మోహన్, రామకృష్ణగౌడ్, సాయి వెంకట్
‘‘నిర్మాతల మండలి ఎన్నికల కోసం డబ్బు ఖర్చు చేసే బదులు అందరూ ఒక్కటిగా ప్యానల్‌ని ఎన్నుకుంటే బాగుంటుంది. ఈ విషయంపై తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్ రామ్మోహనరావు, నిర్మాత సురేశ్‌బాబుతో కూడా మాట్లాడాను. చాలా మంది నిర్మాతల అభిప్రాయం కూడా ఇదే’’ అని తెలంగాణ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. తెలుగు ఫిలిం చాంబర్ నిర్మాతల మండలి ఎన్నికలు ఈ నెల 30న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతాని రామకృష్ణ గౌడ్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఎన్నికల విషయంలో ఇటీవలే నిర్మాతల మండలి సమావేశం జరిపి రెండు ప్యానల్స్‌ని ఎంపిక చేసింది.ఆ తర్వాత కొన్ని నాటకీయ పరిణామాల మధ్య రెండు ప్యానల్స్ ఒక్కటయ్యాయి.
అందులో కొందరిని పక్కన పెట్టారు. నిర్మాతల మండలి బాగా ఉంటున్న క్రమంలో కొందరు కావాలని సమస్యలు సృష్టిస్తున్నారు. ఇప్పటికే కొందరు ఎల్.ఎల్. పి అంటూ చానల్స్ విషయంలో సపరేట్‌గా ఉండటంతో కౌన్సిల్‌కు వచ్చే ఆదాయం తగ్గింది. ఆ సమస్యను పరిష్కరిస్తామని నిర్మాత సి. కళ్యాణ్‌గారు చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నేడు ఉపసంహరణ చేసుకుంటే బాగుంటుంది. ఎన్నికల ముందే అందరు పెద్ద వాళ్లతో కూర్చుని నిర్మాతల మండలి ప్యానల్‌ని ఎంపిక చేస్తే బాగుంటుంది. నేడు నేను ఉపసంహరణ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా ముందుకు రావాలి’’ అన్నారు. ఈ సమావేశంలో నిర్మాతలు శంకర్ గౌడ్, జేవీఆర్, సాయి వెంకట్‌లతో పాటు మరికొందరు నిర్మాతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment