ఇక్కడ నాకు ప్రాణహాని.. పంపేయండి!
జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష పడి.. బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైల్లో ఉన్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ.. తనకు అక్కడ ప్రాణహాని ఉందని పిటిషన్ దాఖలు చేశారు. ఇక్కడి వాతావరణం కూడా తనకు పడటం లేదని, అందువల్ల వెంటనే తనను తమిళనాడుకు తరలించాలని ఆ పిటిషన్‌లో కోరారు. బెంగళూరు జైలుకు తరలించినప్పటి నుంచి అక్కడ తీవ్ర అసౌకర్యంగా ఫీలవుతున్న శశికళ, వీలైనంత త్వరగా అక్కడి నుంచి బయట పడాలని చూస్తున్నారు.
జైలు గేటు నుంచి బ్యారక్స్ వరకు దూరం ఎక్కువగా ఉంటుందని జీపులో తీసుకెళ్తామని చెబితే, తాను చిల్లరదొంగను కానని, నడుచుకుంటూనే వస్తానని చెప్పి అలాగే చేశారు. జైల్లో తనను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని కోరారు. దానికి అధికారులు తిరస్కరించడంతో ఆమె నేలమీదే పడుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల దృష్ట్యా తమిళనాడు వెళ్తే అక్కడ తనకు వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుందని శశికళ భావిస్తున్నట్లు ఉన్నారు.