నేను చిల్లర దొంగను కాను: శశికళ
నేను చిల్లర దొంగను కాను: శశికళ
Published Fri, Feb 17 2017 2:23 PM | Last Updated on Tue, Sep 5 2017 3:57 AM
పరప్పణ అగ్రహార జైల్లో సాధారణ ఖైదీలా కాలం గడపాల్సి రావడం చిన్నమ్మ శశికళకు బాగా అవమానకరంగా అనిపించింది. దాంతో ఆమె జైలు అధికారులతో ఈ విషయంలో కాస్తంత గొడవ పడినట్లు తెలుస్తోంది. వాళ్లకు.. తాను చిల్లర దొంగను కానని ఆమె చెప్పినట్లు జాతీయ మీడియా సమాచారం. అందరు ఖైదీల్లాగే తనను జీపులో తీసుకెళ్తామని చెబితే దానికి ఆమె ససేమిరా అన్నారు. దానికంటే లోపలకు నడుచుకుంటూనే వస్తానని చెప్పి.. ఇళవరసి, సుధాకరన్‌లతో కలిసి నడుచుకుంటూనే జైలు ప్రాంగణంలోకి వెళ్లారు. అది ఎంత దూరమైనా తాను నడిచే వస్తాను తప్ప చిల్లర దొంగలను తీసుకెళ్లినట్లు తనను పోలీసు జీపులో తీసుకెళ్తానంటే కుదరదని స్పష్టం చేశారంటున్నారు.
ఇంతకుముందు జయలలితతో కలిసి వచ్చినప్పుడు తనకు ఏవేం సౌకర్యాలు కల్పించారో, అవన్నీ ఇప్పుడు కూడా ఉంటాయని ఆమె అనుకున్నారని, కానీ అవేవీ ఇవ్వకపోవడంతో తీవ్ర నిరాశ చెందారని జైలు వర్గాలు తెలిపాయి. అప్పట్లో జయలలిత మాజీ ముఖ్యమంత్రి కావడం, దానికితోడు అనారోగ్యంగా ఉండటం వల్లే ఆమెకు ఎ గ్రేడు సౌకర్యాలు కల్పించారని, కానీ ఇప్పుడు పరిస్థితి వేరని అంటున్నారు. శశికళ ఎప్పుడూ ముఖ్యమంత్రిగా పనిచేయకపోవడంతో ఆమెకు ఆ స్థాయి సౌకర్యాలు కల్పించడం సాధ్యం కాదని కూడా స్పష్టం చేశారు. శాంతిభద్రతల సమస్య ఏదీ తలెత్తకూడదన్న ఉద్దేశంతోనే ఆమెను జైలు లోపలి వరకు జీపులో తీసుకెళ్లాలని భావించారు. కానీ ఆమె నిరాకరించడంతో నడిపించుకుంటూనే తీసుకెళ్లారు. ఆమెకు 10/8 సైజు సెల్ కేటాయించారని, అందులోనే ఆమె తన మరదలు ఇళవరసితో కలిసి ఉంటున్నారని జైలు అధికారులు తెలిపారు. శశికళకు తెల్లచీర ఇచ్చినా దాన్ని ఆమె కట్టుకోలేదని తెలిసింది. చాలా కొద్దిసేపు మాత్రమే నిద్రపోయారని, పులిహోర తిని కాఫీ తాగారని చెప్పారు.
Advertisement