bangalore jail
-
శశికళ మళ్లీ బయటకు.. డౌటే?
సాక్షి, చెన్నై : పెరోల్ గడువు ముగియటంతో అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ నటరాజన్ తిరిగి జైలుకు పయనం అయ్యారు. భర్త నటరాజన్ అనారోగ్యం దృష్ట్యా బెంగళూరు కోర్టు ఆమెకు ఐదు రోజుల పెరోల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం తన మద్ధతుదారులకు, కార్యకర్తలకు అభివాదం చేసి అనంతరం ఆమె బెంగళూరు పరప్పన అగ్రహార జైలుకు బయలుదేరారు. సాయంత్రానికి ఆమె పరప్పన అగ్రహార జైల్లో రిపోర్టు చేయనున్నారు. కాగా, పెరోల్‌ను వ్యక్తిగత కారణాలకు మాత్రమే వినియోగించుకోవాలని.. ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలపై చర్చలు జరపొద్దని నిబంధన విధించిన విషయం తెలిసిందే. అయితే ఆమె వాటిని అతిక్రమించినట్టు తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. ఐదు రోజుల్లో ఆమె కేవలం రెండు రోజులు మాత్రమే ఆస్పత్రికి వెళ్లి భర్తను పరామర్శించారని.. అక్కడ కూడా ఐదారు గంటల కంటే ఎక్కువ సేపు లేదని ఆరోపణలు వినిపించాయి. ఇక మిగతా సమయమంతా పార్టీ కార్యకలాపాల్లోనే ఆమె మునిగి తేలిందని.. దినకరన్, న్యాయ నిపుణులతో పార్టీపై పట్టు కోసం చర్చలు జరిపిందన్న వార్తలు వచ్చాయి. దీంతో పరప్పన అగ్రహార జైలు ఆ అంశంను పరిశీలించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఆమెకు పెరోల్ మంజూరు అవుతుందా? అన్న అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు. -
బెంగళూరు జైల్లో కుమిలిపోతున్న ఇళవరసి
సాక్షి ప్రతినిధి, చెన్నై: నా జీవితం ఏమిటి ఇలా అయింది, నేనేం తప్పు చేశానని జైల్లో రోజూ నరకం అనుభవిస్తున్నాను, జైలు నుంచి శవంగానే బైటకు వస్తాను’...ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే (అమ్మ) ప్రధాన కార్యదర్శి శశికళ, సుధాకరన్లతోపాటు నాలుగేళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్న ఇళవరసి తట్టుకోలేని ఆవేదనా భరిత మాటలు ఇవి. బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో ఉన్న ఇళవరసిని చూసేందుకు ఆమె కుమారుడు వివేక్, ఇతర బంధువులు వచ్చినపుడల్లా కన్నీరుమున్నీరవుతున్నట్లు సమాచారం. నా చుట్టూ ఏమి జరుగుతోంది, ఏమీ అర్థం కావడంలేదు అని ఆందోళన చెందుతున్నారు. ప్రతిరోజూ నరకం అనుభవిస్తున్నాను, అసలు నేనేం తప్పు చేశాను, ఇంట్లో ఉంటూ అందరికీ వండి పెట్టాను, అడిగిన చోటల్లా సంతకం పెట్టిన పాపానికి ఇప్పుడు అనుభవిస్తున్నానని ఆమె వెక్కివెక్కి రోదిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె ఓదార్చేందుకు ఎవ్వరివల్ల కావడం లేదు. ఇళవరసి ఆవేదన తీవ్రమై బీపీ పెరిగి రెండుసార్లు స్పృహ కోల్పోయారు. దీంతో ఆమెకు జైల్లోనే అత్యవసర చికిత్సను అందజేశారు. జైలు బయటకు తీసుకెళ్లి చికిత్స చేయించేందుకు జైళ్లశాఖ నిరాకరించింది. శశికళను పరామర్శించేందుకు వస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పే మాటలతో ఆమె ఎంతో కొంత ఊరట చెందుతున్నా, ఇళవరసి మాత్రం జీవితంపై విరక్తి చెందినట్లుగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. -
ఏసీ లేదు.. చిన్నమ్మ తమిళనాడుకూ రారు!
