JAC leader
-
హాట్.. హాట్!
ఊపందుకున్న మండలి ప్రచారం - ఎన్నికలను ప్రతిష్టాత్మగా తీసుకున్న టీఆర్ఎస్ - వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్న బీజేపీ - సీనియర్ల సమన్వయంతో కాంగ్రెస్ దూకుడు - చాపకింద నీరులా విద్యార్థి సంఘం నేత సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలో మండలి ఎన్నికల ప్రచారపర్వం ఊపందుకుంది. నామినేషన్ల ఘట్టానికి తెరపడడంతో అభ్యర్థులు ‘పట్టభద్రుల’ను ఆకర్షించే పనిలో పడ్డారు. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఈ నెల 22న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో బరిలో దిగిన ఎమ్మెల్సీ అభ్యర్థులు దూకుడుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అధికారపార్టీ తరఫున రాష్ట్ర ఉద్యోగ సంఘం నేత దేవీప్రసాద్ పోటీ చేస్తుండడం, బీజేపీ -టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా రామచంద్రరావు, కాంగ్రెస్ నుంచి రవికుమార్‌గుప్తా, పాలమూరు- ఉస్మానియా వర్సిటీ విద్యార్థి సంఘాల అభ్యర్థిగా సుభాష్‌రెడ్డి ప్రచారపర్వంలో దూసుకుపోతున్నారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న టీఆర్ఎస్.. దేవీప్రసాద్ విజయానికి సర్వశక్తులొడ్డుతోంది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలకు గెలుపు బాధ్యతలను అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రచారశైలిని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్నారు. గత రెండు రోజులుగా నగర శివార్లలో ఉద్యోగులు ఎక్కువగా నివసించే ఎన్జీఓస్ కాలనీ, సఫిల్‌గూడ మినీ ట్యాంకుబండ్ మార్నింగ్‌వాక్ పేర ఉద్యోగులు, విద్యావంతులతో భేటీ అయిన దేవీప్రసాద్ తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. సాక్షాత్తు హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చూస్తే ఈ ఎన్నికలకు అధికారపార్టీ ఇస్తున్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయుల మద్దతు కూడగట్టేందుకు వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు. బుధవారం చేవెళ్ల మండల కేంద్రంలో పట్టభద్రులు, ఉద్యోగులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడమేకాకుండా.. దేవీప్రసాద్‌కు అనుకూలంగా ఓటేయాలని పిలుపునిచ్చారు. ముప్పేట దాడి..! స్థానికేతరుడనే ప్రచారాస్త్రంతో దేవీప్రసాద్‌ను ప్రత్యర్థులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మెదక్ జిల్లాకు చెందిన దేవీప్రసాద్‌ను ఇక్కడి నుంచి బరిలో నిలపడాన్ని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్, బీజేపీ.. దీన్నే ప్రధానాస్త్రంగా చేసుకొని ఓట్లను కొల్లగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. టికెట్ దక్కలేదని అసంతృప్తిలో ఉన్న ఉపాధ్యాయసంఘాల నేతలతో అంతర్గత చర్చలు జరుపుతున్న ఈ ఇరువురు అభ్యర్థులు.. ఉపాధ్యాయుల ఓట్లతో గట్టెక్కాలనే ఎత్తుగడ వేస్తున్నారు. మరోవైపు గతంలో కాషాయదళం తరఫున పోటీచేసి ఓడిపోయిన రామచంద్రరావు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. పక్కా ప్రణాళికతో ప్రచారాన్ని కొనసాగిస్తున్న రామచంద్రరావు.. దేవీప్రసాద్‌పై నిశిత విమర్శలు చేస్తున్నారు. బీజేపీ- టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగినందున రామచంద్రరావును గెలిపించేందుకు ఇరుపార్టీలు సమన్వయంతో పనిచే యాలని నిర్ణయించాయి. ఎమ్మెల్యేలను నియోజకవర్గాల వారీగా ఇన్చార్జిలుగా నియమించడం ద్వారా ఉద్యోగులు, విద్యావంతులు, మేధావుల మద్దతు పొందాలని వ్యూహరచన చేశాయి. తొలిసారి బరిలో.. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తొలిసారి రంగంలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి రవికుమార్‌గుప్తా.. పార్టీ సీనియర్లను ఐక్యం చేయడంలో సఫలీకృతమయ్యారు. ఎడముఖం.. పెడముఖంగా ఉన్న పార్టీ ముఖ్యనేతలను సమన్వయపరిచి ప్రచారానికి ఊపు తెచ్చారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రసాద్‌కుమార్, చంద్రశేఖర్, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇక విద్యార్థినేత సుభాష్‌రెడ్డి చాపకింద నీరులా మద్దతు కూడగడుతున్నారు. విద్యార్థి సంఘం నేతగా గుర్తింపుపొందిన సుభాష్.. విద్యార్థిలోకం అండతో ‘పెద్దలసభ’లోకి ప్రవేశించాలని ఉవ్విళ్లూరుతున్నారు. బలమైన సామాజికవర్గం నుంచి ఈయన ఒకరే పోటీలో ఉండడం కూడా ఆయనకు సానుకూలం కానుంది. వికారాబాద్ జేఏసీ నేత నర్సిములు కూడా బరిలో నిలవడంతో దేవీప్రసాద్ ఓట్లకు గండిపడే అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యమంలో కీ లకంగా వ్యవహరించిన ఆయనకు ఈ ప్రాంతంలోని ఉపాధ్యాయ, ఉపన్యాసకుల్లో గట్టి పట్టుంది. -
తిరిగి కాంగ్రెస్ గూటికి జగ్గారెడ్డి?
సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. మెదక్ ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేసిన జగ్గారెడ్డి... తాను బీజేపీలో ఇమడలేకపోతున్నానని సన్నిహితుల దగ్గర చెబుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతి నుంచి జగ్గారెడ్డి పార్టీ మారే విషయంలో పునరాలోచనలో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా ఆయన తిరిగి కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి బలం చేకూరుస్తూ జగ్గారెడ్డి మంగళవారం కాంగ్రెస్ నేతలు మల్లు భట్టి విక్రమార్క తదితరులతో కలసి సీఎల్పీ కార్యాలయ ప్రాంగణానికి వచ్చారు. ఈ సందర్భంగా తిరికి కాంగ్రెస్‌లో చేరుతున్నారా? అన్న ప్రశ్నలను ఖండించలేదు కూడా. అయితే కాంగ్రెస్ వర్గాల సమాచారం మేరకు.. జగ్గారెడ్డి పునరాగమనంపై మెద క్ జిల్లా కాంగ్రెస్ నేతలకు ఇప్పటికే సమాచారం అందించారు. డీసీసీ అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో కూడా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. -
విద్యుత్ సంక్షోభానికి ఏపీప్రభుత్వమే కారణం
సూర్యాపేట : తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గత సీమాంధ్ర పాలకుల స్వార్థపూరిత వైఖరే కారణమని విద్యుత్ జేఏసీ నాయకుడు కె.రఘు ఆరోపించారు. ఆదివారం తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో సూర్యాపేటలో బాలాజీగార్డెన్స్‌లో నిర్వహించిన రైతాంగ సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజనకు ముందున్న పీపీఏను రద్దుచేసి కృష్ణపట్నం ప్లాంట్ నుంచి అలాగే సీలేరు పవర్‌ప్లాంట్ నుంచి విద్యుత్ వాటా రానివ్వకుండా అడ్డుకొని కుట్ర పన్నిందన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలనే ఏపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. నేడు నీరు, విద్యుత్ ఆంధ్రావారి దోపిడీకి గురై తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితిదాపురించిందన్నారు. రిటైర్డ్ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ కృష్ణా,గోదావరి నదుల నుంచి 230 టీఎంసీల నీటితో తెలంగాణలోని చెరువులు, కుంటలను నింపుకునే అవకాశం ఉందన్నారు. అలా కాకుండా సీమాంధ్ర పాలకులు తెలంగాణలోని గొలుసుకట్టు చెరువులను నాశనం చేసి ఆ నీటిని కూడా కిందికి తీసుకొనిపోయారని తెలిపారు. గత పాలకులు ప్రపంచ బ్యాంకు నిధులను కట్టపై మట్టిచల్లి కట్ట ఎత్తు పెంచారే తప్ప పూడిక తీసి నీటిని నింపే ప్రయత్నం చేయలేదన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునర్నిర్మాణం చేయడం భవిష్యత్‌కు శుభ సూచమన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎం.మల్లారెడ్డి మాట్లాడుతూ రబీ సీజన్లో విద్యుత్, వర్షం కొరతను దృష్టిలో ఉంచుకొని వరికి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, టీవీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దం అశోక్‌రెడ్డి, అధ్యక్షులు రాయపూడి వెంకటేశ్వరరావు, జి.వెంకటేశ్వర్లు, డాక్టర్ వనజ, చింతలపాటి చినశ్రీరాములు, అంకతి వెంకన్న, సముద్రాల రాంబాబు, మల్లయ్య, గుంటకండ్ల దామోదర్‌రెడ్డి, మారం సంతోష్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, అంజయ్య, నాగరాజు, బాలాజీ పాల్గొన్నారు.