Council election
-
నిర్మాతల మండలి ఎన్నికలు వద్దు
‘‘నిర్మాతల మండలి ఎన్నికల కోసం డబ్బు ఖర్చు చేసే బదులు అందరూ ఒక్కటిగా ప్యానల్‌ని ఎన్నుకుంటే బాగుంటుంది. ఈ విషయంపై తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ రామ్మోహనరావు, నిర్మాత సురేశ్‌బాబుతో కూడా మాట్లాడాను. చాలా మంది నిర్మాతల అభిప్రాయం కూడా ఇదే’’ అని తెలంగాణ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. తెలుగు ఫిలిం చాంబర్ నిర్మాతల మండలి ఎన్నికలు ఈ నెల 30న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతాని రామకృష్ణ గౌడ్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఎన్నికల విషయంలో ఇటీవలే నిర్మాతల మండలి సమావేశం జరిపి రెండు ప్యానల్స్‌ని ఎంపిక చేసింది.ఆ తర్వాత కొన్ని నాటకీయ పరిణామాల మధ్య రెండు ప్యానల్స్ ఒక్కటయ్యాయి. అందులో కొందరిని పక్కన పెట్టారు. నిర్మాతల మండలి బాగా ఉంటున్న క్రమంలో కొందరు కావాలని సమస్యలు సృష్టిస్తున్నారు. ఇప్పటికే కొందరు ఎల్.ఎల్. పి అంటూ చానల్స్ విషయంలో సపరేట్గా ఉండటంతో కౌన్సిల్‌కు వచ్చే ఆదాయం తగ్గింది. ఆ సమస్యను పరిష్కరిస్తామని నిర్మాత సి. కళ్యాణ్‌గారు చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నేడు ఉపసంహరణ చేసుకుంటే బాగుంటుంది. ఎన్నికల ముందే అందరు పెద్ద వాళ్లతో కూర్చుని నిర్మాతల మండలి ప్యానల్‌ని ఎంపిక చేస్తే బాగుంటుంది. నేడు నేను ఉపసంహరణ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా ముందుకు రావాలి’’ అన్నారు. ఈ సమావేశంలో నిర్మాతలు శంకర్ గౌడ్, జేవీఆర్, సాయి వెంకట్‌లతో పాటు మరికొందరు నిర్మాతలు పాల్గొన్నారు. -
మండలి ఎన్నికల వ్యయపరిమితి 14 లక్షలు?
న్యూఢిల్లీ: ఆయా రాష్ట్రాల్లోని శాసన మండలి ఎన్నికల్లో నల్లధనాన్ని అరికట్టేం దుకు కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటోంది. మండలి అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై పరిమితి విధించేందుకు పలు ప్రతిపాదనలను తయారు చేస్తోంది. మండలి అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై ఇప్పటి వరకు ఎలాంటి నియంత్రణ లేదు. వ్యయంపై పరిమితి విధించేందుకు అవసరమైన చట్టం చేసే ముందు ఆయా పార్టీలు, శాసనమండళ్లను కలిగి ఉన్న జమ్మూ,కశ్మీర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బిహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల అభిప్రాయా లను తెలుసుకోవాలని కేంద్ర న్యాయశాఖ సూచించింది. అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడే అభ్యర్థి చేసే వ్యయం రూ.28 లక్షలు ఉంది. దీనిలో సగం రూ.14 లక్షలను మండలి అభ్యర్థి వ్యయం చేసే వెసులుబాటు కల్పిస్తూ చట్టం చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. శాసన సభ్యులు, ఉపాధ్యా యులు, స్థానిక సంస్థలు, పట్టభద్రులు వేర్వేరుగా మండలి సభ్యులను ఎన్నుకుంటారు. కొంతమంది మండలి సభ్యులను గవర్నర్ నామినేట్ చేస్తుంటారు. -
తెలంగాణ శాసనమండలికి...తప్పని ఎన్నిక