ఒక పక్క ఎండలు మండిపోతున్నాయి.. కానీ జైల్లో ఏసీ లేదు. కనీసం ప్రత్యేక సదుపాయాలు కూడా లేవు. మంచం ఇవ్వకపోవడంతో కటిక నేలమీద పడుకోవాల్సి వస్తోంది. ఇదీ బెంగళూరు పరప్పణ అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న వీకే శశికళ ప్రస్తుత పరిస్థితి. పొరుగు రాష్ట్రం కాబట్టి ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయని, సొంత రాష్ట్రం వెళ్లిపోతే కొంత మెరుగ్గా ఉంటుందని అనుకున్నా, అది కూడా సాధ్యం కావడం లేదు. జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష పడిన అన్నాడీఎంకే నాయకురాలు శశికళను తమిళనాడులోని వేరే జైలుకు తరలించే అవకాశం ఉందంటూ వచ్చిన కథనాలను కర్ణాటక జైళ్ల శాఖ అధికారులు ఖండించారు. ఈ విషయమై సమాచార హక్కు చట్టం ప్రకారం న్యాయవాది ఎంపీ రాజవేలాయుధం పలు ప్రశ్నలు అడిగారు. దానికి పరప్పణ అగ్రహారలోని సెంట్రల్ జైలుకు చెందిన డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ సమాధానం ఇచ్చారు. కర్ణాటక నుంచి తమిళనాడుకు ఆమెను తరలించాలంటూ అసలు తమకు ఇంతవరకు ఎలాంటి దరఖాస్తు అందనే లేదని ఆయన చెప్పారు. శశికళను, ఆమె బంధువు ఇళవరసిని కర్ణాటక నుంచి తమిళనాడుకు బదిలీ చేసే ప్రతిపాదన ఏమైనా ఉందా అని అడగ్గా, ఖైదీల నుంచి తమకు అలాంటి దరఖాస్తు రాలేదని లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అన్నడీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌కు 35-40 నిమిషాల పాటు శశికళతో మాట్లాడేందుకు అనుమతి ఇచ్చామని కూడా ఆ సమాధానంలో చెప్పారు. ఆమె గదిలో ఒక్క టీవీ తప్ప అదనపు సదుపాయాలు ఏమీ లేవని స్పష్టం చేశారు. మంచం, పరుపు, ఫ్యాన్, ఏసీ, వాటర్ హీటర్, ప్రత్యేక బాత్రూం.. ఇవేమీ శశికళకు అందించలేదని వివరించారు. -
జైలు నుంచి శశికళ లేఖ!
జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే శశికళ.. తన సొంత రాష్ట్రంలోని పార్టీ కార్యకర్తలకు ఓ లేఖ రాశారు. ఈనెల 24వ తేదీ శుక్రవారం నాడు జయలలిత పుట్టినరోజు కావడం, మరణించిన తర్వాత తొలిసారి ఆమె జయంతి రావడంతో దీన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని చిన్నమ్మ శశికళ పార్టీ వర్గాలకు తెలిపారు. ఆరోజు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. పార్టీని వెన్నుపోటు పొడవాలనుకున్నవారి ప్రయత్నాలను విజయవంతంగా అడ్డుకున్నామని.. ఎంజీఆర్ వారసత్వం, జయలలిత కృషిని నీరు కారుద్దామనుకున్నవారి కుట్రలు సాగనివ్వలేదని అన్నారు. ఎంజీఆర్ శతజయంతి సంవత్సరంలో అమ్మ పాలనను కాపాడుకున్నామని రాశారు. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి, తన అక్క కొడుకు అయిన టీటీవీ దినకరన్ ఆమెను బెంగళూరు జైల్లో కలిసిన ఒక్కరోజు తర్వాత జైలు నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. పార్టీ కార్యాలయంలో జయలలిత ఫొటోకు ప్రిసీడియం చైర్మన్ కేఏ సెంగొట్టియాన్ పూల మాల వేస్తారని మరో ప్రకటనలో తెలిపారు. -
ఇక్కడ నాకు ప్రాణహాని.. పంపేయండి!
జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష పడి.. బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైల్లో ఉన్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ.. తనకు అక్కడ ప్రాణహాని ఉందని పిటిషన్ దాఖలు చేశారు. ఇక్కడి వాతావరణం కూడా తనకు పడటం లేదని, అందువల్ల వెంటనే తనను తమిళనాడుకు తరలించాలని ఆ పిటిషన్లో కోరారు. బెంగళూరు జైలుకు తరలించినప్పటి నుంచి అక్కడ తీవ్ర అసౌకర్యంగా ఫీలవుతున్న శశికళ, వీలైనంత త్వరగా అక్కడి నుంచి బయట పడాలని చూస్తున్నారు. జైలు గేటు నుంచి బ్యారక్స్ వరకు దూరం ఎక్కువగా ఉంటుందని జీపులో తీసుకెళ్తామని చెబితే, తాను చిల్లరదొంగను కానని, నడుచుకుంటూనే వస్తానని చెప్పి అలాగే చేశారు. జైల్లో తనను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని కోరారు. దానికి అధికారులు తిరస్కరించడంతో ఆమె నేలమీదే పడుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల దృష్ట్యా తమిళనాడు వెళ్తే అక్కడ తనకు వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుందని శశికళ భావిస్తున్నట్లు ఉన్నారు. -
ఎవరీ సైనైడ్ మల్లిక!
