర్టులదే పైచేయి.... సీఎం చంద్రబాబు బీజేపీ చేతితోనే ఆ పార్టీ కన్ను పొడిపిస్తున్నారు. టీడీపీ అనుకూల, వ్యతిరేకవర్గీయులుగా జిల్లాలో బీజేపీ చీలిపోయింది. అందులోనూ టీడీపీ అనుకూల వర్గీయుల మాటే వేదంగా సాగుతోంది. అందుకు ద్విముఖ వ్యూహంతో పావులు కదుపుతోంది. ఓ వైపు బీజేపీకి ప్రభుత్వ పదవుల్లో ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా చేసింది. మరోవైపు బీజేపీ బలోపేతం గురించి మాట్లాడే నేతలను పొగబెట్టి పార్టీ నుంచే సాగనంపే వరకు విడిచిపెట్టడంలేదు. అందుకు కొన్ని తార్కాణాలు ఇవిగో... రాష్ట్ర ప్రభుత్వం బీజేపీకి జిల్లాలో చెప్పుకోదగ్గ నామినేటెడ్ పదవులు ఇవ్వనే లేదు. విజయవాడ కనకదుర్గ దేవస్థానం పాలకమండలి చైర్మన్ పదవిని బీజేపీ నేత మాచినేని రంగ ప్రసాద్ ఆశించారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవస్థానం కావడంతో బీజేపీ కూడా పట్టుబట్టింది. అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న ఎం.వెంకయ్యయనాయుడుకు రంగ ప్రసాద్ సన్నిహితుడు కావడం గమనార్హం. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇస్తామనే చెప్పడంతో చైర్మన్ పదవి వస్తుందని ఆయన ఆశించారు. కానీ చంద్రబాబు టీడీపీ నేత యలమంచిలి గౌరంగబాబును దుర్గగుడి దేవస్థానం చైర్మన్‌గా నియమించడంతో బీజేపీ అవాక్కయ్యింది. విజయవాడలో బీజేపీని బలోపేతం చేద్దామని వాదించి, చర్యలు చేపట్టి నగర పార్టీ అధ్యక్షుడు ఉమమహేశ్వర రాజుకు పరాభవమే మిగిలింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు నుంచి సహకారం లభించకపోవడం గమనార్హం. దీంతో ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు హరిబాబుపై విమర్శలు గుప్పించారు. ఆ వెంటనే ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించారు. అప్పటి నుంచి ఇంతవరకు బీజేపీ నగర శాఖ అధ్యక్షుడినే నియమించకపోవడం విశేషం. తద్వారా నగరంలో బీజేపీ బలోపేతం కాకుండా టీడీపీ అడ్డుకుంది. మరోవైపు బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి పూర్తిగా టీడీపీ అనుకూలుగా ముద్రపడ్డారు. రాష్ట్రంలో ఏకైక ఎంపీపీ పదవి రెండున్నరేళ్లకు ఒప్పందం.... కైకలూరు ఎంపీపీగా బీజేపీ ఎంపీటీసీ సభ్యురాలు బండి సత్యవతి ఎంపికయ్యారు. రాష్ట్రంలోనే బీజేపీకి దక్కిన ఏకైక ఎంపీపీ పదవి అదే. ఆ పదవి కూడా పూర్తి కాలం ఐదేళ్లు ఉండాలని మంత్రి కామినేని కోరుకోకపోవడం విస్మయపరుస్తోంది. రెండున్నరేళ్ల తరువాత టీడీపీకి ఎంపీపీ పదవిని విడిచిపెట్టాలని ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ రాష్ట్రంలో బీజేపీ శ్రేణులు మాత్రం ఎంపీపీ పదవిని ఐదేళ్లపాటు పార్టీకే ఉండాలని గట్టిగా వాదించాయి. అందుకు మద్దతు తెలపాల్సిన మంత్రి కామినేని టీడీపీకి వత్తాసు పలికారు. ఎంపీపీ పదవి నుంచి వైదలగేందుకు తిరస్కరించిన సత్యవతిని పార్టీ నుంచే బహిష్కరించారు. నియోజకవర్గంలో మొదటి నుంచి బీజేపీలో ఉన్నవారిని మంత్రి కామినేని పక్కనపెట్టేశారు. టీడీపీ నుంచి వచ్చినవారికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దాదాపు 25 ఏళ్లుగా బీజేపీలో ఉన్న వెంపల్లి విష్ణు రావు, బండి శ్రీనివాస్, లావేటీ వీర శివాజీ తదితరులకు ప్రస్తుతం ఏమాత్రం గుర్తింపు లేదు. కానీ టీడీపీ వర్గీయులుగా ముద్రపడ్డ సామర్ల శివకృష్ణను ఏఎంసీ చైర్మన్‌గా నియమించడం గమనార్హం. మంత్రి కామినేని శల్య సారథ్యం భారతంలో శల్యుని మరిపించేలా మంత్రి కామినేని శ్రీనివాస్ జిల్లాలో బీజేపీ రథాన్ని నడుపుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి అయినప్పటికీ కామినేని శ్రీనివాస్ వ్యవహార శైలి టీడీపీ నేత మాదిరిగా ఉంటోందని ఆ పార్టీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. పార్టీ పటిష్టత, పార్టీ నేతలు, కార్యకర్తలకు పదవుల విషయంలో ఆయన సానుకూలంగా స్పందించడంలేదని పలు ఘటనలు ప్రస్తావిస్తున్నారు. స్వయంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కైకలూరు నియోజకవర్గ కేంద్రంలోని ఎంపీపీ పదవి ఉదాంతాన్నే ఉదహరిస్తున్నారు. -