హైదరాబాద్ : తెలంగాణ శాసనమండలికి ఎన్నికలు తప్పడం లేదు. ఎమ్మెల్యే కోటాలోని ఆరు స్థానాలు ఎన్నిక ద్వారా భర్తీ కానున్నాయి. ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు గాను బరిలో ఏడుగురు అభ్యర్ధులు ఉండడంతో ఎన్నిక అనివార్యమని తేలిపోయింది. సోమవారం నామినేషన్ల ఉప సంహరణల గడువు ముగిసింది. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్ధులు ఎవరూ విత్‌డ్రా చేసుకోలేదు. గడువు ముగిశాక మండలి ఎన్నికల అధికారి, శాసన సభా కార్యదర్శి రాజ సదరాం అభ్యర్ధుల వివరాలను అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి ఆకుల లలిత, టీఆర్ఎస్ నుంచి తుమ్మల నాగేశ్వర్రావు, కడియం శ్రీహరి, నేతి విద్యాసాగర్, కె.యాదవరెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, టీడీపీ నుంచి వేం నరేందర్‌రెడ్డి పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యేల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే టీఆర్ఎస్ నాలుగు, కాంగ్రెస్ ఒకటి, ఇతర పార్టీల మద్దతుతో టీడీపీ ఒక స్థానం గెలుచుకోగలుగుతాయి. ఒక వేళ ఆరుగురు అభ్యర్ధులే పోటీ పడి ఉంటే, మండలి ఎన్నిక ఏకగ్రీవం అయ్యేది. కానీ, టీఆర్ఎస్ అయిదో స్థానంపై కన్నేసి అభ్యర్ధిని పోటీకి దింపడంతో ఆరు స్థానాలకు ఏడుగురు అభ్యర్ధులు పోటీ పడుతున్నట్లయ్యింది. అయిదో స్థానం కోసం... టీఆర్ ఎస్ వ్యూహం ఒక్కో ఎమ్మెల్సీ పదవిని గెలుచుకోవడానికి ఒక అభ్యర్ధికి 18 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం పడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుచుకున్న స్థానాలకు తోడు, ఆంగ్లో ఇండియన్ (నామినేటెడ్) సభ్యుడు, వివిధ పార్టీల నుంచి గులాబీ తీర్థం పుచ్చుకున్న వారిని కలిపితే 76 అవుతున్నాయి. అనధికార మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న ఎంఐఎంకు చెందిన మరో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇవన్నీ కలిపితే టీఆర్ఎస్ చేతిలో ఉన్న ఓట్ల సంఖ్య 83 అవుతోంది. నలుగురు ఎమ్మెల్యేలను గెలుచుకోవడానికి 72 ఓట్లు పోగా, ఆ పార్టీకి ఇంకా 11 ఓట్లున్నాయి. అయిదో ఎమ్మెల్సీ పదవినీ దక్కించుకోవాలంటే టీఆర్ఎస్కు మరో ఏడు ఓట్లు అవసరం అవుతున్నాయి. దీంతో తొలి ప్రాధాన్య ఓటుతో కాకుండా, ద్వితీయ ప్రాధాన్య ఓటుతో బయట పడాలని టీఆర్ఎస్ లెక్కలు వేస్తోంది. బీజేపీ మద్దతు ఇస్తున్న టీడీపీకి 16 ఎమ్మెల్యే ఓట్లు ఉన్నాయి. ఆ పార్టీ అభ్యర్ధి గెలవాలంటే మరో రెండు ఓట్లు అవసరం. టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు తమ అభ్యర్ధికి ఓట్లేస్తారన్నది గులాబీ నేతల ధీమా. ఆత్మప్రభోదం మేరకు ఓట్లేయాలని ఇప్పటికే ప్రకటనలు మొదలు పెట్టింది. బేర సారాలు షురూ ! ఎంతగా అంకెల గారడిని నమ్ముకున్నా, ఇతర పార్టీలకు చెందిన కొందరు ఎమ్మెల్యేల ఓట్లను సంపాదించడం టీఆర్ఎస్కు తప్పని పరిస్థితి. ఈ కారణంగానే టీడీపీకి చెందిన కొందరికి ఆశ చూపెడుతున్నట్లు సమాచారం. టీడీపీ ఎమ్మెల్యేలు మాధవరపు కృష్ణారావు, ప్రకాశ్ గౌడ్లు టీఆర్ఎస్లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. కాబట్టి వీరి రెండు ఓట్లు టీఆర్ఎస్కే పడతాయన్న అంచనాలు మొదలయ్యాయి. అయిదో ఎమ్మెల్సీ పదవిని దక్కించుకునేందుకు ఎంత ఖర్చు పెట్టడానికైనా గులాబీ నేతలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు ఈ ఎన్నికకు కొందరు ఎమ్మెల్యేలను గైర్హాజరు చేయిస్తే, తమకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్న నాయకులు సీపీఎం, సీపీఐ, వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు హాజరు కాకుండా చూసే పనిలో ఉన్నట్లు తెలిసింది. ఇది టీడీపీకి కొంత అనుకూలించే అంశమైనా, తమకు మరింత లాభకరన్న అంచనాకు వచ్చారు. ఈ మేరకు ఓ మంత్రి ఇప్పటికే ఒకరిద్దరు ఎమ్మెల్యేలను ఓటింగ్‌కు హారు కావొద్దని కోరినట్లు సమాచారం. ఆరు నూరైనా.. అయిదో ఎమ్మెల్సీని గెలిపించుకోవాలన్న పట్టుదల అధికార టీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోంది. -
హాట్.. హాట్!
ఊపందుకున్న మండలి ప్రచారం - ఎన్నికలను ప్రతిష్టాత్మగా తీసుకున్న టీఆర్ఎస్ - వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్న బీజేపీ - సీనియర్ల సమన్వయంతో కాంగ్రెస్ దూకుడు - చాపకింద నీరులా విద్యార్థి సంఘం నేత సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలో మండలి ఎన్నికల ప్రచారపర్వం ఊపందుకుంది. నామినేషన్ల ఘట్టానికి తెరపడడంతో అభ్యర్థులు ‘పట్టభద్రుల’ను ఆకర్షించే పనిలో పడ్డారు. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఈ నెల 22న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో బరిలో దిగిన ఎమ్మెల్సీ అభ్యర్థులు దూకుడుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అధికారపార్టీ తరఫున రాష్ట్ర ఉద్యోగ సంఘం నేత దేవీప్రసాద్ పోటీ చేస్తుండడం, బీజేపీ -టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా రామచంద్రరావు, కాంగ్రెస్ నుంచి రవికుమార్‌గుప్తా, పాలమూరు- ఉస్మానియా వర్సిటీ విద్యార్థి సంఘాల అభ్యర్థిగా సుభాష్‌రెడ్డి ప్రచారపర్వంలో దూసుకుపోతున్నారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న టీఆర్ఎస్.. దేవీప్రసాద్ విజయానికి సర్వశక్తులొడ్డుతోంది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలకు గెలుపు బాధ్యతలను అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రచారశైలిని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్నారు. గత రెండు రోజులుగా నగర శివార్లలో ఉద్యోగులు ఎక్కువగా నివసించే ఎన్జీఓస్ కాలనీ, సఫిల్‌గూడ మినీ ట్యాంకుబండ్ మార్నింగ్‌వాక్ పేర ఉద్యోగులు, విద్యావంతులతో భేటీ అయిన దేవీప్రసాద్ తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. సాక్షాత్తు హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చూస్తే ఈ ఎన్నికలకు అధికారపార్టీ ఇస్తున్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయుల మద్దతు కూడగట్టేందుకు వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు. బుధవారం చేవెళ్ల మండల కేంద్రంలో పట్టభద్రులు, ఉద్యోగులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడమేకాకుండా.. దేవీప్రసాద్‌కు అనుకూలంగా ఓటేయాలని పిలుపునిచ్చారు. ముప్పేట దాడి..! స్థానికేతరుడనే ప్రచారాస్త్రంతో దేవీప్రసాద్‌ను ప్రత్యర్థులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మెదక్ జిల్లాకు చెందిన దేవీప్రసాద్‌ను ఇక్కడి నుంచి బరిలో నిలపడాన్ని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్, బీజేపీ.. దీన్నే ప్రధానాస్త్రంగా చేసుకొని ఓట్లను కొల్లగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. టికెట్ దక్కలేదని అసంతృప్తిలో ఉన్న ఉపాధ్యాయసంఘాల నేతలతో అంతర్గత చర్చలు జరుపుతున్న ఈ ఇరువురు అభ్యర్థులు.. ఉపాధ్యాయుల ఓట్లతో గట్టెక్కాలనే ఎత్తుగడ వేస్తున్నారు. మరోవైపు గతంలో కాషాయదళం తరఫున పోటీచేసి ఓడిపోయిన రామచంద్రరావు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. పక్కా ప్రణాళికతో ప్రచారాన్ని కొనసాగిస్తున్న రామచంద్రరావు.. దేవీప్రసాద్‌పై నిశిత విమర్శలు చేస్తున్నారు. బీజేపీ- టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగినందున రామచంద్రరావును గెలిపించేందుకు ఇరుపార్టీలు సమన్వయంతో పనిచే యాలని నిర్ణయించాయి. ఎమ్మెల్యేలను నియోజకవర్గాల వారీగా ఇన్చార్జిలుగా నియమించడం ద్వారా ఉద్యోగులు, విద్యావంతులు, మేధావుల మద్దతు పొందాలని వ్యూహరచన చేశాయి. తొలిసారి బరిలో.. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తొలిసారి రంగంలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి రవికుమార్‌గుప్తా.. పార్టీ సీనియర్లను ఐక్యం చేయడంలో సఫలీకృతమయ్యారు. ఎడముఖం.. పెడముఖంగా ఉన్న పార్టీ ముఖ్యనేతలను సమన్వయపరిచి ప్రచారానికి ఊపు తెచ్చారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రసాద్‌కుమార్, చంద్రశేఖర్, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇక విద్యార్థినేత సుభాష్‌రెడ్డి చాపకింద నీరులా మద్దతు కూడగడుతున్నారు. విద్యార్థి సంఘం నేతగా గుర్తింపుపొందిన సుభాష్.. విద్యార్థిలోకం అండతో ‘పెద్దలసభ’లోకి ప్రవేశించాలని ఉవ్విళ్లూరుతున్నారు. బలమైన సామాజికవర్గం నుంచి ఈయన ఒకరే పోటీలో ఉండడం కూడా ఆయనకు సానుకూలం కానుంది. వికారాబాద్ జేఏసీ నేత నర్సిములు కూడా బరిలో నిలవడంతో దేవీప్రసాద్ ఓట్లకు గండిపడే అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యమంలో కీ లకంగా వ్యవహరించిన ఆయనకు ఈ ప్రాంతంలోని ఉపాధ్యాయ, ఉపన్యాసకుల్లో గట్టి పట్టుంది.