సాక్షి, అమరావతిబ్యూరో : ఆనాటి భారతంలో కర్ణుడి పరిస్థితి ఈనాటి జిల్లా రాజకీయంలో బీజేపీ పరిస్థితి ఒకేలా ఉన్నాయి. నాడు శల్యుని సారథ్యం కర్ణుడిని ఎలా దెబ్బతీసిందో... నేడు టీడీపీ సాగిస్తున్న కోవర్డు ఆపరేషన్ కూడా అలాగే బీజేపీని బలహీనపరుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉండీ... రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పటికీ నాలుగేళ్లుగా జిల్లాలో బీజేపీ బలోపేతం కాలేకపోతోంది. ఎవరైనా పార్టీని పటిష్టపరుద్దామంటే చాలు వెంటనే బహిష్కరణకు గురవ్వాల్సిందే. అలాంటి పరిస్థితిని సృష్టించడంలో మంత్రి కామినేని శ్రీనివాస్, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుల వరకూ అందరూ తలో చెయ్యి వేస్తున్నారు.
టీడీపీ కోవర్టులదే పైచేయి....
సీఎం చంద్రబాబు బీజేపీ చేతితోనే ఆ పార్టీ కన్ను పొడిపిస్తున్నారు. టీడీపీ అనుకూల, వ్యతిరేకవర్గీయులుగా జిల్లాలో బీజేపీ చీలిపోయింది. అందులోనూ టీడీపీ అనుకూల వర్గీయుల మాటే వేదంగా సాగుతోంది. అందుకు ద్విముఖ వ్యూహంతో పావులు కదుపుతోంది. ఓ వైపు బీజేపీకి ప్రభుత్వ పదవుల్లో ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా చేసింది. మరోవైపు బీజేపీ బలోపేతం గురించి మాట్లాడే నేతలను పొగబెట్టి పార్టీ నుంచే సాగనంపే వరకు విడిచిపెట్టడంలేదు. అందుకు కొన్ని తార్కాణాలు ఇవిగో...
రాష్ట్ర ప్రభుత్వం బీజేపీకి జిల్లాలో చెప్పుకోదగ్గ నామినేటెడ్ పదవులు ఇవ్వనే లేదు. విజయవాడ కనకదుర్గ దేవస్థానం పాలకమండలి చైర్మన్ పదవిని బీజేపీ నేత మాచినేని రంగ ప్రసాద్ ఆశించారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవస్థానం కావడంతో బీజేపీ కూడా పట్టుబట్టింది. అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న ఎం.వెంకయ్యయనాయుడుకు రంగ ప్రసాద్ సన్నిహితుడు కావడం గమనార్హం. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇస్తామనే చెప్పడంతో చైర్మన్ పదవి వస్తుందని ఆయన ఆశించారు. కానీ చంద్రబాబు టీడీపీ నేత యలమంచిలి గౌరంగబాబును దుర్గగుడి దేవస్థానం చైర్మన్‌గా నియమించడంతో బీజేపీ అవాక్కయ్యింది.
విజయవాడలో బీజేపీని బలోపేతం చేద్దామని వాదించి, చర్యలు చేపట్టి నగర పార్టీ అధ్యక్షుడు ఉమమహేశ్వర రాజుకు పరాభవమే మిగిలింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు నుంచి సహకారం లభించకపోవడం గమనార్హం. దీంతో ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు హరిబాబుపై విమర్శలు గుప్పించారు. ఆ వెంటనే ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించారు.
అప్పటి నుంచి ఇంతవరకు బీజేపీ నగర శాఖ అధ్యక్షుడినే నియమించకపోవడం విశేషం. తద్వారా నగరంలో బీజేపీ బలోపేతం కాకుండా టీడీపీ అడ్డుకుంది. మరోవైపు బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి పూర్తిగా టీడీపీ అనుకూలుగా ముద్రపడ్డారు.
రాష్ట్రంలో ఏకైక ఎంపీపీ పదవి రెండున్నరేళ్లకు ఒప్పందం....
కైకలూరు ఎంపీపీగా బీజేపీ ఎంపీటీసీ సభ్యురాలు బండి సత్యవతి ఎంపికయ్యారు. రాష్ట్రంలోనే బీజేపీకి దక్కిన ఏకైక ఎంపీపీ పదవి అదే. ఆ పదవి కూడా పూర్తి కాలం ఐదేళ్లు ఉండాలని మంత్రి కామినేని కోరుకోకపోవడం విస్మయపరుస్తోంది. రెండున్నరేళ్ల తరువాత టీడీపీకి ఎంపీపీ పదవిని విడిచిపెట్టాలని ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ రాష్ట్రంలో బీజేపీ శ్రేణులు మాత్రం ఎంపీపీ పదవిని ఐదేళ్లపాటు పార్టీకే ఉండాలని గట్టిగా వాదించాయి. అందుకు మద్దతు తెలపాల్సిన మంత్రి కామినేని టీడీపీకి వత్తాసు పలికారు. ఎంపీపీ పదవి నుంచి వైదలగేందుకు తిరస్కరించిన సత్యవతిని పార్టీ నుంచే బహిష్కరించారు. నియోజకవర్గంలో మొదటి నుంచి బీజేపీలో ఉన్నవారిని మంత్రి కామినేని పక్కనపెట్టేశారు. టీడీపీ నుంచి వచ్చినవారికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దాదాపు 25 ఏళ్లుగా బీజేపీలో ఉన్న వెంపల్లి విష్ణు రావు, బండి శ్రీనివాస్, లావేటీ వీర శివాజీ తదితరులకు ప్రస్తుతం ఏమాత్రం గుర్తింపు లేదు. కానీ టీడీపీ వర్గీయులుగా ముద్రపడ్డ సామర్ల శివకృష్ణను ఏఎంసీ చైర్మన్‌గా నియమించడం గమనార్హం.
మంత్రి కామినేని శల్య సారథ్యం
భారతంలో శల్యుని మరిపించేలా మంత్రి కామినేని శ్రీనివాస్ జిల్లాలో బీజేపీ రథాన్ని నడుపుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి అయినప్పటికీ కామినేని శ్రీనివాస్ వ్యవహార శైలి టీడీపీ నేత మాదిరిగా ఉంటోందని ఆ పార్టీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. పార్టీ పటిష్టత, పార్టీ నేతలు, కార్యకర్తలకు పదవుల విషయంలో ఆయన సానుకూలంగా స్పందించడంలేదని పలు ఘటనలు ప్రస్తావిస్తున్నారు. స్వయంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కైకలూరు నియోజకవర్గ కేంద్రంలోని ఎంపీపీ పదవి ఉదాంతాన్నే ఉదహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment