జయ సమాధి సాక్షిగా శశికళ శపథం
చెన్నై : అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ...తన నిచ్చెలి జయలలిత సమాధి వద్ద శపథం చేశారు. బెంగళూరు కోర్టులో లొంగిపోయేందుకు బయల్దేరిన ఆమె ముందుగా మెరినా బీచ్‌లోని జయలలిత సమాధి వద్ద నివాళి అర్పించింది. ఈ సందర్భంగా శశికళ ఉద్వేగంతో పాటు ఒకింత ఆగ్రహంగా కూడా కనిపించారు. మూడుసార్లు జయ సమాధిపై మూడుసార్లు చేత్తో కొట్టి శపథం చేశారు. మరోవైపు శశికళ మద్దతుదారులు ఆమెకు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
జయకు నివాళి అర్పించిన అనంతరం శశికళ వాహనంలో బెంగళూరు బయల్దేరారు. రోడ్డు మార్గంలో ఆమె అక్కడకు చేరుకోనున్నారు. కాగా అక్రమాస్తుల కేసులో శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్లు జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే తనకు ఆరోగ్యం బాగోలేనందున లొంగిపోయేందుకు నెల రోజుల సమయం కావాలని శశికళ సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఆమెకు చుక్కెదురు అయింది. శశికళ వెంటనే లొంగిపోవల్సిందేనని న్యాయస్థానం బుధవారం స్పష్టం చేసింది.
దాంతో శశికళ బెంగళూరు ప్రత్యేక కోర్టులో లొంగిపోనున్నారు. ఈ మేరకు ఆమె సాయంత్రంలోగా కోర్టులో లొంగిపోతారని శశికళ తరఫు న్యాయవాదులు బెంగళూరు కోర్టుకు తెలిపారు. ఇప్పటికే అన్నాడీఎంకే సీనియర్ నేత తంబిదొరై బెంగళూరు చేరుకున్నారు. అంతకు ముందు పోయెస్ గార్డెన్ లో శశికళ ప్రత్యేక పూజలు నిర్వహించారు.