Published
Wed, Feb 15 2017 10:47 AM
| Last Updated on Tue, Jun 4 2019 6:34 PM
శశికళకు మరో షాక్
జయలలిత ఆస్తుల కేసులో శిక్ష పడిన శశికళకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. తనకు ఆరోగ్యం బాగోలేనందున లొంగిపోయేందుకు నెల రోజుల సమయం కావాలని ఆమె కోరగా, సుప్రీంకోర్టు అందుకు తిరస్కరించింది. ఈ విషయాన్ని శశికళ తరఫున సీనియర్ న్యాయవాది కేటీఎస్ తులసి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే సుప్రీం మాత్రం శశికళ వెంటనే లొంగిపోవల్సిందేనని స్పష్టం చేసింది. తన తీర్పులో ఎలాంటి మార్పు చేసే ప్రసక్తి లేదని జస్టిస్ పినాకి చంద్రఘోష్, జస్టిస్ అమితవ రాయ్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. దాంతో శశికళ బుధవారమే బెంగళూరు ప్రత్యేక కోర్టులో లొంగిపోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆమె సాయంత్రం లోగా కోర్టులో లొంగిపోతారని శశికళ తరఫు న్యాయవాదులు బెంగళూరు కోర్టుకు తెలిపారు.
జయలలిత ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారంటూ బీజేపీ సీనియర్ నాయకుడు, ఎంపీ సుబ్రమణ్యం స్వామి దాదాపు 19 సంవత్సరాల క్రితం దాఖలు చేసిన పిటిషన్‌లో తుది తీర్పు మంగళవారం వచ్చింది. అందులో శశికళ, మరో ఇద్దరికి నాలుగేళ్ల జైలుశిక్షను సుప్రీంకోర్టు విధించింది.