జయలలితకు మూడుసార్లు మొక్కి..
జయలలితకు మూడుసార్లు మొక్కి..
Published Wed, Feb 15 2017 12:16 PM | Last Updated on Sun, Sep 2 2018 5:43 PM
జైలుకు వెళ్లాల్సి వస్తుందని నిర్ణయించుకున్న శశికళ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పోయెస్ గార్డెన్స్ నుంచి బయల్దేరిన ఆమె.. ముందుగా మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధి వద్దకు వెళ్లి, అక్కడ ప్రదక్షిణలు చేసి, మూడుసార్లు సమాధికి మొక్కి మరీ అక్కడి నుంచి బెంగళూరు బయల్దేరారు. అయితే సాధారణంగా ఆ సమయంలో ఎవరైనా నమస్కారం మాత్రమే పెడతారు. కానీ శశికళ మాత్రం అరచేత్తో సమాధి మీద కొట్టినట్లు చేశారు.
ఆ సమయంలో ఆమె కన్నీరు పెట్టుకున్నారు. గులాబి పూల రేకులు సమాధి మీద ఉంచి.. ఆ తర్వాత చేత్తో సమాధి మీద కొట్టారు. ఇలా ఎందుకు చేశారన్నది మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. సమాధి వద్ద నివాళులు అర్పించిన తర్వాత అక్కడి నుంచి ఎంజీఆర్ మెమోరియల్ వద్దకు వెళ్లారు. అక్కడ ఎంజీఆర్ చిత్రపటానికి నమస్కారం చేసుకుని, తర్వాత అక్కడే పద్మాసనం వేసుకుని కూర్చుని కాసేపు ధ్యానముద్రలోకి కూడా వెళ్లిపోయారు. తర్వాత మళ్ల లేచి బయట ఉన్న ఎంజీఆర్ కాంస్య విగ్రహానికి నమస్కరించారు. బయట వేచి ఉన్న తన అభిమానులకు కూడా నమస్కారం చేసి, కళ్లు తుడుచుకుంటూ తన వాహనంలోకి వెళ్లిపోయారు. బయటకు వస్తున్న వశికళకు అభిమానులు హారతులిచ్చారు. ఆ తర్వాత ఆమె తన సొంత వాహనంలో ఇళవరసి, సుధాకరన్‌లతో కలిసి రోడ్డుమార్గంలో బెంగళూరు బయల్దేరారు. సాయంత్రంలోగా బెంగళూరు కోర్టులో శశికళ లొంగిపోవాల్సి ఉన్న విషయం తెలిసిందే.
తమిళనాడు మరిన్ని అప్డేట్స్ చూడండి..
Advertisement