Published
Wed, Feb 15 2017 8:18 AM
| Last Updated on Sun, Sep 2 2018 5:43 PM
శశికళ అరెస్టా.. లొంగుబాటా?
జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష పడిన శశికళను పోలీసులు అరెస్టు చేస్తారా.. లేక ఆమె తనంతట తానే లొంగిపోతారా అన్న విషయంపై సస్పెన్స్ ఇంకా వీడలేదు. సుప్రీంకోర్టు తీర్పు కాపీలు అందలేదన్న కారణంతో మంగళవారం రాత్రి మొత్తం ఆమె పోయెస్ గార్డెన్స్‌లోనే ఉండిపోయారు. భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్న అభిమానులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. కాసేపటి వరకు వారిని ఓదార్చే ప్రయత్నం చేసిన చిన్నమ్మ శశికళ.. ఆ తర్వాత లోపలకు వెళ్లిపోయారు. రాత్రంతా కూడా పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. అయితే, పోలీసులు ఆమెను అరెస్టుచేసి బెంగళూరు తీసుకెళ్తారా లేద అన్నది మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు.
దాదాపుగా శశికళే స్వయంగా బెంగళూరు వెళ్లి అక్కడ లొంగిపోవచ్చని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఈ కేసులో ఆరు నెలల జైలుశిక్ష అనుభవించిన శశికళ.. మరో మూడున్నరేళ్ల పాటు జైల్లో ఉండాల్సి వస్తుంది. అప్పట్లో జయలలితతో పాటు ఉన్న పరప్పణ అగ్రహా జైల్లోనే ఇప్పుడు కూడా శశికళ ఉండాల్సి ఉంటుంది. ఆమెతో పాటు ఇళవరసి, సుధాకరన్ సైతం జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. దాంతోపాటు సుప్రీం కోర్టు విధించిన జరిమానాను కూడా వాళ్లు ముగ్గురూ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో శశికళ ఎప్పుడు చెన్నై నుంచి బెంగళూరు బయల్దేరతారో ఇంకా తెలియాల్సి ఉంది.