MPP post
-
కోరం లేకపోయినా.. ఎంపీపీ ఎన్నిక
సాక్షి, అమరావతి: రెండుసార్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించినా మండల ప్రజాపరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు వాయిదా పడిన మండలాల్లో ఈ నెల 8వ తేదీన నిర్ణీత కోరం లేకపోయినా ఆ ఎన్నికలను యథావిధిగా జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. గత నెల 24న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఎంపీపీ, ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ రోజు ఎక్కడైనా ఎన్నిక జరగకపోతే ఆ మరుసటి రోజు 25వ తేదీన ఎన్నిక నిర్వహించారు. అయినప్పటికీ రాష్ట్రంలో 21 మండలాల్లో 8 ఎంపీపీ పదవులకు, 20 మండలాల్లో ఉపాధ్యక్ష, 6 చోట్ల కో–అప్టెడ్ సభ్యుల ఎన్నిక వాయిదా పడింది. ఆయా మండలాల్లో ఎన్నిక వాయిదా పడ్ద పదవులకు తిరిగి ఈ నెల 8న ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి కోరం నిబంధనలపై జిల్లా అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. మొదట ఎంపీపీ.. ఆ తరువాతే ఉపాధ్యక్ష ఎన్నికలు ► ఎంపీపీ, ఉపాధ్యక్ష ఎన్నికలు ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన నేపథ్యంలో 8వ తేదీన నిర్ణీత కోరం లేకపోయినా నిబంధనల ప్రకారం ఎన్నికను యథావిధిగా జరుపుకోవచ్చు. అయితే ఎంపీపీ, ఉపాధ్యక్ష ఎన్నిక రెండూ నిర్వహించాల్సిన చోట మొదట ఎంపీపీ ఎన్నిక పూర్తయిన తర్వాత ఉపాధ్యక్ష ఎన్నిక నిర్వహించుకోవాలి. ► ఆరు మండలాల్లో కో–అప్టెడ్ సభ్యుల ఎన్నిక కూడా జరగాల్సి ఉంది. ఈ ఎన్నికకు మాత్రం తప్పనిసరిగా కోరం ఉండాలి. 8వ తేదీన నిర్ణీత కోరం లేక కో–అప్టెడ్ సభ్యుని ఎన్నిక నిర్వహించే పరిస్థితి లేకపోతే.. అదే మండలంలో ఎంపీపీ, ఉపాధ్యక్ష ఎన్నిక కూడా జరగాల్సి ఉంటే ఆ మండలాల్లో 9వ తేదీన కోరంతో సంబంధం లేకుండా ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక జరుపుకోవచ్చు. ► ఒకవేళ 8వ తేదీ కో–అప్టెడ్ సభ్యుని ఎన్నిక జరగాల్సిన మండలాల్లో ఆ పదవికి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోయినా, లేదంటే నామినేషన్లు దాఖలు చేసిన వారందరూ తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నా, ఆ కో–అప్టెడ్ సభ్యుని ఎన్నికను పక్కనపెట్టి ఎంపీపీ, ఉపాధ్యక్ష ఎన్నికను కోరంతో సంబంధం లేకుండా జరుపుకోవచ్చు. -
కమలం కుదేలు
సాక్షి, అమరావతిబ్యూరో : ఆనాటి భారతంలో కర్ణుడి పరిస్థితి ఈనాటి జిల్లా రాజకీయంలో బీజేపీ పరిస్థితి ఒకేలా ఉన్నాయి. నాడు శల్యుని సారథ్యం కర్ణుడిని ఎలా దెబ్బతీసిందో... నేడు టీడీపీ సాగిస్తున్న కోవర్డు ఆపరేషన్ కూడా అలాగే బీజేపీని బలహీనపరుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉండీ... రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పటికీ నాలుగేళ్లుగా జిల్లాలో బీజేపీ బలోపేతం కాలేకపోతోంది. ఎవరైనా పార్టీని పటిష్టపరుద్దామంటే చాలు వెంటనే బహిష్కరణకు గురవ్వాల్సిందే. అలాంటి పరిస్థితిని సృష్టించడంలో మంత్రి కామినేని శ్రీనివాస్, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుల వరకూ అందరూ తలో చెయ్యి వేస్తున్నారు. టీడీపీ కోవర్టులదే పైచేయి.... సీఎం చంద్రబాబు బీజేపీ చేతితోనే ఆ పార్టీ కన్ను పొడిపిస్తున్నారు. టీడీపీ అనుకూల, వ్యతిరేకవర్గీయులుగా జిల్లాలో బీజేపీ చీలిపోయింది. అందులోనూ టీడీపీ అనుకూల వర్గీయుల మాటే వేదంగా సాగుతోంది. అందుకు ద్విముఖ వ్యూహంతో పావులు కదుపుతోంది. ఓ వైపు బీజేపీకి ప్రభుత్వ పదవుల్లో ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా చేసింది. మరోవైపు బీజేపీ బలోపేతం గురించి మాట్లాడే నేతలను పొగబెట్టి పార్టీ నుంచే సాగనంపే వరకు విడిచిపెట్టడంలేదు. అందుకు కొన్ని తార్కాణాలు ఇవిగో... రాష్ట్ర ప్రభుత్వం బీజేపీకి జిల్లాలో చెప్పుకోదగ్గ నామినేటెడ్ పదవులు ఇవ్వనే లేదు. విజయవాడ కనకదుర్గ దేవస్థానం పాలకమండలి చైర్మన్ పదవిని బీజేపీ నేత మాచినేని రంగ ప్రసాద్ ఆశించారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవస్థానం కావడంతో బీజేపీ కూడా పట్టుబట్టింది. అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న ఎం.వెంకయ్యయనాయుడుకు రంగ ప్రసాద్ సన్నిహితుడు కావడం గమనార్హం. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇస్తామనే చెప్పడంతో చైర్మన్ పదవి వస్తుందని ఆయన ఆశించారు. కానీ చంద్రబాబు టీడీపీ నేత యలమంచిలి గౌరంగబాబును దుర్గగుడి దేవస్థానం చైర్మన్‌గా నియమించడంతో బీజేపీ అవాక్కయ్యింది. విజయవాడలో బీజేపీని బలోపేతం చేద్దామని వాదించి, చర్యలు చేపట్టి నగర పార్టీ అధ్యక్షుడు ఉమమహేశ్వర రాజుకు పరాభవమే మిగిలింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు నుంచి సహకారం లభించకపోవడం గమనార్హం. దీంతో ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు హరిబాబుపై విమర్శలు గుప్పించారు. ఆ వెంటనే ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించారు. అప్పటి నుంచి ఇంతవరకు బీజేపీ నగర శాఖ అధ్యక్షుడినే నియమించకపోవడం విశేషం. తద్వారా నగరంలో బీజేపీ బలోపేతం కాకుండా టీడీపీ అడ్డుకుంది. మరోవైపు బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి పూర్తిగా టీడీపీ అనుకూలుగా ముద్రపడ్డారు. రాష్ట్రంలో ఏకైక ఎంపీపీ పదవి రెండున్నరేళ్లకు ఒప్పందం.... కైకలూరు ఎంపీపీగా బీజేపీ ఎంపీటీసీ సభ్యురాలు బండి సత్యవతి ఎంపికయ్యారు. రాష్ట్రంలోనే బీజేపీకి దక్కిన ఏకైక ఎంపీపీ పదవి అదే. ఆ పదవి కూడా పూర్తి కాలం ఐదేళ్లు ఉండాలని మంత్రి కామినేని కోరుకోకపోవడం