వారం పది రోజుల క్రితం వరకు ఆమె తమిళనాడు ముఖ్యమంత్రిని అవుతానని కలలు గన్నారు. గురువారం నాడు కొత్త ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి ప్రమాణస్వీకారం చేస్తుంటే ఆనందబాష్పాలతో బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైల్లోని టీవీలో లైవ్ షో చూశారు. అంతకుముందు తాను చిల్లర దొంగను కానని, అందువల్ల పోలీసు జీపు ఎక్కేది లేదని కూడా పోలీసులతో హుంకరించారు. కానీ.. తన పక్క సెల్లో ఎవరున్నారన్న విషయం ఆమెకు ఇంకా తెలుసో లేదో తెలియదు. శశికళ పక్కనే ఉన్న సెల్లో ఉన్నది అలాంటి ఇలాంటి వాళ్లు కారు.. సైనైడ్ మల్లిక!! దేవాలయాలకు వచ్చిన మహిళలను సైనైడ్‌తో చంపేసి, వాళ్ల దగ్గర ఉన్న బంగారు నగలు తీసుకుని పారిపోయిన చరిత్ర ఆమెది. అలా ఒకరు, ఇద్దరు కారు.. ఏకంగా ఆరుగురిని ఆమె హతమార్చింది. ఈ కేసులో ఆమెకు కోర్టు ఉరిశిక్ష విధించగా.. అది ఇటీవలే జీవితఖైదుగా మారింది. ఒకరకంగా సైనైడ్ మల్లికతో పోలిస్తే శశికళ అంత పెద్ద నేరస్థురాలు ఏమీ కారు. ఖైదీ నెంబర్ 9234 అయిన శశికళ... ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవాలనుకున్నారు గానీ కుదరలేదు. సర్వసాధారణంగా అందరు ఖైదీలకు ఇచ్చే 10/8 సెల్లోనే మామూలు చాప, దిండు, దుప్పటితో ఆమె పడుకోవాల్సి వస్తోంది. చివరకు పరుపు కావాలని అడిగినా కూడా ఇవ్వలేదు. రెండు రొట్టెలు, ఒక రాగి ముద్ద, 200 గ్రాముల అన్నం, 150 గ్రాముల సాంబారుతో కూడిన సాధారణ భోజనమే ఆమెకు కూడా పెట్టారు. కొంచెం భోజనం చేస్తే తప్ప ఓపిక ఉండదని, అందువల్ల ఎలాగోలా సర్దుకుని తినాలని శశికళతో పాటే అదే సెల్లో ఉన్న మరదలు ఇళవరసి ఆమెకు నచ్చజెప్పినట్లు తెలిసింది. మరిన్ని తమిళనాడు విశేషాలు.. భారీ భద్రతతో బయల్దేరిన ఎమ్మెల్యేలు పళని శిబిరం నుంచి మరో ఎమ్మెల్యే జంప్ మొన్నటివరకు గవర్నర్.. నేడు స్పీకర్! బలపరీక్షకు కరుణానిధి దూరం! పళనిస్వామిని ఓడించండి: రాహుల్ అమ్మకు ఓటేయండి నన్ను చూసి నవ్వొద్దు ‘మ్యాజిక్’ చేసేదెవరు? -
నేను చిల్లర దొంగను కాను: శశికళ
-
నేను చిల్లర దొంగను కాను: శశికళ
పరప్పణ అగ్రహార జైల్లో సాధారణ ఖైదీలా కాలం గడపాల్సి రావడం చిన్నమ్మ శశికళకు బాగా అవమానకరంగా అనిపించింది. దాంతో ఆమె జైలు అధికారులతో ఈ విషయంలో కాస్తంత గొడవ పడినట్లు తెలుస్తోంది. వాళ్లకు.. తాను చిల్లర దొంగను కానని ఆమె చెప్పినట్లు జాతీయ మీడియా సమాచారం. అందరు ఖైదీల్లాగే తనను జీపులో తీసుకెళ్తామని చెబితే దానికి ఆమె ససేమిరా అన్నారు. దానికంటే లోపలకు నడుచుకుంటూనే వస్తానని చెప్పి.. ఇళవరసి, సుధాకరన్‌లతో కలిసి నడుచుకుంటూనే జైలు ప్రాంగణంలోకి వెళ్లారు. అది ఎంత దూరమైనా తాను నడిచే వస్తాను తప్ప చిల్లర దొంగలను తీసుకెళ్లినట్లు తనను పోలీసు జీపులో తీసుకెళ్తానంటే కుదరదని స్పష్టం చేశారంటున్నారు. ఇంతకుముందు జయలలితతో కలిసి వచ్చినప్పుడు తనకు ఏవేం సౌకర్యాలు