హైదరాబాద్ : తెలంగాణ శాసనమండలికి ఎన్నికలు తప్పడం లేదు. ఎమ్మెల్యే కోటాలోని ఆరు స్థానాలు ఎన్నిక ద్వారా భర్తీ కానున్నాయి. ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు గాను బరిలో ఏడుగురు అభ్యర్ధులు ఉండడంతో ఎన్నిక అనివార్యమని తేలిపోయింది. సోమవారం నామినేషన్ల ఉప సంహరణల గడువు ముగిసింది. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్ధులు ఎవరూ విత్‌డ్రా చేసుకోలేదు. గడువు ముగిశాక మండలి ఎన్నికల అధికారి, శాసన సభా కార్యదర్శి రాజ సదరాం అభ్యర్ధుల వివరాలను అధికారికంగా ప్రకటించారు.
కాంగ్రెస్ నుంచి ఆకుల లలిత, టీఆర్‌ఎస్ నుంచి తుమ్మల నాగేశ్వర్‌రావు, కడియం శ్రీహరి, నేతి విద్యాసాగర్, కె.యాదవరెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, టీడీపీ నుంచి వేం నరేందర్‌రెడ్డి పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యేల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే టీఆర్‌ఎస్ నాలుగు, కాంగ్రెస్ ఒకటి, ఇతర పార్టీల మద్దతుతో టీడీపీ ఒక స్థానం గెలుచుకోగలుగుతాయి. ఒక వేళ ఆరుగురు అభ్యర్ధులే పోటీ పడి ఉంటే, మండలి ఎన్నిక ఏకగ్రీవం అయ్యేది. కానీ, టీఆర్‌ఎస్ అయిదో స్థానంపై కన్నేసి అభ్యర్ధిని పోటీకి దింపడంతో ఆరు స్థానాలకు ఏడుగురు అభ్యర్ధులు పోటీ పడుతున్నట్లయ్యింది.
అయిదో స్థానం కోసం... టీఆర్ ఎస్ వ్యూహం
ఒక్కో ఎమ్మెల్సీ పదవిని గెలుచుకోవడానికి ఒక అభ్యర్ధికి 18 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం పడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుచుకున్న స్థానాలకు తోడు, ఆంగ్లో ఇండియన్ (నామినేటెడ్) సభ్యుడు, వివిధ పార్టీల నుంచి గులాబీ తీర్థం పుచ్చుకున్న వారిని కలిపితే 76 అవుతున్నాయి. అనధికార మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న ఎంఐఎంకు చెందిన మరో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇవన్నీ కలిపితే టీఆర్‌ఎస్ చేతిలో ఉన్న ఓట్ల సంఖ్య 83 అవుతోంది. నలుగురు ఎమ్మెల్యేలను గెలుచుకోవడానికి 72 ఓట్లు పోగా, ఆ పార్టీకి ఇంకా 11 ఓట్లున్నాయి. అయిదో ఎమ్మెల్సీ పదవినీ దక్కించుకోవాలంటే టీఆర్‌ఎస్‌కు మరో ఏడు ఓట్లు అవసరం అవుతున్నాయి.
దీంతో తొలి ప్రాధాన్య ఓటుతో కాకుండా, ద్వితీయ ప్రాధాన్య ఓటుతో బయట పడాలని టీఆర్‌ఎస్ లెక్కలు వేస్తోంది. బీజేపీ మద్దతు ఇస్తున్న టీడీపీకి 16 ఎమ్మెల్యే ఓట్లు ఉన్నాయి. ఆ పార్టీ అభ్యర్ధి గెలవాలంటే మరో రెండు ఓట్లు అవసరం. టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు తమ అభ్యర్ధికి ఓట్లేస్తారన్నది గులాబీ నేతల ధీమా. ఆత్మప్రభోదం మేరకు ఓట్లేయాలని ఇప్పటికే ప్రకటనలు మొదలు పెట్టింది.
బేర సారాలు షురూ !
ఎంతగా అంకెల గారడిని నమ్ముకున్నా, ఇతర పార్టీలకు చెందిన కొందరు ఎమ్మెల్యేల ఓట్లను సంపాదించడం టీఆర్‌ఎస్‌కు తప్పని పరిస్థితి. ఈ కారణంగానే టీడీపీకి చెందిన కొందరికి ఆశ చూపెడుతున్నట్లు సమాచారం. టీడీపీ ఎమ్మెల్యేలు మాధవరపు కృష్ణారావు, ప్రకాశ్ గౌడ్‌లు టీఆర్‌ఎస్‌లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. కాబట్టి వీరి రెండు ఓట్లు టీఆర్‌ఎస్‌కే పడతాయన్న అంచనాలు మొదలయ్యాయి. అయిదో ఎమ్మెల్సీ పదవిని దక్కించుకునేందుకు ఎంత ఖర్చు పెట్టడానికైనా గులాబీ నేతలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మరో వైపు ఈ ఎన్నికకు కొందరు ఎమ్మెల్యేలను గైర్హాజరు చేయిస్తే, తమకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్న నాయకులు సీపీఎం, సీపీఐ, వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు హాజరు కాకుండా చూసే పనిలో ఉన్నట్లు తెలిసింది. ఇది టీడీపీకి కొంత అనుకూలించే అంశమైనా, తమకు మరింత లాభకరన్న అంచనాకు వచ్చారు. ఈ మేరకు ఓ మంత్రి ఇప్పటికే ఒకరిద్దరు ఎమ్మెల్యేలను ఓటింగ్‌కు హారు కావొద్దని కోరినట్లు సమాచారం. ఆరు నూరైనా.. అయిదో ఎమ్మెల్సీని గెలిపించుకోవాలన్న పట్టుదల అధికార టీఆర్‌ఎస్ నేతల్లో కనిపిస్తోంది.
తెలంగాణ శాసనమండలికి...తప్పని ఎన్నిక
Published Mon, May 25 2015 8:49 PM | Last Updated on Sun, Sep 3 2017 2:40 AM
Advertisement