బెంగళూరు జైల్లో కుమిలిపోతున్న ఇళవరసి
సాక్షి ప్రతినిధి, చెన్నై: నా జీవితం ఏమిటి ఇలా అయింది, నేనేం తప్పు చేశానని జైల్లో రోజూ నరకం అనుభవిస్తున్నాను, జైలు నుంచి శవంగానే బైటకు వస్తాను’...ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే (అమ్మ) ప్రధాన కార్యదర్శి శశికళ, సుధాకరన్‌లతోపాటు నాలుగేళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్న ఇళవరసి తట్టుకోలేని ఆవేదనా భరిత మాటలు ఇవి.
బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో ఉన్న ఇళవరసిని చూసేందుకు ఆమె కుమారుడు వివేక్, ఇతర బంధువులు వచ్చినపుడల్లా కన్నీరుమున్నీరవుతున్నట్లు సమాచారం. నా చుట్టూ ఏమి జరుగుతోంది, ఏమీ అర్థం కావడంలేదు అని ఆందోళన చెందుతున్నారు. ప్రతిరోజూ నరకం అనుభవిస్తున్నాను, అసలు నేనేం తప్పు చేశాను, ఇంట్లో ఉంటూ అందరికీ వండి పెట్టాను, అడిగిన చోటల్లా సంతకం పెట్టిన పాపానికి ఇప్పుడు అనుభవిస్తున్నానని ఆమె వెక్కివెక్కి రోదిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె ఓదార్చేందుకు ఎవ్వరివల్ల కావడం లేదు. ఇళవరసి ఆవేదన తీవ్రమై బీపీ పెరిగి రెండుసార్లు స్పృహ కోల్పోయారు. దీంతో ఆమెకు జైల్లోనే అత్యవసర చికిత్సను అందజేశారు. జైలు బయటకు తీసుకెళ్లి చికిత్స చేయించేందుకు జైళ్లశాఖ నిరాకరించింది. శశికళను పరామర్శించేందుకు వస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పే మాటలతో ఆమె ఎంతో కొంత ఊరట చెందుతున్నా, ఇళవరసి మాత్రం జీవితంపై విరక్తి చెందినట్లుగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.