మా పార్టీ జోలికొస్తే సహించం
ఒంగోలు: మిత్రపక్షంగా ఉంటారో...వెళతారో అనేది మీరే తేల్చుకోండి...అంతే తప్ప మిత్రపక్షం అంటూ మా పార్టీ నాయకులు, కార్యకర్తల జోలికొస్తే మాత్రం సహించేది లేదంటూ టీడీపీ నాయకులను ఉద్దేశించి బీజేపీ జిల్లా అధ్యక్షుడు పులివెంకట కృష్ణారెడ్డి హెచ్చరించారు. స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం సాయంత్రం నిర్వహించి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీని మిత్రపక్షంగా భావించి తాము మౌనంగా ఉంటున్నా టీడీపీ నాయకుల వ్యవహారశైలి ఆక్షేపణీయంగా ఉంటుందన్నారు. త్రిపురాంతకం ఎంపీపీ నీలం చెన్నమ్మ ఇటీవల టీడీపీ నుంచి బీజేపీలో చేరిందని, దీంతో ఆమెను సస్పెండ్ చేస్తూ సీఈవో నిర్ణయం వెలువరించారన్నారు. దీనిపై హైకోర్టులో సవాల్ చేసి తిరిగి ఆమె త్రిపురాంతకం ఎంపీపీగా కొనసాగుతున్నారన్నారు. తాజాగా జరుగుతున్న జన్మభూమి–మా వూరు కార్యక్రమంలో ఆమెను ఖాతరు చేయకుండా ఆమె మాట్లాడుతుంటే మైక్ సైతం లాక్కోవడం, ఎంపీడీఓవో మాణిక్యాలరావు అయితే ఏకంగా టీడీపీ నాయకుడిలా వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికే సామాజిక తనిఖీ బృందం రూ.14 కోట్ల అవినీతి జాతీయ ఉపాధిహామీ పథకంలో చోటు చేసుకుందని తేల్చిందన్నారు. అంతే కాకుండా మరుగుదొడ్లలో కూడా రూ.2 కోట్ల అవినీతి చోటుచేసుకోవడంతో దానిపై చెన్నమ్మ ప్రశ్నించారన్నారు. అక్కడి ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు చెప్పినట్లుగా నడుస్తూ ఎంపీపీ పట్ల నిర్లక్ష్యంగా ఎంపీడీవో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అవినీతి కూపంలో కూరుకుపోయిన ఎంపీడీవో మాణిక్యాలరావును తక్షణమే సస్పెండ్ చేయాలని, అక్కడ జరిగిన అవినీతి నిగ్గుతేల్చి బాధ్యులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో నాలుగు రోజుల్లో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామని, ఈ విషయమై ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధిష్టానంతోపాటు, జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. ఈ ధర్నాకు ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా హాజరవుతారని ఆశిస్తున్నామని, అదే విధంగా వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయాలని కోరుతూ త్వరలోనే కనిగిరి నుంచి వెలిగొండ ప్రాజెక్టు వరకు పాదయాత్ర కూడా చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ఎంపీపీ నీలం చెన్నమ్మ మాట్లాడుతూ అవినీతిపై గళం ఎత్తుతున్నందుకే తమను బీజేపీలో ఉన్నా హీనంగా చూస్తున్నారన్నారు. దళితుల అభ్యున్నతి కోసం రిజర్వుడు నియోజకవర్గాన్ని కేటాయిస్తే అక్కడ ఎమ్మెల్యే అయి పార్టీ మారిన డేవిడ్‌రాజు, దళిత ఎంపీపీ పట్ల వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. కోఆప్షన్ సభ్యుడు నీలం లాజర్ మాట్లాడుతూ బీజేపీ ఉనికినే లేకుండా చేస్తానని ఎమ్మెల్యే హెచ్చరిస్తున్నారని, పార్టీ నాయకులు, కార్యకర్తలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే తాము జిల్లా అధ్యక్షుడ్ని కలిసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఒంగోలు నియోజకవర్గ అధ్యక్షుడు బొద్దులూరి ఆంజనేయులు, ముదివర్తి బాబూరావు పాల్గొన్నారు. -
హాట్.. హాట్!
ఊపందుకున్న మండలి ప్రచారం - ఎన్నికలను ప్రతిష్టాత్మగా తీసుకున్న టీఆర్ఎస్ - వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్న బీజేపీ - సీనియర్ల సమన్వయంతో కాంగ్రెస్ దూకుడు - చాపకింద నీరులా విద్యార్థి సంఘం నేత సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలో మండలి ఎన్నికల ప్రచారపర్వం ఊపందుకుంది. నామినేషన్ల ఘట్టానికి తెరపడడంతో అభ్యర్థులు ‘పట్టభద్రుల’ను ఆకర్షించే పనిలో పడ్డారు. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఈ నెల 22న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో బరిలో దిగిన ఎమ్మెల్సీ అభ్యర్థులు దూకుడుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అధికారపార్టీ తరఫున రాష్ట్ర ఉద్యోగ సంఘం నేత దేవీప్రసాద్ పోటీ చేస్తుండడం, బీజేపీ -టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా రామచంద్రరావు, కాంగ్రెస్ నుంచి రవికుమార్‌గుప్తా, పాలమూరు- ఉస్మానియా వర్సిటీ విద్యార్థి సంఘాల అభ్యర్థిగా సుభాష్‌రెడ్డి ప్రచారపర్వంలో దూసుకుపోతున్నారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న టీఆర్ఎస్.. దేవీప్రసాద్ విజయానికి సర్వశక్తులొడ్డుతోంది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలకు గెలుపు బాధ్యతలను అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రచారశైలిని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్నారు. గత రెండు రోజులుగా నగర శివార్లలో ఉద్యోగులు ఎక్కువగా నివసించే ఎన్జీఓస్ కాలనీ, సఫిల్‌గూడ మినీ ట్యాంకుబండ్ మార్నింగ్‌వాక్ పేర ఉద్యోగులు, విద్యావంతులతో భేటీ అయిన దేవీప్రసాద్ తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. సాక్షాత్తు హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చూస్తే ఈ ఎన్నికలకు అధికారపార్టీ ఇస్తున్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయుల మద్దతు కూడగట్టేందుకు వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు. బుధవారం చేవెళ్ల మండల కేంద్రంలో పట్టభద్రులు, ఉద్యోగులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడమేకాకుండా.. దేవీప్రసాద్‌కు అనుకూలంగా ఓటేయాలని పిలుపునిచ్చారు. ముప్పేట దాడి..! స్థానికేతరుడనే ప్రచారాస్త్రంతో దేవీప్రసాద్‌ను ప్రత్యర్థులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మెదక్ జిల్లాకు చెందిన దేవీప్రసాద్‌ను ఇక్కడి నుంచి బరిలో నిలపడాన్ని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్, బీజేపీ.. దీన్నే ప్రధానాస్త్రంగా చేసుకొని ఓట్లను కొల్లగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. టికెట్ దక్కలేదని అసంతృప్తిలో ఉన్న ఉపాధ్యాయసంఘాల నేతలతో అంతర్గత చర్చలు జరుపుతున్న ఈ ఇరువురు అభ్యర్థులు.. ఉపాధ్యాయుల ఓట్లతో గట్టెక్కాలనే ఎత్తుగడ వేస్తున్నారు. మరోవైపు గతంలో కాషాయదళం తరఫున పోటీచేసి ఓడిపోయిన రామచంద్రరావు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. పక్కా ప్రణాళికతో ప్రచారాన్ని కొనసాగిస్తున్న రామచంద్రరావు.. దేవీప్రసాద్‌పై నిశిత విమర్శలు చేస్తున్నారు. బీజేపీ- టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగినందున రామచంద్రరావును గెలిపించేందుకు ఇరుపార్టీలు సమన్వయంతో పనిచే యాలని నిర్ణయించాయి. ఎమ్మెల్యేలను నియోజకవర్గాల వారీగా ఇన్చార్జిలుగా నియమించడం ద్వారా ఉద్యోగులు, విద్యావంతులు, మేధావుల మద్దతు పొందాలని వ్యూహరచన చేశాయి. తొలిసారి బరిలో.. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తొలిసారి రంగంలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి రవికుమార్‌గుప్తా.. పార్టీ సీనియర్లను ఐక్యం చేయడంలో సఫలీకృతమయ్యారు. ఎడముఖం.. పెడముఖంగా ఉన్న పార్టీ ముఖ్యనేతలను సమన్వయపరిచి ప్రచారానికి ఊపు తెచ్చారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రసాద్‌కుమార్, చంద్రశేఖర్, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇక విద్యార్థినేత సుభాష్‌రెడ్డి చాపకింద నీరులా మద్దతు కూడగడుతున్నారు. విద్యార్థి సంఘం నేతగా గుర్తింపుపొందిన సుభాష్.. విద్యార్థిలోకం అండతో ‘పెద్దలసభ’లోకి ప్రవేశించాలని ఉవ్విళ్లూరుతున్నారు. బలమైన సామాజికవర్గం నుంచి ఈయన ఒకరే పోటీలో ఉండడం కూడా ఆయనకు సానుకూలం కానుంది. వికారాబాద్ జేఏసీ నేత నర్సిములు కూడా బరిలో నిలవడంతో దేవీప్రసాద్ ఓట్లకు గండిపడే అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యమంలో కీ లకంగా వ్యవహరించిన ఆయనకు ఈ ప్రాంతంలోని ఉపాధ్యాయ, ఉపన్యాసకుల్లో గట్టి పట్టుంది.