విస్మయపరుస్తోంది. రెండున్నరేళ్ల తరువాత టీడీపీకి ఎంపీపీ పదవిని విడిచిపెట్టాలని ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ రాష్ట్రంలో బీజేపీ శ్రేణులు మాత్రం ఎంపీపీ పదవిని ఐదేళ్లపాటు పార్టీకే ఉండాలని గట్టిగా వాదించాయి. అందుకు మద్దతు తెలపాల్సిన మంత్రి కామినేని టీడీపీకి వత్తాసు పలికారు. ఎంపీపీ పదవి నుంచి వైదలగేందుకు తిరస్కరించిన సత్యవతిని పార్టీ నుంచే బహిష్కరించారు. నియోజకవర్గంలో మొదటి నుంచి బీజేపీలో ఉన్నవారిని మంత్రి కామినేని పక్కనపెట్టేశారు. టీడీపీ నుంచి వచ్చినవారికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దాదాపు 25 ఏళ్లుగా బీజేపీలో ఉన్న వెంపల్లి విష్ణు రావు, బండి శ్రీనివాస్, లావేటీ వీర శివాజీ తదితరులకు ప్రస్తుతం ఏమాత్రం గుర్తింపు లేదు. కానీ టీడీపీ వర్గీయులుగా ముద్రపడ్డ సామర్ల శివకృష్ణను ఏఎంసీ చైర్మన్‌గా నియమించడం గమనార్హం. మంత్రి కామినేని శల్య సారథ్యం భారతంలో శల్యుని మరిపించేలా మంత్రి కామినేని శ్రీనివాస్ జిల్లాలో బీజేపీ రథాన్ని నడుపుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి అయినప్పటికీ కామినేని శ్రీనివాస్ వ్యవహార శైలి టీడీపీ నేత మాదిరిగా ఉంటోందని ఆ పార్టీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. పార్టీ పటిష్టత, పార్టీ నేతలు, కార్యకర్తలకు పదవుల విషయంలో ఆయన సానుకూలంగా స్పందించడంలేదని పలు ఘటనలు ప్రస్తావిస్తున్నారు. స్వయంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కైకలూరు నియోజకవర్గ కేంద్రంలోని ఎంపీపీ పదవి ఉదాంతాన్నే ఉదహరిస్తున్నారు. -
టీడీపీలో గ్రూపుల గోల
♦ టీడీపీలో విస్తరిస్తున్న అంతర్గత విభేదాలు ♦ అన్ని నియోజకవర్గాల్లోనూ అంతర్యుద్ధాలే... ♦ ఎవరికి వారే యమునాతీరేలా సాగుతున్న కార్యక్రమాలు ♦ మంత్రుల మధ్య కనిపించని సయోధ్య ♦ ఎమ్మెల్యేలపై స్థానిక ప్రజాప్రతినిధుల అసంతృప్తి ♦ నియోజకవర్గాల్లో ఎటూ తేలని పంచాయతీలు ♦ రాష్ట్ర అధిష్టానం వద్దే తేల్చుకోవాలనుకుంటున్న నేతలు సాక్షి ప్రతినిధి, విజయనగరం: క్రమశిక్షణకు మారుపేరంటూ ప్రచారం చేసుకుంటున్న తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు పెచ్చుమీరుతోంది. ఎక్కడికక్కడే నాయకుల మధ్య వివాదాలు రచ్చకెక్కుతున్నాయి. అన్ని నియోజకవర్గాల్లోనూ విభేదాలు బట్టబయలవుతున్నాయి. సర్పంచ్ల నుంచి మంత్రుల వరకూ ఒకరంటే ఒకరికి పడటం లేదు. చివరికి జిల్లాలో ఈ వివాదాలు పరిష్కారం కాక ఇక రాష్ట్ర అధిష్టానం వద్దే తేల్చుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారాలు పాపం పార్టీనే నమ్ముకున్న కేడర్‌లో సందిగ్ధం నెలకొంటోంది. జామిలో జెంటిల్మన్ ఒప్పందం ఉల్లంఘన ఎస్.