ఏసీ లేదు.. చిన్నమ్మ తమిళనాడుకూ రారు!
ఏసీ లేదు.. చిన్నమ్మ తమిళనాడుకూ రారు!
Published Wed, Mar 1 2017 6:56 PM | Last Updated on Tue, Sep 5 2017 4:56 AM
ఒక పక్క ఎండలు మండిపోతున్నాయి.. కానీ జైల్లో ఏసీ లేదు. కనీసం ప్రత్యేక సదుపాయాలు కూడా లేవు. మంచం ఇవ్వకపోవడంతో కటిక నేలమీద పడుకోవాల్సి వస్తోంది. ఇదీ బెంగళూరు పరప్పణ అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న వీకే శశికళ ప్రస్తుత పరిస్థితి. పొరుగు రాష్ట్రం కాబట్టి ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయని, సొంత రాష్ట్రం వెళ్లిపోతే కొంత మెరుగ్గా ఉంటుందని అనుకున్నా, అది కూడా సాధ్యం కావడం లేదు. జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష పడిన అన్నాడీఎంకే నాయకురాలు శశికళను తమిళనాడులోని వేరే జైలుకు తరలించే అవకాశం ఉందంటూ వచ్చిన కథనాలను కర్ణాటక జైళ్ల శాఖ అధికారులు ఖండించారు. ఈ విషయమై సమాచార హక్కు చట్టం ప్రకారం న్యాయవాది ఎంపీ రాజవేలాయుధం పలు ప్రశ్నలు అడిగారు. దానికి పరప్పణ అగ్రహారలోని సెంట్రల్ జైలుకు చెందిన డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ సమాధానం ఇచ్చారు. కర్ణాటక నుంచి తమిళనాడుకు ఆమెను తరలించాలంటూ అసలు తమకు ఇంతవరకు ఎలాంటి దరఖాస్తు అందనే లేదని ఆయన చెప్పారు.
శశికళను, ఆమె బంధువు ఇళవరసిని కర్ణాటక నుంచి తమిళనాడుకు బదిలీ చేసే ప్రతిపాదన ఏమైనా ఉందా అని అడగ్గా, ఖైదీల నుంచి తమకు అలాంటి దరఖాస్తు రాలేదని లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అన్నడీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌కు 35-40 నిమిషాల పాటు శశికళతో మాట్లాడేందుకు అనుమతి ఇచ్చామని కూడా ఆ సమాధానంలో చెప్పారు. ఆమె గదిలో ఒక్క టీవీ తప్ప అదనపు సదుపాయాలు ఏమీ లేవని స్పష్టం చేశారు. మంచం, పరుపు, ఫ్యాన్, ఏసీ, వాటర్ హీటర్, ప్రత్యేక బాత్రూం.. ఇవేమీ శశికళకు అందించలేదని వివరించారు.
Advertisement