కల్పించారో, అవన్నీ ఇప్పుడు కూడా ఉంటాయని ఆమె అనుకున్నారని, కానీ అవేవీ ఇవ్వకపోవడంతో తీవ్ర నిరాశ చెందారని జైలు వర్గాలు తెలిపాయి. అప్పట్లో జయలలిత మాజీ ముఖ్యమంత్రి కావడం, దానికితోడు అనారోగ్యంగా ఉండటం వల్లే ఆమెకు ఎ గ్రేడు సౌకర్యాలు కల్పించారని, కానీ ఇప్పుడు పరిస్థితి వేరని అంటున్నారు. శశికళ ఎప్పుడూ ముఖ్యమంత్రిగా పనిచేయకపోవడంతో ఆమెకు ఆ స్థాయి సౌకర్యాలు కల్పించడం సాధ్యం కాదని కూడా స్పష్టం చేశారు. శాంతిభద్రతల సమస్య ఏదీ తలెత్తకూడదన్న ఉద్దేశంతోనే ఆమెను జైలు లోపలి వరకు జీపులో తీసుకెళ్లాలని భావించారు. కానీ ఆమె నిరాకరించడంతో నడిపించుకుంటూనే తీసుకెళ్లారు. ఆమెకు 10/8 సైజు సెల్ కేటాయించారని, అందులోనే ఆమె తన మరదలు ఇళవరసితో కలిసి ఉంటున్నారని జైలు అధికారులు తెలిపారు. శశికళకు తెల్లచీర ఇచ్చినా దాన్ని ఆమె కట్టుకోలేదని తెలిసింది. చాలా కొద్దిసేపు మాత్రమే నిద్రపోయారని, పులిహోర తిని కాఫీ తాగారని చెప్పారు. -
శశికళ అరెస్టా.. లొంగుబాటా?
జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష పడిన శశికళను పోలీసులు అరెస్టు చేస్తారా.. లేక ఆమె తనంతట తానే లొంగిపోతారా అన్న విషయంపై సస్పెన్స్ ఇంకా వీడలేదు. సుప్రీంకోర్టు తీర్పు కాపీలు అందలేదన్న కారణంతో మంగళవారం రాత్రి మొత్తం ఆమె పోయెస్ గార్డెన్స్‌లోనే ఉండిపోయారు. భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్న అభిమానులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. కాసేపటి వరకు వారిని ఓదార్చే ప్రయత్నం చేసిన చిన్నమ్మ శశికళ.. ఆ తర్వాత లోపలకు వెళ్లిపోయారు. రాత్రంతా కూడా పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. అయితే, పోలీసులు ఆమెను అరెస్టుచేసి బెంగళూరు తీసుకెళ్తారా లేద అన్నది మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు. దాదాపుగా శశికళే స్వయంగా బెంగళూరు వెళ్లి అక్కడ లొంగిపోవచ్చని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఈ కేసులో ఆరు నెలల జైలుశిక్ష అనుభవించిన శశికళ.. మరో మూడున్నరేళ్ల పాటు జైల్లో ఉండాల్సి వస్తుంది. అప్పట్లో జయలలితతో పాటు ఉన్న పరప్పణ అగ్రహా జైల్లోనే ఇప్పుడు కూడా శశికళ ఉండాల్సి ఉంటుంది. ఆమెతో పాటు ఇళవరసి, సుధాకరన్ సైతం జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. దాంతోపాటు సుప్రీం కోర్టు విధించిన జరిమానాను కూడా వాళ్లు ముగ్గురూ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో శశికళ ఎప్పుడు చెన్నై నుంచి బెంగళూరు బయల్దేరతారో ఇంకా తెలియాల్సి ఉంది. తమిళనాడు మరిన్ని అప్డేట్స్ చూడండి.. కనీసం ఇప్పుడైనా...! తొలి తేజం! శశికలే చిన్నమ్మకు చెరసాల నన్ను ఏ శక్తీ అడ్డుకోలేదు: శశికళ పళనిస్వామే ఎందుకు! ఇక శశికళ రూటు అదే: గౌతమి తమిళనాడు అసెంబ్లీలో ఎవరి బలమెంత..? -
వీర విధేయుడికీ దర్శనం దక్కలేదు!
బెంగళూరు: అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు సమాచారం. ఇంత అధికారాన్ని అనుభవించిన ఆమె.. జైలు జీవితాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. దాంతో తనను కలిసేందుకు వచ్చినవారితో మాట్లాడేందుకు జయలలిత నిరాకరించారట. అది కూడా ఎంతవరకూ అంటే...'అమ్మ' ఆజ్ఞతో సీఎం పీఠాన్ని అధిష్టించిన వీర భక్తుడికి కూడా ఆమె అనుగ్రహం కరువైంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే పన్నీరు సెల్వం బెంగళూరు వెళ్లారు. అమ్మ ఆశీర్వాదం తీసుకునేందుకు వెళ్లిన ఆయనకు అక్కడ చుక్కెదురు అయ్యింది. సమయం మించిపోవటంతో జయను కలిసేందుకు జైలు అధికారులు నిరాకరించారు. దాంతో పన్నీరు సెల్వం మంగళవారం ఉదయం జయలలితను కలిసేందుకు మళ్లీ జైలుకు వెళ్లారు. అయితే అధికారుల అనుమతి ఇచ్చినా అమ్మ మాత్రం మాట్లాడేందుకు ఇష్టపడలేదట. అయినా పన్నీరు సెల్వం పట్టువదలని విక్రమార్కుడిలా మంగళవారం మధ్యాహ్నం వరకూ జైలు ఆవరణలోనే పడిగాపులు కాసినా ఫలితం లేకపోయిందట. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలనపై దృష్టి పెట్టాలే కానీ, జైలు చుట్టూ తిరగటం సరికాదని జయలలిత ఈ సందర్భంగా పన్నీర్ సెల్వంకు సమాచారం పంపినట్లు తెలుస్తోంది. దాంతో తీవ్ర నిరాశకు గురైన పన్నీర్.. అమ్మను కలవకుండానే వెనుదిరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జయలలిత పరప్పన అగ్రహారం జైలులో ఖైదీ నెం. 7402గా… సెల్ నెం.23లో ఉన్నారు. -
సినీఫక్కీలో సైకో ఖైదీ పరార్
బెంగళూరు, న్యూస్‌లైన్: కర్ణాటక రాజధాని బెంగళూరు శివార్లలోని పరప్పన అగ్రహార జైలు నుంచి ఓ సైకో ఖైదీ శనివారం అర్ధరాత్రి దాటాక సినీఫక్కీలో తప్పించుకున్నాడు. పటిష్ట బందోబస్తు, చుట్టూ ఎత్తై గోడలు ఉన్నా అనూహ్యంగా పోలీసుల కళ్లుగప్పి 42 అత్యాచార, హత్య కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న జైశంకర్ అలియాస్ సైకో శంకర్ (36) అనే కరడుగట్టిన ఖైదీ పరారయ్యాడు. పోలీసు దుస్తుల్లో ఖాకీలకే టోకరా వేసి రెండు 15 అడుగుల గోడలతోపాటు మరో 30 అడుగుల గోడ దూకి పలాయనం చిత్తగించాడు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు 11 మంది జైలు అధికారులను సస్పెండ్ చేసింది. కర్ణాటక అదనపు డీజీపీ (జైళ్లశాఖ) కె.వి. గగన్‌దీప్ వివరాల ప్రకారం... మానసిక సమస్యలతో బాధపడుతున్న శంకర్‌ను జైలు అధికారులు అండర్‌గ్రౌండ్ సెల్లో ఉంచారు. అయితే శనివారం అర్ధరాత్రి 2 నుంచి 4 గంటల మధ్య వర్షం వల్ల జైల్లో కరెంటు పోవడంతో శంకర్ నకిలీ తాళం ఉపయోగించి సెల్లోంచి బయటకు వచ్చాడు. అనంతరం అక్కడున్న ఓ పోల్ సాయంతో బెల్ట్, గ్లౌజ్‌లు ఉపయోగించి రెండు 15 అడుగుల గోడలు దూకాడు. ఆపై వెంట తెచ్చుకున్న పోలీసు దుస్తుల్లో పలువురు సెంట్రీ సిబ్బందిని బురిడీ కొట్టించి 30 అడుగుల ప్రధాన ప్రహరీ వద్దకు చేరుకొని బెడ్‌షీట్ సాయంతో పెకైక్కి కిందకు దూకి పారిపోయాడు. ఆదివారం ఉదయం ఖైదీల హాజరు సమయంలో జైశంకర్ కనిపించకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.