కోట నియోజకవర్గం జామి ఎంపీపీ పదవిని రెండున్నరేళ్లు చొప్పున పరసాన అప్పయమ్మ, ఇప్పాక చంద్రకళ పంచుకోవడానికి టీడీపీ పెద్దలు అప్పట్లో జెంటిల్మన్ ఒప్పందం కుదిర్చారు. ఇప్పుడు ఆ పదవిని వదిలిపెట్టడానికి అప్పయమ్మ ఇష్టపడటం లేదు. ఇక చేసేది లేక చంద్రకళ మంత్రి సుజయ కృష్ణరంగారావును కలి సి న్యాయం చేయాలని కోరేందుకు యత్నిస్తున్నా ఆయన ముఖం చాటేశారు. ఒప్పందం ప్రకారం అప్పయమ్మ చేత రాజీనామా చేయించకపోతే ధర్నాకైనా వెనుకాడబోమని వారు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ మంత్రి కూడా ఈ సమస్యను పరిష్కరించలేరన్న వాదన వినిపిస్తోంది. తెలుగు యువత అధ్యక్ష పదవిపై వివాదం జిల్లా తెలుగు యువత అధ్యక్ష పదవి మాజీ మంత్రి మృణాళిని తన కుమారుడు నాగార్జునకు ఇప్పించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీనికి ప్రస్తుత అధ్యక్షుడు కర్రోతు నర్శింగరావు అడ్డుపడుతున్నారు. తనకు వేరే పదవి చూపించకుండా తన పదవిని ఎలా తీసుకుంటారంటూ మొండికేస్తున్నారు. మృణాళినికి మద్దతుగా ఎమ్మెల్యేలు కె.ఎ. నాయుడు, కోళ్ల లలితకుమారి, కర్రోతుకు మద్దతుగా ఎమ్మెల్యేలు నారాయణస్వామి నాయుడు, చిరంజీవి నిలవడంతో ఎమ్మెల్యేల మధ్య చీలికలు ఏర్పడ్డాయి. ఇంకా కొలిక్కి రాని ఈ వివాదం చివరికి ఏ పరిణామాలకు దారితీస్తుందో తెలియడం లేదు. మీసాలపై కెంగువ గరం గరం... విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీతకు స్థానిక ఎంపీపీతో పొసగడం లేదు. ఇటీవల జరిగిన మండల సర్వసభ్య సమావేశం సాక్షిగా వీరి మధ్య విభేదాలు వీధిన పడ్డాయి. మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఉన్న తనకు తన మండలంలో జరిగే కార్యక్రమాల గురించి సమాచారం ఇవ్వకపోవడమేమిటని ఎంపీపీ కెంగువ ధనలక్ష్మి బహిరంగంగానే ఎమ్మెల్యే గీతను నిలదీశారు. దీనిపై కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు నివాసంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో శనివారం పంచాయితీ పెట్టారు. తమకెందుకు సమాచారం ఉండటం లేదని ఎమ్మెల్యే గీతను వైస్ ఏంపీపీ వి.శ్రీనివాసరావు, ఎంపీపీ ధనలక్ష్మి కుమారుడు శ్రీనివాసరావు ప్రశ్నించడంతో మీకు చెప్పాల్సిన అవసరం లేదని ఆమె సమాధానమిచ్చారు. అంతటితో ఆగకుండా సమావేశం నుంచి అర్ధంతరంగా ఆమె వెళ్లిపోయారు. దీంతో పార్టీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు కలిసి తమకు తెలియజెప్పకుండా ఎమ్మెల్యే ఎలాంటి కార్యక్రమాన్ని చేయకూడదనే తీర్మానాన్ని రాష్ట్ర పార్టీ అధిష్టానానికి పంపించాలని నిర్ణయించారు. మృణాళినిపై తిరుగుబాటు బావుటా... ఎమ్మెల్యే కిమిడి మృణాళికి, జడ్పీటీసీ మీసాల మరహాలనాయుడు, మండల టీడీపీ అధ్యక్షుడు రౌతు కామునాయుడికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తమను కనీసం పట్టించుకోవడం లేదంటూ వారు ఎప్పటి నుంచో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా 500 ఇళ్లు మంజూరైతే మృణాళిని అన్ని ఊళ్లకు పంచడం వారికి నచ్చలేదు. కనీసం తమ సూచనలు కూడా తీసుకోకపోవడమేమిటంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో మంత్రి సుజయ తమ్ముడు బేబీ నాయన నియోజకవర్గానికి రావడంతో ఆయన ఎదుట తమ గోడు వినిపించారు. మంత్రిని కలిసే ఏర్పాటు చేస్తే అన్ని విషయాలు వివరిస్తామని చెప్పారు. దీంతో ఆయన అక్కడి నుంచే మంత్రితో మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఈ విషయం తెలిసి మాట్లాడదాం రమ్మని ఎమ్మెల్యే పిలిచినా వారు వెళ్లలేదు. బొబ్బిలిలో ఇంటిపోరు బొబ్బిలి పట్టణ అధ్యక్ష పదవిని బొబ్బాది తవిటి నాయుడుకు ఇవ్వాలని మంత్రి సుజయ్ భావించారు. కానీ దానికి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చోడిగంజి రమేష్‌నాయుడు, ఆ పదవి ఆశిస్తున్న రాంభట్ల శరత్ అడ్డుతగులుతున్నారు. దీంతో ఎటూ తేల్చ లేక ఈ అంశాన్ని పక్కనపెట్టేశారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామినాయుడుకు పూసపాటిరేగ జెడ్పీటీసీ సభ్యుడు ఆకిరి ప్రసాద్‌కు మధ్య ఇసుక అక్రమ రవాణా, పరిశ్రమలకు నీటి సరఫరా విషయాల్లో వివాదాలు ఏర్పడ్డాయి. వీటిపై రోడ్డెక్కి మరీ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. తాజాగా ఆకిరి ప్రసాద్‌కు జిల్లా పార్టీ కొత్త అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు మద్దతుగా నిలవడంతో వివాదం తీవ్రత పెరిగింది. గంటాతో కొత్త తంటా... జిల్లా ఇన్చార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి విషయంలో తలదూర్చడమే కాకుండా తన పంతం నెగ్గించుకున్నారు. గత అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ను కొనసాగించాలన్న కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు యత్నాలను కొల్లగొట్టారు. ఈ పరిణామంతో జిల్లాలో టీడీపీ నేతల ప్రాభవంపై నీలినీడలు కమ్ముకున్నాయి. పక్క జిల్లా మంత్రి పెత్తనం చెలాయించే పరిస్థితి రావడానికి ఇక్కడి నాయకుల సమర్ధతపై అధిష్టానానికి నమ్మకం సడలడమే కారణమని కేడర్ భావిస్తోంది. మంత్రి గంటా, కేంద్ర మంత్రి అశోక్ మధ్య జిల్లా కమిటీల నియామకాల విషయంలో తలెత్తిన వివాదం వారి మధ్య అఖాతాన్ని పెంచుతోంది. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాల్లోనూ వీరిద్దరూ కలిసి పాల్గొనడం లేదు. అశోక్ పాల్గొనని కార్యక్రమాల్లో గంటా ఉంటున్నారు. గంటా లేనప్పుడు మాత్రమే అశోక్ హాజరవుతున్నారు. ఇటీవల జరిగిన జిల్లా టీడీపీ కార్యవర్గ సమావేశానికి గంటా శ్రీనివాసరావు రాలేదు. గజపతినగరంలో జరిగిన కార్యక్రమంలో అశోక్ లేరు. ఒకపైపు అవినీతి, అక్రమాల ఆరోపణలతో మసకబారుతున్న టీడీపీ ప్రజాప్రతినిధుల మధ్య తాజా వివాదాలు పార్టీని ఛిన్నాభిన్నం చేసే దిశగా పయనింపజేస్తున్నాయి.