ఊపందుకున్న మండలి ప్రచారం
- ఎన్నికలను ప్రతిష్టాత్మగా తీసుకున్న టీఆర్‌ఎస్
- వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్న బీజేపీ
- సీనియర్ల సమన్వయంతో కాంగ్రెస్ దూకుడు
- చాపకింద నీరులా విద్యార్థి సంఘం నేత
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలో మండలి ఎన్నికల ప్రచారపర్వం ఊపందుకుంది. నామినేషన్ల ఘట్టానికి తెరపడడంతో అభ్యర్థులు ‘పట్టభద్రుల’ను ఆకర్షించే పనిలో పడ్డారు. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఈ నెల 22న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో బరిలో దిగిన ఎమ్మెల్సీ అభ్యర్థులు దూకుడుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అధికారపార్టీ తరఫున రాష్ట్ర ఉద్యోగ సంఘం నేత దేవీప్రసాద్ పోటీ చేస్తుండడం, బీజేపీ -టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా రామచంద్రరావు, కాంగ్రెస్ నుంచి రవికుమార్‌గుప్తా, పాలమూరు- ఉస్మానియా వర్సిటీ విద్యార్థి సంఘాల అభ్యర్థిగా సుభాష్‌రెడ్డి ప్రచారపర్వంలో దూసుకుపోతున్నారు.
ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న టీఆర్‌ఎస్.. దేవీప్రసాద్ విజయానికి సర్వశక్తులొడ్డుతోంది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలకు గెలుపు బాధ్యతలను అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రచారశైలిని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్నారు. గత రెండు రోజులుగా నగర శివార్లలో ఉద్యోగులు ఎక్కువగా నివసించే ఎన్జీఓస్ కాలనీ, సఫిల్‌గూడ మినీ ట్యాంకుబండ్ మార్నింగ్‌వాక్ పేర ఉద్యోగులు, విద్యావంతులతో భేటీ అయిన దేవీప్రసాద్ తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు.
సాక్షాత్తు హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చూస్తే ఈ ఎన్నికలకు అధికారపార్టీ ఇస్తున్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయుల మద్దతు కూడగట్టేందుకు వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు. బుధవారం చేవెళ్ల మండల కేంద్రంలో పట్టభద్రులు, ఉద్యోగులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడమేకాకుండా.. దేవీప్రసాద్‌కు అనుకూలంగా ఓటేయాలని పిలుపునిచ్చారు.
ముప్పేట దాడి..!
స్థానికేతరుడనే ప్రచారాస్త్రంతో దేవీప్రసాద్‌ను ప్రత్యర్థులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మెదక్ జిల్లాకు చెందిన దేవీప్రసాద్‌ను ఇక్కడి నుంచి బరిలో నిలపడాన్ని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్, బీజేపీ.. దీన్నే ప్రధానాస్త్రంగా చేసుకొని ఓట్లను కొల్లగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. టికెట్ దక్కలేదని అసంతృప్తిలో ఉన్న ఉపాధ్యాయసంఘాల నేతలతో అంతర్గత చర్చలు జరుపుతున్న ఈ ఇరువురు అభ్యర్థులు.. ఉపాధ్యాయుల ఓట్లతో గట్టెక్కాలనే ఎత్తుగడ వేస్తున్నారు.
మరోవైపు గతంలో కాషాయదళం తరఫున పోటీచేసి ఓడిపోయిన రామచంద్రరావు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. పక్కా ప్రణాళికతో ప్రచారాన్ని కొనసాగిస్తున్న రామచంద్రరావు.. దేవీప్రసాద్‌పై నిశిత విమర్శలు చేస్తున్నారు. బీజేపీ- టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగినందున రామచంద్రరావును గెలిపించేందుకు ఇరుపార్టీలు సమన్వయంతో పనిచే యాలని నిర్ణయించాయి. ఎమ్మెల్యేలను నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జిలుగా నియమించడం ద్వారా ఉద్యోగులు, విద్యావంతులు, మేధావుల మద్దతు పొందాలని వ్యూహరచన చేశాయి.
తొలిసారి బరిలో..
పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తొలిసారి రంగంలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి రవికుమార్‌గుప్తా.. పార్టీ సీనియర్లను ఐక్యం చేయడంలో సఫలీకృతమయ్యారు. ఎడముఖం.. పెడముఖంగా ఉన్న పార్టీ ముఖ్యనేతలను సమన్వయపరిచి ప్రచారానికి ఊపు తెచ్చారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రసాద్‌కుమార్, చంద్రశేఖర్, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇక విద్యార్థినేత సుభాష్‌రెడ్డి చాపకింద నీరులా మద్దతు కూడగడుతున్నారు.
విద్యార్థి సంఘం నేతగా గుర్తింపుపొందిన సుభాష్.. విద్యార్థిలోకం అండతో ‘పెద్దలసభ’లోకి ప్రవేశించాలని ఉవ్విళ్లూరుతున్నారు. బలమైన సామాజికవర్గం నుంచి ఈయన ఒకరే పోటీలో ఉండడం కూడా ఆయనకు సానుకూలం కానుంది. వికారాబాద్ జేఏసీ నేత నర్సిములు కూడా బరిలో నిలవడంతో దేవీప్రసాద్ ఓట్లకు గండిపడే అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యమంలో కీ లకంగా వ్యవహరించిన ఆయనకు ఈ ప్రాంతంలోని ఉపాధ్యాయ, ఉపన్యాసకుల్లో గట్టి పట్టుంది.
హాట్.. హాట్!
Published Wed, Mar 4 2015 11:58 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement