సాక్షి, బుట్టాయగూడెం: బుట్టాయగూడెం ప్రభుత్వాసుపత్రి నూతన భవన ప్రారంభోత్సవానికి హాజరైన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌కు చేదు అనుభవం ఎదురైంది. భవనం ప్రారంభోత్సవం సందర్భంగా స్థల దాత కరాటం చంద్రయ్య, రంగనాయకమ్మల పేర్లు శిలాఫలకంపై పెట్టకపోవడాన్ని నిరసనగా సర్పంచ్ కంగాల పోసిరత్నం, ఆమె భర్త రాము ఆధ్వర్యంలో కొందరు యువకులు భవనం ప్రారంభోత్సవాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
దీంతో మంత్రి, యువకుల మధ్య తీవ్రమైన వాగ్వివాదం జరిగింది. స్థలదాత పేర్లు పెట్టాలని అప్పటివరకూ ప్రారంభోత్సవం జరగనివ్వమంటూ వారు పట్టుపట్టారు. అయితే కొన్ని నిబంధనలు ఉంటాయని, ఎవరికివారు పేర్లు రాసుకోకూడదని మంత్రి చెప్పారు. దీంతో యువకులు, మంత్రి మధ్య వాగ్వివాదం జరిగింది. తాను ఎంతో కష్టపడి వచ్చానని, తన పర్యటనకు విలువలేకుండా చేశారంటూ మంత్రి కామినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక కుక్క మనిషిని కరిసిందనే కథ చెప్పుకొచ్చారు.. ఒక సమయంలో యువకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ డీఎస్పీ ఎక్కడున్నాడంటూ మంత్రి ఊగిపోయారు. పరిస్థితి తీవ్రతరం దాల్చడంతో బీజేపీ నేత కరాటం రెడ్డినాయుడు యువకులకు సర్ధి చెప్పారు. ఆయన సమన్వయంతో గొడవ సర్ధుమణిగేలా చేయడంతో చివరకు మంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్, ఐటీడీఏ పీవో ఎమ్‌ఎన్ హారేంధిర ప్రసాద్, జిల్లా ఆస్పత్రి సేవల సమన్వయ అధికారి డాక్టర్ కె.శంకరరావు, జెడ్పీటీసీ కరాటం సీతాదేవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment